Natyam ad

ఉద్యోగుల సహకారం అభినందనీయం-ఈవో   ఎవి ధర్మారెడ్డి

– క్లిష్ట సమయంలో భక్తులకు ఇబ్బందులు రాకుండా ఉద్యోగులు పని చేస్తున్నారు

 

తిరుమల ముచ్చట్లు:

Post Midle

క్లిష్ట సమయంలో తమ సంస్థ ప్రతిష్ట కాపాడుతూ భక్తులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా సేవలందించేందుకు ఉద్యోగులు ముందుకురావడం అభినందనీయమని టీటీడీ ఈవో   ధర్మారెడ్డి చెప్పారు. భక్తుల సేవే భగవంతుని సేవగా భావించి ఉద్యోగులు యాజమాన్యానికి అవసరమైన ప్రతి సందర్భంలో అండగా నిలవాలని ఆయన కోరారు . ఉద్యోగులు సంస్థను తమ సొంత ఇంటిలా భావించి పారిశుధ్య పనులకు ముందుకు వచ్చారని వారిలో ఉత్సాహం నింపారు . ఇదే స్పూర్తితో భక్తులకు మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేందుకు శుద్ధ తిరుమల – సుందర తిరుమలగా తయారు చేయడంలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్   వెంకటరమణా రెడ్డి తో కలసి ఆయన పిలుపు నిచ్చారు .తిరుమలలో ఆదివారం ఉదయం డిప్యుటేషన్ సిబ్బందితో కలిసి ఈవో పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

 

 

ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన 1600 మంది సులభ ఏజెన్సీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు టీటీడీ యాజమాన్యానికి తెలియజేయకుండా సమ్మెకు వెళ్లారన్నారు. తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు కార్పొరేషన్లు , స్విమ్స్, బర్డ్ సంస్థల నుండి పారిశుద్ధ్య కార్మికులను సమీకరించి ఎనిమిది రోజులుగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ పారిశుధ్య చర్యలు చేపట్టిందని చెప్పారు.టీటీడీలోని 8 వేల నుండి 10 వేల మంది పర్మినెంట్, కార్పొరేషన్ ఉద్యోగులకు, ప్రతిరోజు 600 నుండి 700 మందికి తిరుమలలో డిప్యుటేషన్ డ్యూటీ వేసినట్లు తెలిపారు. ఇందులో ఈవో, జేఈవోలు, సివిఎస్వో , డిప్యూటీ
ఈవో లు , సూపరింటెండెంట్లు , ఎగువ, దిగువ శ్రేణి గుమస్తాలు, లెక్చరర్లు, ఉపాధ్యాయులు, డాక్టర్లు ఉన్నారన్నారు. వీరందరికి ప్రతినెల మూడుసార్లు తిరుమలలో డ్యూటీలు వేయడం జరిగిందని చెప్పారు.తిరుమలలో విధులు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్మికులు సమ్మె చేస్తున్నందున, ఉద్యోగులు సహకరించాలని తాను కోరినట్లు ఈవో తెలిపారు. అందుకు ఉద్యోగులు భగవంతుని సేవలో మనస్ఫూర్తిగా భాగస్వామ్యులై భక్తులకు సేవలు అందించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన శ్రీవారి సేవకులు భక్తులకు సేవలు అందించేందుకు పారిశుధ్య కార్యక్రమంలో భాగస్వామ్యులయ్యారని చెప్పారు. నెలరోజుల పాటు అధికారులు, ఉద్యోగులు ఈ విధుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటారని ఈవో చెప్పారు. భక్తులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా టీటీడీ అధికారులు, ఉద్యోగులు, శ్రీవారి సేవకులు పారిశుధ్య పనుల్లో పాల్గొంటామని ఈవో స్పష్టం చేశారు.

 

 

 

పారిశుధ్య నిర్వహణ కోసం ఇప్పటికే ఐదు ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్ ఇచ్చామని, వీరు వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుండి కార్మికులను సమీకరించి తీసుకొస్తున్నారని చెప్పారు. వీరికి కనీస వేతనాలు, అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు, శ్రీవారి దర్శనం, సబ్సిడీపై లడ్డూ ప్రసాదాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.కష్ట సమయంలో టీటీడీ యాజమాన్యానికి సహకరించిన ఉద్యోగులకు, మీడియా మిత్రులకు, మీడియా యాజమాన్యాలకు , శ్రీవారి సేవకులకు ఈవో కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా భక్తులు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.అంతకుముందు ఈవో  ధర్మారెడ్డి – సిఆర్ ఓ, జిల్లా కలెక్టర్  వెంకటరమణారెడ్డి – లేపాక్షి సర్కిల్, జేఈవోలు  సదా భార్గవి – పాత అన్నదానం కాంప్లెక్స్,  వీరబ్రహ్మం – వైకుంఠం క్యూ కాంప్లెక్స్, సివిఎస్ వో  నరసింహ కిషోర్ జియన్సి,సిఈ  నాగేశ్వరరావు – శిలాతోరణం, ఎఫ్ ఎసిఎవో
బాలాజి – నారాయణగిరి ఉద్యానవనాలు తదితర ప్రాంతాల్లో ఉద్యోగులు, శ్రీవారి సేవకులతో కలిసి పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎస్వీ బీసీ సిఈవో  షణ్ముఖ కుమార్, ఎస్ ఈ 2 జగదీశ్వర్ రెడ్డి, డిఈవో భాస్కర్ రెడ్డి తో పాటు అన్ని విభాగాల అధికారులు ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:Employees’ cooperation is appreciated-EV Dharma Reddy

Post Midle