సోనియా చుట్టూ చిక్కుముళ్లు

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, వయసు 76 సంవత్సరాలు. దేశానికి స్వాతంత్రం రావడానికి  ఇంచుమించుగా ఒక ఒక సంవత్సరం ముందు, 1946 డిసెంబరు 9న ఆమె జన్మించారు. సోనియా గాంధీ ఎక్కడో ఇటలీలో పుట్టినా, భారత రాజకీయాల్లో ఆమె, చాలా కీలక భూమికను పోషించారు. ఇంచు మించుగా1998 నుండి. రెండు దశాబ్ధాలకు పైగా, ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్నారు. మధ్యలో, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినా, 2019 ఎన్నికలలో పార్టీ వరసగా రెండవ సారి ఘోరంగా ఓడిపోయిన నేపధ్యంలో ఆయన కాడి దించేశారు. అప్పటికే సోనియా వయసు, 70 ప్లస్… అయినా ఆమె మరో మారు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికీ, ఆమె అదే పదవిలో కొనసాగుతున్నారు. అంతేకాదు, 2004 నుంచి 14 వరకు పదిసంవత్సరాల పాటు,దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రాజకీయ నాయకురాలిగా కితాబులు అందుకున్నారు. అయితే, ఇప్పడు పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఇప్పుడు ఆమె అన్ని వైపులా నుంచి సమస్యలు ఎదుర్కుంటున్నారని, ఎవరో కాదు, కాంగ్రెస్ నాయకులే అంటున్నారు. రాజకీయ విశేషకులూ అదే అంటున్నారు.

 

 

ఓ వంక, వయసు, వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలు. మరో వంక రాజకీయంగా ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లు ఆమెను కదలకుండా చేస్తున్నాయి. మరో  వంక కాంగ్రెస్ పార్టీని వరస ఓటములు వెంటాడుతున్నాయి. సీనియర్ నాయకులు చాలా వరకు పార్టీకి దూరమయ్యారు.సమస్యల సుడి గుండం నుంచి గట్టేక్కించే సామర్ధ్యమున్న గులాం నబీ ఆజాద్ వంటి నాయకులు ఇప్పటికీ ఇంకా పార్టీలో ఉన్నా, ప్రత్యేక గ్రూప్ ( జీ 23) గా ఏర్పడి  పార్టీ వ్యవహరాలకు దూరంగా ఉంటున్నారు. అలాగే, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, యధేచ్చగా సాగుతున్న వలసలు పార్టీ నాయకత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.  ఈ నేపధ్యంలో సోనియా గాంధీ ఇంతవరకు ఎప్పుడూ ఎదుర్కోని  సమస్యలను ఎదుర్కుంటున్నారని అంటున్నారు. అవన్నీ ఒకెత్తు అయితే, కాంగ్రెస్ ముక్త భారత్ లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అగ్ర నాయకత్వం, కాంగ్రెస్ పుంజుకునే సంకేతాలు కనిపించిన ప్రతి సందర్భంలోనూ, పాత దస్త్రాలు తిరగేసి కేసులను తిరగతోడుతోందని, ముఖ్యంగా గాంధీ ఫ్యామిలీ టార్గెట్  గా బీజేపీ, ముందరి కాళ్ళకు బంధాలు వేసేందుకు సిబిఐ, ఈడీ ఇతర కేంద్ర విచారణ సంస్థలను ఉసిగోలుపుతోందని, కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

 

 

 

ఇప్పటికే  నేషనల్ హెరాల్డ్ కేసులో సొనియా గాంధీ, రాహుల్ గాంధీ విచారణ ఎదుర్కుంటున్నారు. ఇద్దరికీ సమన్లు జారీ అయ్యాయి. రాహుల్ గాంధీని ఈడీ ఐదు రోజుల పాటు విచారించింది. అయితే, అనారోగ్యం (కొవిడ్) కారణంగా గతంలో విచారణకు హాజరు కాలేక పోయిన సోనియా గాంధీకి జూలై 22 విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున, ఈడీ విచారణ మరోసారి వాయిదా వేస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. అదలా ఉంటే ఇప్పుడు తాజాగా, 2002లో జరిగిన గుజరాత్‌ అల్లర్ల వ్యవహారంలో ఆ రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి, (ప్రస్తుత ప్రధాని) నరేంద్ర మోడీని అప్రతిష్ఠ పాలుచేసి  గుజారత్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సోనియా గాంధీ కుట్ర చేశారనే ..

 

 

 

ఆరోపణను బీజేపీ  తెరపైకి తెచ్చింది. గుజరాత్‌ అల్లర్లపై దర్యాప్తు చేస్తున్న సిట్‌.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చేసిన కీలక వాఖ్యల ఆధారంగా  రాజకీయ దుమారానికి  బీజేపీ శ్రీకారం చుట్టింది.  గుజరాత్ అల్లర్లను అడ్డు పెట్టుకుని , మోడీని అప్రతిష్ఠపాలు చేయడంతో పాటుగా   గుజారత్ ప్రభుత్వాన్ని కూల్చి వేసేందుకు సోనియా గాంధీ కుట్ర చేసారని,  బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర తీవ్ర ఆరోపణ చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన దివంగత నేత అహ్మద్‌ పటేల్‌ పాత్ర కూడా ఈ కుట్రలో ఉందన్నారు.సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్‌కు ఆయన రూ.30లక్షలు ఇచ్చారని  వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమవుతున్న సోనియా గాంధీ చుట్టూ చిక్కు ముళ్ళు విచ్చుకుంటున్నాయి అనేది మాత్రం నిజం అంటున్నారు.

 

Tags: Entanglement surrounds Sonia

Leave A Reply

Your email address will not be published.