Date:13/01/2021
అమరావతి ముచ్చటు:
ఆలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. బుధవారం ఆయన మంగళగిరి విలేకరులతో మాట్లాడారు. ఏపీలో ఆలయాలు ఆపదలో ఉన్నాయన్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, సత్యదూరమన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పోలీస్‌శాఖ ఆలయాలకు భద్రత కల్పిస్తుందన్నారు. ఏపీలోని ఆలయాలకు కల్పిస్తున్న భద్రతను ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ప్రశంసించాయని చెప్పారు. గత సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు 58,871 ఆలయాలకు జియో ట్యాటింగ్ చేసినట్లు చెప్పారు. అలాగే 43,824 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా, పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 44 దేవాలయల సంబంధిత నేరాల్లో 29 కేసులను ఛేదించడంతో పాటు 80 మంది కరుడుగట్టిన అంతరాష్ట్ర నేరస్థులను, ముఠాలను అరెస్టు చేసినట్లు చెప్పారు.
2020, సెప్టెంబర్ 5వ తేదీ అనంతరం ఆలయాల్లో ప్రాపర్టీ అఫెన్స్‌కు సంబంధించి 180 కేసులను ఛేదించి 337 మంది నేరస్థులను అరెస్టు చేసినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 15,394 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే 7,862 గ్రామ రక్షణ దళాలను ఏర్పాటు చేస్తామన్నారు. కొంతమంది పనిగట్టుకొని ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాలు, ప్రచార మాధ్యమాల్లో ఆలయాల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తూ.. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దర్యాప్తులో ఉన్న అన్ని కేసులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంతో పాటు సిట్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.రుచూ ఇదేరకమైన నేరాలకు పాల్పడే వారిపై పీడీయాక్ట్ ప్రయోగించనున్నట్లు చెప్పారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని, అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆలయాల పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తక్షణమే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని, ప్రత్యేకంగా 93929 03400 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజలకు ఏపీ పోలీస్‌శాఖ నిరంతరం అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఆసక్తికరంగా జమ్మలమడుగు పంచాయితీ
Tags: Everyone has a responsibility to protect temples: AP DGP