Natyam ad

పంజాబ్ లో అందరి దృష్టి   ఆ ప్రాంతం పైనే

ఛండీఘడ్ ముచ్చట్లు:
 
పంజాబ్ రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే ముందు అక్కడి మాల్వా ప్రాంతం గురించి తెలుసుకోవాలి. 1966లో పంజాబ్ 3 ముక్కలైన తర్వాత ఆ రాష్ట్రాన్ని పాలించిన 12 మంది ముఖ్యమంత్రుల్లో 10 మందిని అందించిన మాల్వా ప్రాంతం రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో రాయలసీమను తలపిస్తుంది. ఉద్యమాల్లో తెలంగాణను గుర్తుచేస్తుంది. ఈ ప్రాంతంలో ఏ రాజకీయ పార్టీ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే, అధికార పీఠం వారి వశమవుతుంది. అంతగా రాజకీయాలను శాసించే ఈ ప్రాంతం 22 జిల్లాల పంజాబ్‌లో 15 జిల్లాల్లో విస్తరించి ఉంది. అసెంబ్లీ సీట్ల సంఖ్యలో చెప్పాలంటే 117 సీట్లున్న పంజాబ్ అసెంబ్లీలో 69 సీట్లు మాల్వా నుంచే ఉన్నాయి. ఆ తర్వాత మాఝా ప్రాంతంలో 25 సీట్లు, దోవాబా ప్రాంతంలో 23 సీట్లు ఉన్నాయి.రాష్ట్రంలోనే అతి పెద్ద నగరమైన లూథియానా, రాజ సంస్థానాల నగరం పాటియాలా సహా ఫరీద్‌కోట్, భటిండా, మోగా, బర్నాలా, సంగ్రూర్ తదితర జిల్లాలు మాల్వాలో భాగం. మిగతా ప్రాంతాలతో పోల్చితే కాస్త వెనుకబాటుతనం ఉన్నప్పటికీ, ఈ ప్రాంతం రాజకీయంగా అత్యంత క్రియాశీలంగా ఉంటూ పంజాబ్ రాజకీయాలను శాసిస్తోంది. నిన్న మొన్నటి వరకు శిరోమణి అకాలీదళ్‌ ఈ ప్రాంతంలో పట్టు కారణంగానే దశాబ్దాల పాటు అధికారాన్ని చలాయించగల్గింది. ఈ పట్టు కారణంగానే అకాలీదళ్ నుంచి ప్రకాశ్ సింగ్ బాదల్ రికార్డు స్థాయిలో 5 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ముక్త్‌సర్ జిల్లాలోని బాదల్ గ్రామానికి చెందిన ధనిక రైతు కుటుంబం వచ్చిన ప్రకాశ్ సింగ్, తన స్వస్థలాన్ని మాల్వాకు గుండెకాయగా మార్చగలిగారు.
 
 
పంజాబ్‌లో అతి పెద్ద రైతు సంఘం నేత జోగిందర్ సింగ్ ఉగ్రహాన్‌కు కూడా మాల్వా ప్రాంతంలో గట్టి పట్టు, ఆదరణ ఉన్నాయి.ముఖ్యమంత్రులను అందించే గడ్డ 1966లో హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతో కూడిన అవిభాజిత సువిశాల పంజాబ్, మూడు ముక్కలైన తర్వాత మిగిలిన ప్రస్తుత పంజాబ్‌ను పరిపాలించిన 12 మంది ముఖ్యమంత్రుల్లో 10 మందిని మాల్వా ప్రాంతమే అందించింది. మాల్వా ప్రాంతం నుంచి ముఖ్యమంత్రులైనవారిలో గర్నామ్ సింగ్, లచ్‌మన్ సింగ్ గిల్, ప్రకాశ్ సింగ్ బాదల్, జ్ఞాని జైల్ సింగ్, సుర్జిత్ సింగ్ బర్నాలా, బియంత్ సింగ్, హర్‌చరణ్ సింగ్ బ్రార్, రాజిందర్ కౌర్ భట్టల్, కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రస్తుత సీఎం చరణ్‌జీత్ సింగ్ ఛన్ని కూడా ఉన్నారు. వీరిలో గుర్నామ్ సింగ్, కెప్టెన్ అమరీందర్ సింగ్ రెండు సార్లు పంజాబ్ సీఎం పీఠాన్ని అధిరోహించగా, ప్రకాశ్ సింగ్ బాదల్ 5 సార్లు సీఎం అయ్యారు. మాల్వాయేతర ప్రాంతాల నుంచి ముఖ్యమంత్రులైనవారిలో దోవాబా ప్రాంతంలోని జలంధర్‌ జిల్లాకు చెందిన దర్బారా సింగ్, మాఝా ప్రాంతంలోని అమృత్‌సర్‌కు చెందిన గుర్ముఖ్ సింగ్ ముసాఫిర్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన భగవంత్ మాన్, పంజాబ్ పీసీసీ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కూడా ఈ ప్రాంతానికి చెందినవారేది రైజ్ ఆఫ్ మాల్వా 1950 దశకం చివర్లో మాస్టర్ తారా సింగ్, ఆ తర్వాత సంత్ ఫతే సింగ్ ప్రారంభించిన ‘పంజాబి సుబా’ ఉద్యమంలో మాల్వా ప్రాంతం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
 
 
 
