Natyam ad

శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

-నవంబరు 7న యాగంటిలో కార్తీక దీపోత్సవం

– డయల్ యువర్ ఈవోలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి

 

తిరుచానూరు ముచ్చట్లు:

Post Midle

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 20 నుంచి 28వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనున్నాయ‌ని, ఇందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేప‌డుతున్నామ‌ని టిటిడి ఈవో   ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో శనివారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో టిటిడి చేపట్టిన పలు కార్యక్రమాల గురించి భక్తులకు వివరించారు.- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో ప్ర‌ధానంగా నవంబరు 24న గజవాహనం, నవంబరు 25న గరుడవాహనం, నవంబరు 27న రథోత్సవం, నవంబరు 28న పంచమితీర్థం, న‌వంబరు 29న పుష్పయాగం జ‌రుగ‌నున్నాయి. నవంబరు 28న పంచమితీర్థానికి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేపడుతున్నాం.

సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్లు

– తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌, శ్రీనివాసం కాంప్లెక్స్‌, గోవిందరాజస్వామి సత్రాల వద్ద నవంబరు 1 నుండి ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టైంస్లాట్‌ టోకెన్ల జారీని ప్రారంభించాం.

– శని, ఆది, సోమవారాల్లో 25 వేల టోకెన్లు, మిగతా రోజుల్లో రోజుకు 15 వేల టోకెన్లు జారీ చేస్తున్నాం. నిర్దేశిత కోటా పూర్తవగానే కౌంటర్లు మూసివేస్తున్నాం.

– టోకెన్‌ లభించిన భక్తుడు అదేరోజు దర్శనం చేసుకోవచ్చు. టోకెన్లు లేని భక్తులు నేరుగా తిరుమల చేరుకుని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2 ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాం.

– టోకెన్‌ పొందిన భక్తులు తమకు కేటాయించిన సమయంలోనే దర్శన క్యూలైన్లలోనికి రావాల్సిందిగా కోరడమైనది.

– టైంస్లాట్ టోకెన్లు పొందిన భ‌క్తుల‌కు నిర్దేశిత స‌మ‌యంలో త్వ‌ర‌గా ద‌ర్శ‌నం క‌ల్పిస్తున్నాం. టోకెన్లు లేని భ‌క్తులు కంపార్ట్‌మెంట్ల‌లో ఎక్కువ స‌మ‌యం వేచి ఉండాల్సి వ‌స్తుంది. కావున త‌మ ద‌ర్శ‌న స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌కు భ‌క్తులు సంయ‌మ‌నంతో ఉండాల‌ని కోర‌డ‌మైన‌ది.

– టోకెన్ల జారీ ప్రక్రియలో ఎదురయ్యే లోటుపాట్లను సరిదిద్దుకుంటూ క్రమంగా టోకెన్ల సంఖ్యను పెంచుతాం. ఆధార్‌ నమోదు చేసుకుని టోకెన్లు జారీ చేయడం వల్ల భక్తులు దర్శనం చేసుకున్నా, చేసుకోకపోయినా నెలకు ఒకసారి మాత్రమే టోకెన్‌ పొందే అవకాశం ఉంటుంది.

డిసెంబరు 1 నుండి బ్రేక్‌ దర్శన సమయం మార్పు

– శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా డిసెంబరు 1వ తేదీ నుండి విఐపి బ్రేక్‌ దర్శన సమయాన్ని ఉదయం 8 గంటలకు మార్పు చేసి ఒక నెల పాటు ప్రయోగాత్మకంగా అమలుచేస్తాం. భ‌క్తుల అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఆ త‌రువాత త‌గిన నిర్ణ‌యం తీసుకుంటాం.

శ్రీవాణి ట్రస్ట్‌ దాతలకు మాధవంలో గదులు
.
– డిసెంబర్‌ 1వ తేదీ నుంచి శ్రీవాణి ట్రస్ట్‌ దాతలకు తిరుపతిలోని మాధవంలో ఆఫ్‌లైన్‌లో బ్రేక్‌ దర్శన టికెట్లు జారీ చేస్తాం. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో శ్రీ‌వాణి ట్ర‌స్టుకు విరాళాలు ఇచ్చిన దాత‌ల‌కు అక్కడే గదులు కేటాయించడం వల్ల తిరుమలలో వసతికి సంబంధించి ఒత్తిడి తగ్గుతుంది.

కార్తీక మాసంలో విశేష కార్యక్రమాలు

వసంత మండపంలో విష్ణుపూజలు

– లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పవిత్రమైన కార్తీక మాసంలో నవంబరు 4 నుంచి 21వ తేదీ వరకు నాలుగు రోజుల్లో తిరుమల వసంత మండపంలో శ్రీమహావిష్ణువుకు సంబంధించిన పూజలు వైఖానసాగమబద్ధంగా నిర్వహిస్తున్నాం. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో ఈ పూజా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం.

కార్తీక దీపోత్సవాలు

– నవంబరు 7న కర్నూలు జిల్లా యాగంటి, 14న విశాఖపట్నం, 18న తిరుపతిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తాం.

హోమ మహోత్సవాలు

– అక్టోబరు 26 నుండి నవంబరు 23వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీకపిలేశ్వరాలయంలో కార్తీక మాస విశేషపూజ, హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్నాం.

కైశిక ద్వాదశి ఆస్థానం

– కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ‌నివారం శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానం నిర్వహించాం.

– స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు, తెల్లవారుజామున 4.30 నుండి 5.30 గంటల వరకు మాడవీధులలో భక్తులకు దర్శనమిచ్చారు.

నవంబరు 8న చంద్రగ్రహణం

– నవంబరు 8న మంగళవారం చంద్రగ్రహణం కారణంగా ఉదయం 8.40 నుండి రాత్రి 7.20 గంటలకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచడం జరుగుతుంది. ఈ కారణంగా బ్రేక్‌ దర్శనంతోపాటు శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం తదితర ప్రత్యేక దర్శనాలు, ఆర్జితసేవలను రద్దు చేశాం. ఆల‌యం తెరిచిన త‌రువాత సర్వదర్శనం భక్తులను మాత్రమే అనుమతిస్తాం.

నవంబరు 9న ఒంగోలులో శ్రీనివాస కల్యాణం

– నవంబరు 9వ తేదీన సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఒంగోలు శివారులోని క్విస్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఎదురుగా గల మైదానంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తాం.

యుకె, యూరప్‌ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు

– ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున హిందూ ధర్మ ప్రచారం చేయడంలో భాగంగా అక్టోబరు 15 నుంచి నవంబరు 13వ తేదీ వరకు యుకె, యూరప్‌ దేశాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తున్నాం.

– అక్టోబరు 15 నుండి 29వతేదీ వరకు యూరప్‌లోని పలు ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహించాం.

– నవంబరు 5న జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్‌, 6న పారిస్‌ ఫ్రాన్స్‌, 12న లండన్‌ , 13న స్కాట్లాండ్‌లోని ఎడిన్బర్గ్‌లో స్వామివారి కల్యాణాలు నిర్వహిస్తాం.

ధర్మరథం ఉచిత బస్సుల స్థానంలో విద్యుత్‌ బస్సులు

– ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డిగారి ఆదేశాల మేరకు తిరుమలను కాలుష్య రహితంగా తీర్చిదిద్ధడానికి ధర్మరథాల(ఉచిత బస్సుల) స్థానంలో విద్యుత్‌ బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాం. ఇందుకోసం సుమారు రూ.15 కోట్ల విలువ చేసే 10విద్యుత్‌ బస్సులను విరాళంగా అందించేందుకు ఒలెక్ట్రా సంస్థ ముందుకు రావడం సంతోషకరం.

ఉద్యానవనాలకు పూర్వ వైభవం

– తిరుమలలో భక్తులకు ఆహ్లాదకరంగా ఉద్యానవనాలను అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తున్నాం. ఇప్పటికే దాతల సహకారంతో జిఎన్సి టోల్‌ గేట్‌ వద్ద గల గీతోపదేశం పార్కు, జిఎన్సి నుండి బస్టాండ్‌ వరకు రోడ్డుకు కుడి వైపున గల పార్కు, శంఖుమిట్ట వద్దగల నామాల పార్కు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-1 లోపల, శ్రీ పద్మావతి విశ్రాంతిగృహం వద్ద చక్కగా పార్కులను అభివృద్ధి చేసి ఇహ‌లోక వైకుంఠంగా తీర్చిదిద్దాం.

అక్టోబరు నెలలో నమోదైన వివరాలు :

దర్శనం :

– శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య – 22.74 లక్షలు.

హుండీ :

– హుండీ కానుకలు – రూ.122.83 కోట్లు.

లడ్డూలు :

– విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య – 1.08 కోట్లు.

అన్నప్రసాదం :

– అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య – 60.91 లక్షలు.

కల్యాణకట్ట :

– తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య – 10.25 లక్షలు.

ఈ కార్య‌క్ర‌మంలో జెఈవో   స‌దా భార్గ‌వి, సివిఎస్వో   న‌ర‌సింహ కిషోర్‌, ఎస్వీబీసీ సీఈవో   ష‌ణ్ముఖ్ కుమార్‌, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు, ఎస్ఇ-2   జ‌గదీశ్వ‌ర్‌రెడ్డి, ఆరోగ్య‌శాఖాధికారి డాక్ట‌ర్ శ్రీ‌దేవి, ఎస్టేట్ ప్ర‌త్యేకాధికారి   మ‌ల్లికార్జున త‌దిత‌రులు పాల్గొన్నారు.

 

Tags:Elaborate arrangements for the Kartika Brahmotsavam of Sri Padmavati Goddess

Post Midle