ఏపీలో ప్రారంభమైన ఎన్నికల సందడి
Date:16/11/2018
విజయవాడ ముచ్చట్లు:
తెలంగాణ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల, సీట్ల కేటాయింపు లాంటి కీలక ఘట్టాలు జోరుగా కొనసాగుతుండగా, ఏపీలో కూడా ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ పార్టీ వ్యూహరచన కమిటీతో సమావేశమయ్యారని సమాచారం. దీనికి మంత్రులు, పార్టీ నేతలు హాజరయ్యారని తెలుస్తోంది. ఈ సందర్భంగా చంద్రబాబు నేతలంతా ప్రజల్లోకి వెళ్లి, ప్రభుత్వ పథకాల గురించి తెలియజెప్పాలని ఉద్బోధించారట. వీటిని ప్రజల్లోకి ఎవరైతే బలంగా తీసుకెళ్లి, వారితో మమేకమవుతారో వారికే సీట్లు దక్కుతాయని చెప్పారట. దీనితోపాటు తాను స్వయంగా చేయించుకుంటున్న సర్వేల ఆధారంగా సీట్లు కేటాయిస్తానని తేల్చిచెప్పారని సమాచారం. నేతలంతా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని ప్రజల మధ్యకు వెళ్లాలని సూచించినట్లు భోగట్టా ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కూడా ఈ సమావేశంలో సమీక్షించారని తెలుస్తోంది.
కేంద్రం నుంచి ఏపీకి ఏమాత్రం సాయం లేకపోయినా, రాష్ట్రానికి నిధులు కొరత ఏర్పడినా కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని గుర్తుచేశారట. ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని సమాచారం. అలాగే రాజకీయాలను, అభివృద్ధినీ ఎంతమాత్రం వేరు చేసి మాట్లాడకూడదనీ, వాటిని కలిపి చూడాల్సిందేనని సీఎం నేతలతో చెప్పారని తెలుస్తోంది. ఇదిలావుండగా ఎన్నికల అధికారి సిసోడియా కూడా ఏపీలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామనీ, వీవీ ప్యాడ్లను దశలవారీగా తెప్పిస్తున్నామని తెలిపారు. కాగా ఫిబ్రవరి మూడో వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇవి షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న ఎన్నికలైనప్పటికీ, వేగవంతంగా ఏర్పాట్లు చేస్తేగానీ అప్పటికి పూర్తి కావని సమాచారం. ఏదిఏమైనప్పటికీ ఎన్నికల ఏర్పాట్ల గురించి అటు చంద్రబాబు ఇటు ఎన్నికల అధికారి ఒకే సమమంలో స్పందించడం విశేషం. దీంతో ఏపీలో ఎన్నికల వేడి మొదలైనట్టేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Tags:Election campaign started in AP