అన్నమయ్య సంకీర్తనల రికార్డింగ్‌లో స్థానిక యువ కళాకారులకు ప్రోత్సహం – ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసూరావు
శ్రీవారి అనుగ్రహంతో అన్నమయ్య సంకీర్తనలు గానం – గాయకులు శ్రీనివాస శర్మ
జనం నోట కొత్తగా స్వరపరిచిన సంకీర్తనలు – డా. విభీషణ శర్మ
తిరుమల ముచ్చట్లు:

అన్నమయ్య సంకీర్తనల్లోని భక్తిభావనను జనబాహుళ్యంలో విస్తృత ప్రచారం కల్పించడంతోపాటు, సంకీర్తనల రికార్డింగ్‌లో స్థానిక యువ కళాకారులకు టీటీడీ ప్రాధాన్యత కల్పిస్తోందని ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ సాలూరి వాసూరావు చెప్పారు. తిరుమల రాంభగీచా-2లోని మీడియా సెంటర్‌లో ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్. విభీషణ శర్మ, ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులతో శనివారం మీడియా సమావేశo నిర్వహించారు.ఈ సందర్భంగా సాలూరి వాసూరావు మాట్లాడుతూ, టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి శాస్త్రీయ సంగీతంలోని మాధుర్యాన్ని, శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని భక్తులకు చేరువ చేయడంతో పాటు స్థానిక కళాకారులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. గత నాలుగు సంవత్సరాలుగా తాను 380 అన్నమయ్య సంకీర్తనలను కొత్తగా స్వరపరిచిన భక్త కోటికి అందించినట్లు తెలిపారు. టీటీడీ 10 సంకీర్తనలు ఒక సిడిగా రూపొందిస్తొందన్నారు. వీటిని రాగ తాళ యుక్తంగా స్వరపర్చి పంపితే, టీటీడీలోని ప్రముఖ సంగీత విద్వాంసులు పరిశీలించిన తరువాతే రికార్డింగ్ చేస్తున్నట్లు వివరించారు.ప్రముఖ గాయకులు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ, శ్రీవారి అనుగ్రహంతో అన్నమయ్య సంకీర్తనలు ఆలపించే అవకాశం లభించినట్లు చెప్పారు. తాను 2014వ సంవత్సరం నుండి తిరుమల నాదనీరాజనం వేదికపై ప్రదర్శనలిస్తున్నట్లు తెలిపారు. జన బాహుళ్యంలో ప్రసిద్ది చెందిన రాగలతో ఆలపిస్తేనే తొందరగా భక్తులకు చేరుతుందన్నారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు రూపొందించే సిడిలలో తానూ ఒక సిడిలోని 10 సంకీర్తనలు ఆలపించే అవకాశం లభించడం ఎన్నో జన్మల పుణ్యఫలమన్నారు. ఈ గాన యజ్ఞంలో యువతను ప్రోత్సహిస్తున్న ఈవోకు కృతజ్ఞతలు తెలిపారు.
తరువాత ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్. విభీషణ శర్మ ప్రసంగిస్తూ, జనం నోట కొత్తగా స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనలు పలికించాలన్నారు. వీటిని స్వరపరిచిన సంగీత దర్శకులు, గాయకులు నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాదనీరజనంపై ఆలపిస్తున్నట్లు తెలిపారు. శ్రీ అన్నమయ్య శ్రీవారిపై 32 వేలకు పైగా సంకీర్తనలు రచించినట్లు, వీటికి అర్థ తాత్పర్యాలు, ఆ సంకీర్తన ఏ సందర్భంలో రాశారు, మూలం ఏమిటి అనే విశేష అంశాలు తెలియజేసేందుకు టీటీడీ కృషి చేస్తోందన్నారు. ఇప్పటి వరకు 290 సంకీర్తనలు భక్తులకు అందించామని, త్వరలో మరో 300 సంకీర్తనల సిడిలు అందించనున్నట్లు వివరించారు.మీడియా సమావేశంలో ఏపీఆర్వో కుమారి పి.నీలిమ, గాయకులు శ్రీదేవి, భాగ్యశ్రీ, అనన్య పాల్గొన్నారు.
Tags: Encouraging local young artistes in recording Annamayya sankirtanas – Eminent music director Saluri Vasurao
