లాభాలు ఉన్నా … ప్రైవేటే
విశాఖపట్టణం ముచ్చట్లు:
ప్రవేటీకరణ కేంద్రం పాలసీ అని మరో సారి తేలిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రై ‘వేటు’ వేయడమే తమ విధానమని కేంద్రం పార్లమెంటు సాక్షిగా అంగీకరించేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు లాభాలలో ఉన్నా వాటిని ప్రైవేటుకు అప్పగించేసి డబ్బులు దండుకోవడమే లక్ష్యమని తేల్చేసింది. విశాఖ స్టీల్ ప్టాంట్ లాభాల బాటలోనే నడుస్తోందని అంగీకరించింది.అయినా సరే విశాఖ ఉక్కును ప్రైవేటుకు అప్పించడానికి నిర్ణయించేశామనీ, ఆ నిర్ణయంలో మార్పు ఉండదనీ తేల్చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ కు 2021-22 ఆర్థిక సంవత్సరం లో 913.19 కోట్ల రూపాయల లాభం వచ్చిందని కేంద్రం పార్లమెంటు సాక్షిగా ప్రకటించింది.
తెలుగుదేశం ఎంపీ కనకమేడల అడిగిన ప్రశ్నకు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో విశాఖ ఉక్కు కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లాభాలు వచ్చాయని పేర్కొన్నారు.అయినా సరే విశాఖ స్టీల్ ను ప్రైవేటు పరం చేయడానికే కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నా కేంద్రం ఖాతరు చేయడం లేదు. రాష్ట్రం మొక్కుబడిగా ప్రైవేటీకరణ వద్దని ఓ లేఖ రాసేసి చేతులు దులిపేసుకుంది. అయితే కేంద్రం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న విధానానికి కట్టుబడి విశాఖ ఉక్కును ప్రైవేటుకు అప్పగించేయడానికే సిద్ధ పడుతోంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగానే విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తున్నామని చెప్పింది.
Tags:Even if the profits are … private