రామనగరంలో బీజేపీ అభ్యర్ధి లేకున్నా… 16 వేల ఓట్లు

Date:09/11/2018
బెంగళూర్ ముచ్చట్లు:
ఎన్నికల్లో చిత్రవిచిత్రాలకు కొదువేం ఉండదు. అలాంటి ఓ సిత్రమే ఇటీవలి కర్ణాటక ఉప ఎన్నికల్లో చోటుచేసుకుంది. రామనగర అసెంబ్లీ స్థానంలో బీజేపీ పార్టీకి అభ్యర్థి లేకపోయినా  సుమారు 16 వేల ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ మొత్తం 1,48,168 ఓట్లు పోలవ్వగా.. కమలం పార్టీకి ఖాతాలోకి 15,906 ఓట్లు వచ్చాయి. అభ్యర్థి లేకపోయినా ఓట్లెలా వచ్చాయనేగా సందేహం. అందుకు సంబంధించిన నేపథ్యం కూడా ఆసక్తికరంగానే ఉంది.
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి గత మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రామనగర, చెన్నపట్న నుంచి పోటీ చేసి గెలుపొందారు.  తర్వాత చెన్నపట్న నుంచే ప్రాతినిధ్యం వహించడానికి నిర్ణయించుకొని రామనగర స్థానానికి రాజీనామా చేశారు. రామనగరతో పాటు ఖాళీ అయిన మరో స్థానం జమఖండి, మరో 3 లోక్ సభ స్థానాలకు నవంబర్ 3న ఉప ఎన్నికలు నిర్వహించారు. రామనగర అసెంబ్లీ స్థానం నుంచి సీఎం కుమారస్వామి సతీమణి, జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి అభ్యర్థి అనితా కుమారస్వామి బరిలోకి దిగారు.
ఈ స్థానంలో రాజకీయం అనూహ్య మలుపులు తిరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి చంద్రశేఖర ఆ పార్టీకి షాక్ ఇచ్చి బీజేపీలో చేరారు. బీజేపీ తరఫున అనితా కుమారస్వామిపై పోటీకి దిగారు.  చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకొని బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చారు. తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. దీని వెనుక ఎంపీ డీకే సురేశ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించారు.
తమ అభ్యర్థి బరి నుంచి తప్పుకొని కాంగ్రెస్ గూటికి చేరడంతో ఎన్నికలను బీజేపీ మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రచారాన్ని ఉధృతం చేసింది. మోసపూరిత రాజకీయాలకు చెంపపెట్టులా తమ పార్టీకి ఓటేయాలని ప్రజలను అభ్యర్థించింది. దేశం కోసం, ప్రధాని మోదీ కోసం కమలం పార్టీని గెలిపించాలని కోరింది. దీంతో ఆ పార్టీకి చెప్పుకోదగ్గ ఓట్లు పడ్డాయన్నమాట. మొత్తం మీద రామనగర స్థానం నుంచి అనితా కుమారస్వామి 1,09,137 ఓట్ల తేడాతో బీజేపీపై ఘన విజయం సాధించారు. సీఎం సతీమణిగా తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. జమఖండిలోనూ బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది.
అక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ ఎస్ న్యామగౌడ 50 వేల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. రామనగర నియోజకవర్గం నుంచి అనితా కుమారస్వామి తొలి మహిళా ఎమ్మెల్యే కావడం మరో విశేషం. అంతేకాకుండా ఓ ముఖ్యమంత్రి, ఆయన సతీమణి పక్క పక్క నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించడం కూడా ఇదే తొలిసారి. కర్ణాటక చరిత్రలోనే భార్యతో కలిసి శాసనసభలో అడుగుపెడుతున్న మొదటి ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి రికార్డు సృష్టిస్తున్నారు.
ఆ క్షణాలను చూడటానికి జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో రామనగర నియోజక వర్గం నుంచి కుమారస్వామి, మధుగిరి నుంచి అనితా కుమారస్వామి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అప్పట్లో ఇద్దరూ కర్ణాటక అసెంబ్లీకి కలిసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. ఆ సమయంలో కుమారస్వామి సీఎంగా లేరు.
Tags: Even if there is no BJP candidate in Ramanagar … 16 thousand votes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *