ఇంగ్లీష్.. వింగ్లీష్

Date:12/06/2019

కాకినాడ ముచ్చట్లు:

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రవేశ పెట్టనున్నట్లు కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా హర్షించదగ్గ పరిణామంగా విద్యావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు 3,804 పాఠశాలల్లో విధిగా ఆంగ్ల మాధ్యమం అమల్లోకి వస్తుంది. ఆంగ్ల మాధ్యమ మోజులో రూ. వేలాది ఖర్చు పెట్టుకుని ప్రైవేటు వైపు పరుగులు తీస్తున్న తల్లిదండ్రులకు వ్యయ ప్రయాసలు తప్పుతాయి. బడులు తెరిచే నాటికే విధివిధానాలు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు.
జిల్లాలో ఆంగ్లమాధ్యమ విద్య నిర్వహణ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగుల వెనక్కి అన్న చందాన నడుస్తోంది. ఎంతో ఉన్నతాశయంతో ప్రారంభించిన ఈ పథకం తొమ్మిది సంవత్సరాలు నిండినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదు. 2008-09లో అప్పటి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్‌ పథకం పేరిట అన్ని జిల్లాల్లోనూ ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ ఇంటర్‌ వరకూ అమలు చేస్తామన్నారు. ప్రతి పాఠశాల అభివృద్ధికి రూ. కోటి నిధులు ఇస్తామన్నారు.

 

 

 

 

 

 

14 మంది ఉపాధ్యాయులను ప్రత్యేకంగా నియమిస్తామని, ఒక పీడీని, ఒక ప్రధానోపాధ్యాయుడ్ని కేటాయిస్తామని చెప్పారు. సక్సెస్‌ పథకంలోని పాఠశాలలకు 11 కంప్యూటర్లు, ఒక జనరేటర్‌, ఇద్దరు బోధకులను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రైవేటుకు ధీటుగా ఈ వ్యవస్థను నడుపుతామని ప్రకటించారు. ఇవన్నీ ప్రకటనలకు, కాగితాల మీద ఆదేశాలకే పరిమితం అయ్యాయి తప్ప ఏవీ ఆచరణలోకి రాలేదు.
జిల్లాలో అప్పటి 21 నియోజకవర్గాల్లోనూ ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాలలను నెలకొల్పారు. తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఈ మాధ్యమ తరగతులను కూడా నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడా అదనంగా ఒక్క ఉపాధ్యాయుడ్ని కూడా కేటాయించలేదు. అక్కడున్న వారినే బోధన చేయమన్నారు. అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తరువాత వీటి గురించి పట్టించుకోవడమే మానేశారు. కనీసం అచ్చు పుస్తకాలు కూడా సకాలంలో అందజేయలేదు.

 

 

 

 

 

 

జిల్లాలో 362 ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అమల్లోకి తెచ్చారు. తొలుత రెండేళ్లు సీబీఎస్‌ఈ విధానంలో నడిపారు. దీనికి సంబంధించి ఉపాధ్యాయులకు ఒక్క రోజు కూడా వృత్యంతర శిక్షణ ఇవ్వలేదు. సీబీఎస్‌ఈ సిలబస్‌ అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు కూడా కష్టతరంగా మారింది. దాతో ఎంతో ఆశగా ఆంగ్లమాధ్యమంలో చేరిన విద్యార్థులు దీనికి స్వస్తిచెప్పి తెలుగు మాధ్యమానికి రావడం మొదలు పెట్టారు. సక్సెస్‌ విఫలం అవుతోందని గ్రహించిన ప్రభుత్వం, విద్యాశాఖ సీబీఎస్‌ఈని వదిలేసి రాష్ట్ర సిలబస్‌నే ఇందులో నిర్వహించేలా ఆదేశాలు ఇచ్చారు. అనుకున్న విధంగా ఉపాధ్యాయులను నియమించడం కానీ, అభివృద్ధి నిధులు ఇవ్వడం కానీ చేయలేదు. మొత్తంగా తొమ్మిదేళ్లు గడిచిపోయాయి. పదో తరగతితోనే ఈ విద్య ఆగిపోయింది. ఇంటర్మీడియెట్‌ స్థాయికి ఈ పాఠశాలలను పెంచలేదు. ఈ మాధ్యమంలో చదువుకున్న విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో చేసేది లేక ఇంటర్‌ను తిరిగి తెలుగు మాధ్యమంలో చేరిపోతున్నారు. ఈ పథకంలో ఆచరణలోకి వచ్చిందల్లా కేవలం కంప్యూటర్లు ఇవ్వడం మాత్రమే. అన్ని పాఠశాలలకూ కూడా నిట్‌ సంస్థ ద్వారా కంప్యూటర్లు, బోధకులను నియమించారు. ప్రస్తుతం వారి ఒప్పందం కూడా అయిపోవడంతో బోధకులూ లేరు. కంప్యూటర్లూ పనిచేయకుండా మూలనపడిపోయాయి.

 

పామాయిల్ సంగతేంటి..?

Tags:English .. Winglish

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *