పిఆర్సీ నివేదికపై భగ్గుమంటున్న ఉద్యోగులు

Date:27/01/2021

హైదరాబాద్ ముచ్చట్లు:

తెలంగాణ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పీఆర్సీ నివేదికపై టీఎన్జీవో నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు రాజేందర్… మాట్లాడుతూ పీఆర్సీ నివేదిక ఉద్యోగుల వ్యతిరేక నివేదికగా పేర్కొన్నారు. ఈ వ్యవహారం కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. త్రీ మెన్ కమిటీతో చర్చలు జరిపేదిలేదని కుండబద్దలు కొట్టారు టీఎన్జీవో అధ్యక్షుడు. కేవలం సీఎంతో కలవాలని ఆయన అడుగుతున్నారు.కేసీఆర్‌ను కలిసి 63 శాతం ఫిట్‌మెంట్ అడుగుతామన్నారు. ఆర్థిక మాంద్యం ఉందని 30 నెలలుగా అర్థం చేసుకుని ఓపిక పట్టామన్నారు. కానీ, పీఆర్సీ కమిటీ నివేదిక ఉద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ నివేదికలో 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసింది పీఆర్సీ కమిషన్.. కనీస వేతనం రూ.19 వేలు ఇవ్వాలని సూచించింది.. ఉద్యోగుల పదవివిరమణ వయస్సు 60 ఏళ్లకు పెంచాలని సిఫార్సు చేసింది. ఇక, హెచ్‌ఆర్‌ఏను తగ్గిస్తూ ప్రభుత్వానికి సూచనలు చేసిన పీఆర్సీ.

 

 

హెచ్‌ఆర్‌ఏలో కూడా బాగా కోతపెట్టింది పీఆర్సీ. 30 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉన్న చోట 24 శాతానికి.. 20 శాతం ఉన్న చోట 17శాతానికి.. 14.5 శాతంగా ఉన్న చోట 13 శాతానికి, 12 శాతంగా ఉన్న దగ్గర 11 శాతానికి తగ్గించారు. మరోవైపు ఎన్జీవోల పిల్లల ట్యూషన్ ఫీ రియింబర్స్ మెంట్ కూడా లేదని స్పష్టం చేసింది. గ్రాట్యూటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంచింది ప్రభుత్వం. శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంచింది. సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని నిర్ణయించింది. 2018 జులై 1 నుంచి ఈ వేతన సవరణ అమలుకు కమిషన్‌ సిఫార్సు చేసింది.అయితే పీఆర్సీ నివేదికపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

 

 

మరోవైపు పీఆర్సీ ఈ నివేదికపై ఉద్యోగ సంఘాలతో అధికారులు చర్చించనున్నారు. ప్రస్తుతం ఉద్యోగుల చూపు మొత్తం సర్కారు ప్రకటన కోసం చూడాల్సి ఉంటోంది. ఎందుకంటే పీఆర్సీ నివేదిక రావడంతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఉద్యోగ సంఘాల నేతలతో త్రీమెన్ కమిటీ చర్చించనున్నారు. అనంతరం రేపు లేదా ఎల్లుండి సీఎం కేసీఆర్‌తో సమావేశం అయ్యేందుకు ఉద్యోగ సంఘాల నేతలు సిద్ధంకానునన్నారు. సీఎం కేసీఆర్‌తోనే చర్చిస్తేనే మెరుగైన ఫిట్మెంట్ వస్తుందని భావిస్తున్నారు.

ఎస్వీ వేద పరిరక్షణ ట్రస్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళం

Tags: Employees frustrated over PRC report

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *