మాపై కోపాన్ని కేసీఆర్ రైతులపై చూపిస్తున్నారు: ఈటల

హైదరాబాద్: ధాన్యం కొనకుంటే సీఎం కేసీఆర్ అధికారం నుంచి తప్పుకోవాలని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్, బస్ ఛార్జీల నుంచి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. ఎంజీఎం వ్యవహారంలో ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి తప్పుచేస్తే ఎంజీఎం సూపరింటెండెంట్ శిక్ష అనుభవించాలా? అని ప్రశ్నించారు. నిధులు కేటాయించకుండా ఆస్పత్రుల అభివృద్ధి ఎలా సాధ్యమని నిలదీశారు. భాజపా నేతలపై కోపాన్ని రైతులపై సీఎం కేసీఆర్ చూపిస్తున్నారని ఈటల విమర్శించారు. పంజాబ్ లో రెండో పంట గోధుమలు వేస్తారని తెలిసి కూడా సీఎం అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించారు. ప్రతి గింజనూ కొంటామంటూ ఇచ్చిన హామీని కేసీఆర్ నిలబెట్టుకోవాలన్నారు. తెరాస ప్రభుత్వం ధాన్యం సేకరిస్తోందన్న ఆశతో రైతులు కోతకు సిద్ధమవుతున్నారని. చెప్పారు. కోటి మందికి రైతుబంధు ఇస్తే 35 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట రావడం విడ్డూరమని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. 17వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తున్న రాష్ట్రంలో ఛార్జీల పెంపు సిగ్గుమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు..

Leave A Reply

Your email address will not be published.