తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
– నవంబర్ 18న పంచమి తీర్థానికి అమ్మవారి పుష్కరిణి ముస్తాబు
– టీటీడీ ఈవో శ్రీ ఏవీ.ధర్మారెడ్డి
తిరుపతి ముచ్చట్లు:

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో గల సమావేశ మందిరంలో గురువారం ఉదయం జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇతర టీటీడీ అధికారులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్, పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నవంబర్ 14న గజ వాహనం, 18న పంచమి తీర్థానికి విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, పోలీసుల అధికారులతో సమన్వయం చేసుకొని ట్రాఫిక్ క్రమబద్దీకరణ, బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. పంచమితీర్థం నాడు శ్రీవారి పడి ఊరేగింపు అలిపిరి పాదాలమండపం నుంచి మొదలవుతుందని, కోమలమ్మ సత్రం, పసుపు మండపం మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని తెలిపారు. దారి పొడవునా గజరాజులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని, తిరుపతి కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ఈ మార్గాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
పుష్కరిణి స్నానం కోసం వచ్చే భక్తులు వేచి ఉండేందుకు నవజీవన్ కంటి ఆసుపత్రి, జిల్లా పరిషత్ హైస్కూల్, పూడి రోడ్డు వద్ద జర్మన్ షెడ్లు ఏర్పాటు చేయాలని, ఇక్కడ భక్తుల కోసం క్యూలైన్లు, తాగునీరు, అన్నప్రసాదాలు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పంచమి తీర్థానికి ముందస్తుగా జిల్లా ఎస్పీతో కలిసి భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాలని నిఘా, భద్రత అధికారులను ఆదేశించారు. పంచమి తీర్థానికి విశేషంగా విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అవసరమైనన్ని తాగునీటి బాటిళ్లు సిద్ధంగా ఉంచుకోవాలని, అదనంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆరోగ్య విభాగం అధికారులకు సూచించారు. అదేవిధంగా సిమ్స్, కేంద్రీయ వైద్యశాల నుంచి స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య శిబిరం, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అంబులెన్సులను అందుబాటులో ఉంచాలని కోరారు. అమ్మవారి వాహనాలు, తండ్ల పటిష్టతను ముందస్తుగా పరిశీలించుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహన సేవలో భక్తులను ఆకట్టుకునేలా వివిధ ప్రాంతాల నుంచి కళాబృందాలను ఆహ్వానించాలన్నారు. నవంబరు 7న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 9న లక్ష కుంకుమార్చన, అంకురార్పణకు తగిన ఏర్పాట్లు చేపట్టాలన్నారు. వాహనసేవలను ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని ఆదేశించారు. భక్తులకు సేవలందించేందుకు తగినంత మంది శ్రీవారి సేవకులను ఆహ్వానించాలన్నారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డి, జెఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, అర్చక స్వాములు బాబుస్వామి, మణికంఠ స్వామి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: Elaborate arrangements for Tiruchanur Sri Padmavati Goddess Brahmotsavam
