అంతరించిపోతున్న అడవి  

Endangered jungle

Endangered jungle

Date:17/04/2018
తిరువూరు ముచ్చట్లు:
జిల్లాలో పచ్చదనం వేగంగా తగ్గిపోతోంది. అక్రమార్కుల స్వార్థం కారణంగా క్రమేణా మాయమవుతోంది. అడవులు ఆక్రమణ చెరలో మగ్గుతున్నాయి. ఫలితంగా పచ్చదనం ఉండాల్సిన విస్తీర్ణణం కంటే గణనీయంగా పడిపోయింది. ఆక్రమణదారులపై కేసులు నమోదు చేసేందుకే అటవీ అధికారులు పరిమితమయ్యారు. కబ్జా కోరల్లో చిక్కుకున్న భూములను స్వాధీనం చేసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఏళ్ల తరబడి ఫలసాయం అనుభవిస్తున్నా చర్యలు తీసుకోలేని పరిస్థితి. జిల్లాలో దాదాపు 10వేల హెక్టార్లలోని అటవీ భూములు ఆక్రమణకు గురయ్యాయి.
వ్యవసాయ విద్యుత్తు మోటార్లతో సాగు నీటిని అందిస్తూ రెండు పంటలు పండించటం ద్వారా జేబులు నింపుకుంటున్నారు. కొండపల్లి, అడవినెక్కలం, ఎ.కొండూరు, జి.కొండూరు, తిరువూరు, తదితర ప్రాంతాల్లోని భూములు ఎక్కువగా ఆక్రమణలకు గురయ్యాయి. ఈ పరిస్థితుల్లో అటవీ శాఖ కొన్ని భూములనైనా ఆక్రమణల చెర నుంచి    విడిపించేందుకు కసరత్తు ప్రారంభించింది. దీనికి రెవెన్యూ, సర్వే శాఖల నుంచి కూడా మద్దతు అవసరం. ఈ మూడు శాఖల మధ్య సమన్వయం ఉంటే ఇది ఫలితాన్నిస్తుంది.
జిల్లాలో మొత్తం మూడు అటవీ రేంజ్‌లలో కలిపి మొత్తం 49,716.87 హెక్టార్ల అడవి ఉంది. నూజివీడు రేంజ్‌లో 12,708.8 హెక్టార్లు, మైలవరం పరిధిలో 11,619.67 హె., విజయవాడ రేంజిలో 25,388.4 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. విస్తీర్ణం బాగానే ఉన్నా.. ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయి. 10వేల హెక్టార్లు పైగా అన్యాక్రాంతమయ్యాయి. మొత్తం విస్తీర్ణంలో ఇది 20 శాతం. జిల్లాలో మొత్తం 33.3 శాతం సాధారణ అటవీ విస్తీర్ణంలో కేవలం 7.55 శాతంలోనే దట్టమైన అడవులున్నాయి. వీటిల్లోనూ చాలా వరకు పరాధీనమయ్యాయి. చెట్లను కొట్టేస్తూ పోతే పర్యావరణానికి తీవ్ర ముప్పు తప్పదు. వర్షపాతం బాగా పడిపోతుంది. జిల్లాలోని అటవీ విస్తీర్ణం నానాటికీ తగ్గుతోంది. దీనివల్ల భూగర్భ నీటి మట్టం కూడా అడుగంటుతోంది. ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. సకాలంలో వానలు పడక వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయి. దీనికి తోడు జంతువుల సంచారానికి ఇబ్బందిగా పరిణమించింది. అటవీ ప్రాంతం కుచించుకుపోతుండడంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది.
ముసునూరు మండలం కాండ్రెనిపాడులో దట్టమైన రిజర్వు అటవీ ప్రాంతం ఉంది. మొత్తం 1,857 హెక్టార్లకు గాను 1,594 హెక్టార్లు అన్యాక్రాంతమయ్యాయి. కాట్రేనిపాడు, చిల్లబోయినపల్లి, వేల్పుచర్ల, గోపవరం, చెక్కపల్లి, గుడిపాడు, తదితర ప్రాంతాల్లో ఆక్రమణలు ఎక్కువయ్యాయి. కేసులు ఎక్కువగా కోర్టుల్లో ఉన్నాయి. వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లు దాదాపు 120 ఉన్నాయి. ఛాట్రాయి మండలంలో దాదాపు 3వేల ఎకరాల వరకు భూములు అన్యాక్రాంతమయ్యాయి. అత్యధికంగా ఆరుగొలనుపేటలో 2,400 ఎకరాల విస్తీర్ణం ఆక్రమణకు గురైంది. సోమవరం, చిత్తపూరులో 600 ఎకరాల వరకు ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. వీరంతా బయట ప్రాంతాలకు చెందిన భూస్వాములు కావడం గమనార్హం. ఇవన్నీ సాగుకు అనుకూలమైనవి కావడంతో మామిడి, మొక్కజొన్న, తదితర పంటలు వేసుకుంటున్నారు.
మైలవరం మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పొందుగలలో 40 ఎకరాలు, తోలుకోడులో 10 ఎకరాలకుపైగా ఆక్రమించేశారు. వీటిల్లో మామిడి, పత్తి పంటలను సాగు చేస్తున్నారు. తమ భూముల సమీపంలోని అటవీ భూములను కూడా ఆక్రమించి కలిపేసుకుని సేద్యం చేసుకుంటున్నారు. ఏ.కొండూరు సెక్షన్‌ పరిధిలోని తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లో రెండు హెక్టార్లలో అటవీభూములు విస్తరించి ఉన్నాయి. 200 హెక్టార్లలో వనసంరక్షణ సమితుల కింద మొక్కలు నాటారు. అధికారుల అంచనా ప్రకారం కొండలు, గుట్టలు మినహా మిగిలిన మైదాన భూమి దాదాపు ఆక్రమణల చెరలోనే ఉంది. ఇదే మండలం కృష్ణారావుపాలెం, చీమలపాడు రెవెన్యూ పరిధిలో వందలాది ఎకరాల అటవీభూమిని పలువురు రాజకీయ పలుకుపడి కలిగిన భూస్వాములు ఆక్రమించి మెట్ట పంటలతో పాటు మామిడి సాగు చేస్తున్నారు. విద్యుత్తు కనెక్షన్లు పొంది నిబంధనలకు విరుద్ధంగా బోర్లు వేసి వ్యవసాయ విద్యుత్తు మోటార్ల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు.
తిరువూరు మండలం మల్లేల, రామన్నపాలెం, ఆంజనేయపురం, చౌటపల్లి, రెవిన్యూ పరిధిలో వందలాది ఎకరాల అటవీభూమి ఆక్రమణలకు గురైంది. కొందరు ఆక్రమించిన భూములకు తప్పడురికార్డులు సృష్టించి క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఆక్రమించిన భూముల్లో సాగు చేస్తున్నారు. మల్లేలలోనూ వివాదం కొనసాగుతోంది.  గంపలగూడెం మండలం వినగడప, కనుమూరు రెవిన్యూ పరిధిలోని అటవీభూములు సైతం అన్యాక్రాంతానికి గురయ్యాయి. అటవీభూములకు సమీపంలో వ్యవసాయ భూములు ఉన్న కొందరు అభయారణ్యంకు చెందిన భూములను ఆక్రమించి మెట్టపంటలను సాగు చేస్తున్నారు.
Tags:Endangered jungle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *