మార్చి మొదటి వారంలో  ఎన్నికల నోటిఫికేషన్ 

Date:14/01/2019
న్యూఢిల్లీ ముచ్చట్లు:
లోక్ సభ ఎన్నికలు తెలంగాణలో ఒకే దశలో జరగనుండగా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రెండు దశల్లో జరుగుతాయని విశ్వసనీయ సమాచారం. ఫిబ్రవరి చివరి వారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలవుతుందని, లేకుంటే, మార్చి మొదటివారంలో ఈసీ షెడ్యూల్ ను ప్రకటిస్తుందని సమాచారం.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు మొత్తం ఒకే దశలో ప్రశాంతంగా ముగిసినందునే లోక్ సభ ఎన్నికలను కూడా ఒకే దశలో ముగించేందుకు ఈసీ ప్రణాళిక రూపొందించనుందని తెలుస్తోంది. తెలంగాణతో పోలిస్తే ఏపీలో లోక్‌ సభ నియోజకవర్గాలు అధికంగా ఉండటం, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలను సైతం జరిపించాల్సివుండటం కారణంగానే రెండు దశల ఆలోచనను ఈసీ చేస్తున్నట్టు సమాచారం.ఈ మేరకు రాష్ట్రాల సీఈఓలకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మార్గదర్శకాలు అందాయి. వచ్చే వారం నుంచి ఎలక్షన్ కమిషన్ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి, అధికారులతో సమీక్ష జరపనుంది. రాష్ట్రాల పర్యటన పూర్తి అయిన వారం, పది రోజుల్లోగానే షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మే 24లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సివుండగా, ఈ నెల 25 నుంచి ఓటు హక్కుపై ఈసీ ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించనుంది. ఇటీవలి ఎన్నికల్లో తమ ఓట్లు గల్లంతయ్యాయని లక్షలాది మంది ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో, ఓటర్లు తమ ఓటు వివరాలను 1950కి ఫోన్‌ చేసి తెలుసుకునే ఏర్పాటును చేసింది.
Tags:Election notification in the first week of March

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *