మొదలైన విస్తరణ

Date:08/11/2018
సంగారెడ్డి ముచ్చట్లు:
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా (ఎస్‌ఎన్‌ఏ) 161 నేషనల్ హైవే పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. కొన్నిరోజుల క్రితమే పెద్దశంకరంపేట, అల్లాదుర్గం, టేక్మాల్‌ల్లో విస్తరణ పనులు మొదలుపెట్టారు. దీంతో  ఈ రహదారికి మహర్దశ రానుందని అంతా ఆశిస్తున్నారు. రహదారి పనులు ప్రారంభం కావడంతో సాఫీగా జర్నీ చేయడానికి వీలవుతుందని స్థానికులతో పాటు, పలు ప్రాంతాల ప్రయాణికులు వ్యాఖ్యానిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం 161 జాతీయ రహదారిని భారత్‌ మాల ప్రాజెక్ట్‌లో చేర్చింది. ఫలితంగా ఈ రహదారికి మహర్దశ దక్కనుంది. 2018-19 బడ్జెట్‌లో భారత్‌ మాల పరియోజనను ప్రకటించారు. ఇందులో భాగంగా తొలిదశలో 373 కి.మీల మేర అయిదు రహదారులను నాలుగు రోడ్లుగా విస్తరించనున్నారు.
ఇందులో జిల్లాలోని సంగారెడ్డి-నాందేడ్‌-అకోలా 161వ నెంబరు జాతీయ రహదారిని మాత్రమే చేర్చారు. దీంతో నాలుగు లేన్ల విస్తరణ పనులకు మోక్షం లభించినట్లైంది. ఇదిలాఉంటే 140 కిలోమీటర్ల విస్తరణ పనులకు రూ.3200 కోట్లు మంజూరుచేశారు. రెండేళ్ల క్రితం సీఈ టెస్టింగ్‌ అనే కన్సల్టెన్సీకి డిజైన్‌ సర్వే బాధ్యతను అప్పగించింది ప్రభుత్వం. ఈ సంస్థ కోల్‌కతాకు చెందినది. బాధ్యతలు స్వీకరించిన చిరకాలంలోనే కంపెనీ సర్వే పూర్తిచేసింది.
సదరు వివరాలను ప్రభుత్వానికి నివేదించింది. ఇక కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కూడా సర్వే చేసిన మార్గంలో భూసేకరణ పూర్తి చేసి భూ నిర్వాసితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకున్నాయి. దీంతో పనులు మొదలయ్యాయి. ఎస్‌ఎన్‌ఏ రహదారిలో మొత్తం 8 కొత్త బైపాస్‌ రహదారులు నిర్మించనున్నారు. దీంతో స్థానికంగా రవాణా మరింత మెరుగుపడుతుందని అంతా ఆశిస్తున్నారు.
Tags: Etc. Expansion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *