ఉష్ణోగ్రలకు విలవిల్లాడుతున్న ఉపాధి కూలీలు

Date:14/04/2018
మెదక్ ముచ్చట్లు:
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉదయం 9 దాటితే జనాలు ఇళ్లల్లోంచి బయటకు వచ్చేందుకు జంకుతున్న పరిస్థితి. అయితే కార్యాలయాలకు, అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారికి ఎండ నుంచి సమస్యలు తప్పడంలేదు. వీరందరికంటే ఉఫాధి కూలీల అగచాట్లు తీవ్రంగా ఉన్నాయి. ఉఫాధి హామీ పథకం కింద కొనసాగుతున్న పనుల వద్ద కూలీలకు సరైన వసతులు ఉండడంలేదు. దీంతో కూలీలకు ఎండ నుంచి తప్పించుకునే మార్గం లేకపోయింది. కూలీలు సేద తీరేందుకు కొన్ని ప్రాంతాల్లో టెంట్లు కూడా వేయడంలేదు. దీంతో వారు నానాపాట్లు పడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద కూలీలు మధ్యాహ్నం వరకు పని చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా చెరువు పూడికతీత, కట్టుకాల్వల పనులు జరుగుతున్నాయి. దీంతో పరిసరాల్లో చెట్ల నీడ సైతం లేని దుస్థితి. ఫలితంగా కూలీలు నీరసించిపోతున్నారు. గతేడాది జిల్లాలోని 20 మండలాల్లో శ్రమశక్తి సంఘాలకు సర్కారు టెంట్లను పంపిణీ చేసింది. వాటిని క్షేత్ర సహాయకుల ద్వారా మేట్లకు అందజేయాలి. అయితే ఈ నిబంధన సమర్ధవంతంగా అమలు కావడంలేదు. టెంట్లను మేట్లకు అందించకుండా  క్షేత్రసహాయకుల వద్ద ఉంచుకుని వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి టెంట్లను పనులు జరిగే ప్రదేశానికి తీసుకెళ్లి ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మేట్లది. టెండ్లు వేసినందుకు గాను వారికి ప్రభుత్వం అదనంగా  రూ.10 కూడా చెల్లిస్తోంది. అయితే అనేక గ్రామాల్లో క్షేత్ర సహాయకులు టెంట్లను మేట్లకు ఇవ్వడంలేదు. దీంతో టెంట్లు ఉన్నట్లు చాలామందికి తెలీడం లేదని స్థానికులు అంటున్నారు. మరోవైపు గతేడాది ఉపాధి కూలీల కోసం సర్కార్ మెడికల్‌ కిట్లు అందించింది. అయితే ఈసారి పంపిణీ చేయలేదు. దీంతో పనిచేసే ప్రదేశంలో ప్రథమ చికిత్స అందించే అవకాశం లేకుండాపోతోందని కూలీలు వాపోతున్నారు. ఎండలో పనిచేసి నీరసించే కూలీలకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌లు ఇవ్వాల్సి ఉన్నా క్షేత్ర సహాయకులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ప్రభుత్వం, సంబంధిత యంత్రాంగం సత్వరమే స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో ఎండ నుంచి రక్షణ కల్పించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags: Employment wage workers at temperatures

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *