Natyam ad

తెలంగాణలో ఎన్నికల మూడ్…

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణలో అప్పుడే ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. రాజకీయ పార్టీల హడావిడి, ప్రభుత్వ విభాగాల జోరు చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల దిశగా అడుగులు పడుతున్నాయన్న అభిప్రాయం బలపడుతోంది. విపక్షాలు పాదయాత్రలు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. అదేసమయంలో ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాల అమలును వేగవంతం చేస్తోంది. ఫ్లాగ్ షిప్ పథకాల పనులను పట్టాలెక్కిస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలలో పాల్గొన బోతున్నారు. మరోవైపు తెలంగాణలో పాగా వేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న భారతీయ జనతా పార్టీ దూకుడును కొనసాగిస్తోంది. మునుగోడులో జస్ట్ మిస్సయిన గెలుపును వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖాయం చేసుకుంటామని కమలనాథులు ఢంకా బజాయించి చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలోను కాస్త దూకుడు కనిపిస్తున్నా.. అక్కడ లుకలుకలు హస్తిన దాకా వెళ్ళి టీపీసీసీ ప్రెసిడెంటుకు ఎంబర్రాస్సింగ్‌గా మారాయి. ఇంకోవైపు తమ ప్రాబల్యాన్ని కూడా చాటుకునేందుకు యత్నిస్తున్న వామపక్షాలు, వైఎస్ఆర్‌టీపీ, బీఎస్పీ లాంటి పార్టీలు సైతం తమతమ కార్యక్రమాలను ముమ్మరం చేశాయి.రెండు, మూడు రోజులుగా బండి సంజయ్ కుమార్, వైఎస్ షర్మిలల పాదయాత్రలు తెలంగాణలో కలకలం రేపాయి. మతపరమైన ఘర్షణలతో సున్నితమైన ప్రాంతంగా ముద్రపడిన నిర్మల్ జిల్లా భైంసా నుంచి అయిదో విడత పాదయాత్రకు బండి సంజయ్ కుమార్ సమాయత్తం అవడం.. దానికి పోలీసులు అనుమతి నిరాకరించి, ఆయన్ను గృహనిర్బంధం చేయడంతో కలకలం మొదలైంది. దాంతో బీజేపీ నేతలు భైంసా బహిరంగ సభతోపాటు పాదయాత్రకు అనుమతించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. షరతులతో కూడిన అనుమతి పొందారు. దాంతో నవంబర్ 29న బీజేపీ బహిరంగ సభ నిర్వహించింది. నవంబర్ 30వ తేదీ నుంచి బండి సంజయ్ కుమార్ పాదయాత్రను ప్రారంభించారు.

 

 

 

మరోవైపు నర్సంపేట సమీపంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలనులో స్థానిక టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారి తీసింది. టీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గులాబీ శ్రేణులు ఆమెను అడ్డుకున్నారు. ఆమె వాహనంపై దాడి చేశారు. ఉద్రిక్తత తీవ్రమవడంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి తరలించారు. ఆ తర్వాతి రోజు అంటే నవంబర్ 29న షర్మిల హైదరాబాద్ నగరంలో సంచలనం సృష్టించారు. టీఆర్ఎస్ శ్రేణుల దాడితో డ్యామేజీ అయిన తన కారును ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చూపిస్తానంటూ షర్మిల ప్రగతిభవన్‌కు బయలుదేరారు. సోమాజీగూడ దగ్గర షర్మిల వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు… ఆమె కారులో వుండగానే దాన్ని ట్రాఫిక్ వాహనానికి టోయ్ చేసి.. సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. షర్మిలను అరెస్టు చేసి.. రిమాండుకు తరలించగా.. కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అదేసమయంలో తన పాదయాత్రకు అనుమతించాలంటూ షర్మిల కోర్టును ఆశ్రయించి, షరతులతో కూడిన అనుమతి పొందారు. డిసెంబర్ 1 నుంచి షర్మిల పాదయాత్ర కొనసాగనున్నది.ఇక ప్రభుత్వాధినేత కేసీఆర్ కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది. చిరకాలంగా పెండింగులో వున్న మెట్రో రైల్ రెండో దశకు శంకుస్థాపన చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది.

 

 

 

డిసెంబర్ 9 ఇందుకు ముహూర్తంగా ఖరారు చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు దాకా నిర్మాణం కానున్న మెట్రో ఎక్స్‌ప్రెస్ వేను రూ.6,250 కోట్ల వ్యయంతో మూడేళ్ళలో పూర్తి చేస్తామని, కేంద్ర ప్రభుత్వ సాయం లేకుండా పూర్తిగా రాష్ట్ర నిధులతోనే మెట్రో ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తామని కేటీఆర్ వెల్లడించారు. కేవలం మూడేళ్ళలో నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యంగా కనిపిస్తుండగా.. రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో మెట్రో మార్గ నిర్మాణం సవాళ్ళతో కూడుకున్నదిగా కనిపిస్తోంది. ఇక పాత సచివాలయ భవనాలను నేలమట్టం చేసి, కొత్తగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సెక్రెటేరియట్ భవనాన్ని జనవరి 18న ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నాలుగేళ్ళ క్రితం ప్రారంభమైన సచివాలయ నిర్మాణం ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఇంకా 50 రోజుల వ్యవధి మాత్రమే వుండడంతో తుది మెరుగులు దిద్దే పనులను వేగవంతం చేయాలని కేసీఆర్ ఇటీవల నిర్మాణ పనులను పరిశీలించిన సందర్భంగా అధికారులను ఆదేశించారు. ఇక మూడో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహావిష్కరణ. ఫిబ్రవరి నాటికి నిర్మాణ పనులను పూర్తి చేయడం ద్వారా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ముఖ్యమంత్రి సంసిద్దమవుతున్నారు. ఎన్టీఆర్ మార్గ్‌లో ఐమాక్స్ థియేటర్ ప్రక్కన నిర్మాణమవుతున్న అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను ఇటీవల మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. వేగవంతం చేయాలని ఆదేశించారు.

 

 

 

ఇలా ప్రభుత్వాధినేతలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది.ఇక తెలంగాణలో మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ పరిస్థితి కాస్త భిన్నంగా వుంది. ఎన్నికల దిశగా టీపీసీసీ వేస్తున్న అడుగులు ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా కొనసాగుతున్నాయి. టీపీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం ద్వారా పలువురు పని విభజన చేస్తూ ఎన్నికల దిశగా అడుగులు వేద్దామనుకున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పార్టీలో లుకలుకలు అడ్డంకిగా మారాయి. రేవంత్ కార్యవర్గం కూర్పుపై పలువురు సీనియర్లు ఫిర్యాదుల పర్వానికి తెరలేపారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు పార్టీని వీడిన నేపథ్యంలో రేవంత్ రెడ్డిపై అసంతృప్తి పెరిగిపోవడం టీ.కాంగ్రెస్‌లో ఆందోళన రేపుతోంది. పార్టీ కీలక నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేణుకా చౌదరి, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ తదితరులు నవంబర్ 29న న్యూఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఫిర్యాదు చేశారు. తమ సిట్టింగు స్థానం మునుగోడును అధికార టీఆర్ఎస్ పార్టీకి వదిలేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నైతికస్థైర్యం కోల్పోకుండా చూసుకుంటూ ఎన్నికల దిశగా అడుగులు వేయాల్సిన రేవంత్ రెడ్డికి పార్టీలో రగులుకుంటున్న అసమ్మతి, అసంతృప్తి అడ్డంకిగా మారుతున్నాయి. ఏదిఏమైనా తెలంగాణలో ప్రధాన పార్టీల చర్యలను చూస్తుంటే 2023 తొలి నాళ్ళలోనే ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

 

Tags: Election Mood in Telangana…