పంజాబీ మాట్లాడే ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలంటూ సాగిన ఈ ఉద్యమంలో జైలుకెళ్లిన అకాలీదళ్ నేతల్లోనూ అత్యధికులు మాల్వా ప్రాంతం నుంచే ఉన్నారు. అలా ప్రజా ఉద్యమాలతో ప్రస్థానాన్ని మొదలుపెట్టిన శిరోమణి అకాలీదళ్, ఈ ప్రాంతంలో బలమైన రాజకీయ శక్తిగా కొన్ని దశాబ్దాలపాటు కొనసాగుతూ వస్తోంది. అత్యధిక సమయం అధికారంలోనూ ఉంది. 1997 నుంచి చూస్తే అకాలీలు 3 పర్యాయాలు, కాంగ్రెస్ 2 పర్యాయాలు అధికారంలో ఉన్నాయి. రాజకీయాల్లో ఈ ప్రాంతం ఆధిపత్యం ప్రదర్శించడం వెనుక ప్రధాన కారణాల్లో భూస్వామ్య కుటుంబాల నుంచి వచ్చిన ప్రకాశ్ సింగ్ బాదల్, హర్‌చరణ్ సింగ్ బ్రార్ వంటి నేతలు, రాజ కుటుంబం నుంచి వచ్చి కెప్టెన్ అమరీందర్ సింగ్ వంటి నేతలేనని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జస్పాల్ సింగ్ సిద్ధు అంటున్నారు. 1966 పంజాబ్ విభజన తర్వాత పాలించిన ముఖ్యమంత్రుల్లో ప్రకాశ్ సింగ్ బాదల్, కెప్టెన్ అమరీందర్ సింగ్ కలిపి 29 ఏళ్లు అధికారంలో ఉన్నారు. ప్రకాశ్ సింగ్ బాదల్ 19.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేయగా, కెప్టెన్ అమరీందర్ సింగ్ 9.5 సంవత్సరాలు సీఎంగా పనిచేశారు.ఉద్యమాల పురిటిగడ్డ మాల్వా మాల్వా ప్రాంతం పంజాబ్‌లో అనేక ఉద్యమాలకు పురిటిగడ్డ. సామాజిక, రాజకీయ శాంతియుత ఉద్యమాలెన్నో ఇక్కడ జరిగాయి. స్వాతంత్ర్యానికి పూర్వం మాల్వా ప్రాంతంలో రాజ కుటుంబాల పెత్తనం ఎక్కువగా ఉండేది. రాజ కుటుంబాల ఆధిపత్యాన్ని, బ్రిటీష్ పాలకులను వ్యతిరేకిస్తూ 1920లోనే ‘ప్రజా మండల్’ ఉద్యమం మొదలైంది. స్వాతంత్ర్యం వచ్చేవరకు ఇది కొనసాగింది. 1930లలో ‘ముజారా (ముహాజరా)’ ఉద్యమానికి పురుడుపోసింది కూడా మాల్వా ప్రాంతమే. భూమి లేని రైతులు (కౌలు రైతులు)ను ముజారాలుగా వ్యవహరిస్తారు.
 
 
దున్నేవాడిదే భూమి అంటూ భూమిపై హక్కు కోసం వారు 1956 వరకు పోరాటం సాగించారు. తాజాగా నిన్నమొన్నటి వరకు దేశ రాజధానిని అష్టదిగ్బంధనంలో ఉంచిన రైతు ఉద్యమంలోనూ మాల్వా ప్రాంత రైతులదే కీలక పాత్ర. ఉద్యమంలోని రైతుల్లో అత్యధిక శాతం ఈ ప్రాంతంవారే.నేటి రాజకీయం ‘పంజాబీ సుబా’ ఉద్యమంతో మొదలైన శిరోమణి అకాలీదళ్, ఆ ఉద్యమానికి ఊపిరిపోసిన మాల్వా ప్రాంతంలో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో అకాలీల బలం, పట్టు తగ్గిపోతూ వస్తున్నాయి. 69 స్థానాలున్న మాల్వా ప్రాంతంలో 2012 ఎన్నికల్లో 34 సీట్లను అకాలీలు గెలుచుకోగలిగారు. కానీ 2017లో ఈ ప్రాంతంలో అకాలీదళ్-బీజేపీ కలిసి కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోగా, కాంగ్రెస్ 40 సీట్లు గెలుచుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ప్రాంతం నుంచే ఏకంగా 18 సీట్లను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. మాల్వా గ్రామీణ ప్రాంతాల్లో అకాలీదళ్-బీజేపీ కూటమిని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా దెబ్బకొట్టింది. 2022 ఎన్నికల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీ అకాలీల స్థానాన్ని ఆక్రమించే పరిస్థితి కనిపిస్తోంది. అనేక సామాజిక, రాజకీయ ఉద్యమాలకు వేదికైన మాల్వా ప్రాంతంలో, ఆ ఉద్యమాలే రాజకీయాలకు ముడిసరుకుగా మారాయి. రైతు ఉద్యమ ప్రభావం కూడా ఎక్కువగా ఉన్న మాల్వా ప్రాంతం ఈసారి ఎవరి వైపు మొగ్గుచూపితే, వారే అధికార పీఠాన్ని చేజిక్కించుకోగల్గుతారు.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Everyone in Punjab is focused on that area