అన్‌లైన్‌లోనే ఎన్నికల భత్యం

Date:08/11/2018
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
అసెంబ్లీ ఎన్నికల సమరం జోరందుకుంది. డిసెంబర్ 7న పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి భత్యాల చెల్లింపుకు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. ఎన్నికల డ్యూటీలో పాల్గొన్న సిబ్బందికి అన్‌లైన్‌లోనే భత్యాలు చెల్లించాలని అధికారులు నిర్ణయించారు. దాదాపు మూడు రోజుల పాటు నిర్వర్తించే విధులకు సంబంధించిన టీఏ, డీఏలను నేరుగా సిబ్బంది వ్యక్తిగత ఖాతాల్లో జమ చేయాలని అనుకుంటున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇరు జిల్లాల్లో 19,01,564 మంది ఓటర్లు ఉన్నారు. మొత్తంగా 2,300 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8,46,716 ఓటర్లు ఉన్నారు. వీరు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 995 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఇక ఖమ్మం జిల్లా విషయానికి వస్తే. ఇక్కడ 10,54,838 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మంలో 1,305 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో సేవలు అందించేందుకు ఈసీ సిబ్బందిని నియమించింది.
ఉమ్మడి జిల్లాలో 2,300 పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 13,800 మంది అవసరమవుతారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,970 మంది సేవలు అందించనున్నారు. ఇక ఖమ్మం జిల్లాలో 7,830 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. పోలింగ్ కేంద్రాల్లో  రిటర్నింగ్‌ అధికారులు, పరిశీలకులు, జిల్లా పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, సెక్టోరల్‌ అధికారుల అవసరం ఉంటుంది. ఇదిలాఉంటే ఈసీ కొత్త జిల్లాల ప్రాతిపదికనే ఉద్యోగులు,
ఉపాధ్యాయుల గుర్తింపు ప్రక్రియను నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో అధికారులు ఈ మేరకు చర్యలు తీసుకోనున్నారు. ఓట్ల లెక్కింపును కొత్త జిల్లాల ప్రకారమే చేయాలని నిర్ణయించడంతో ఉద్యోగుల కొరత ఏర్పడనుందన్న వార్తలొస్తున్నాయి. దీంతో అందుబాటులో ఉండే సిబ్బంది సరిపోనట్లైతే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలనూ ఎన్నికల విధుల నిర్వహణకు వినియోగించుకోలని అనుకుంటున్నారు. ఇలా ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి భత్యం పక్కాగా చెల్లించేలా ఈసీ చర్యలు తీసుకుంది.
Tags: Election allowance online

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *