అంతా విచిత్రం (కృష్ణాజిల్లా)

Date:11/10/2018
 నూజివీడు  ముచ్చట్లు:
ట్రిపుల్‌ ఐటీలో విచిత్రంగా మురుగు నీటి ఎత్తిపోతల పథకం అమలు అవుతోంది. విద్యార్థులు బాత్‌రూములు, మరుగుదొడ్లలో వినియోగించిన వ్యర్థ జలాలను ట్యాంకరులోకి నింపి, వాటిని దూరంగా తీసుకెళ్లి పారబోస్తారు. దీనికోసం ఏటా రూ.30లక్షల చొప్పున పదేళ్లల్లో రూ.3కోట్లు ఖర్చయింది. మరో రూ.కోటితో నీటి శుద్ధి ప్లాంటు నిర్మించారు. డ్రైనేజీ కోసం పురపాలికకు రూ.50లక్షలు జమచేశారు. మొత్తంగా రూ.4.50కోట్లు ఖర్చైనా డ్రైనేజీ నిర్మించలేకపోయారు. ఎవరైనా వింటే నవ్విపోరా మరీ వేలాది మంది ఉండే ఇక్కడ సరైనా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం దారుణం. అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. నూజివీడు ట్రిపుల్‌ఐటీ 2008 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పట్లో ఇంటేక్‌కు 2 వేల మంది విద్యార్థులతో, ఆరు సంవత్సరాల సమీకృత సాంకేతిక విద్యకు మొత్తం 12వేల మంది ఉండేలా రూపొందించారు.
అప్పటి ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో ప్రభుత్వం అంత ఖర్చు తట్టుకోలేని పరిస్థితుల్లో 12 వేల మంది విద్యార్థులకు సరిపడా మౌలిక సదుపాయాలు లేవంటూ ఉమ్మడి రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ, బాసర ట్రిపుల్‌ఐటీల ప్రవేశాలకు ఇంటేక్‌ సంఖ్యను 2వేల నుంచి వెయ్యికి తగ్గించారు. ఈ ప్రకారంగా నూజివీడు ట్రిపుల్‌ఐటీలో మొత్తం 6వేల మంది విద్యార్థులు ఉంటారు. సమస్యను అధిగమించడానికి ట్రిపుల్‌ఐటీ అధికారులు వ్యర్థ జలాల శుద్ధికి సుమారు రూ.కోటితో నీటి శుద్ధి ప్లాంటు నిర్మించారు. శుద్ధి అయిన జలాల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పినా గ్రామస్థులు ససేమిరా అన్నారు. ఆర్డీవో తదితర అధికారులు వారితో పలుమార్లు సమావేశమై చర్చించినా ఫలితం లేకపోయింది. వేరే మార్గంలో నీరు బయటకు తరలించాలనే ఆలోచన చేసినా, అది ఆచరణకు నోచుకోలేదు. క్రమేణా దీనిని పట్టించుకోవడం మానేశారు.
ఈ మురుగు నీటి వ్యథ ఎంతటి దుర్భరమంటే ప్రస్తుతం శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో కలిపి సుమారు 8,500 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. బోధన బోధనేతర, ఇతర సిబ్బంది మరో 1,500 మంది వరకు ఉంటారు. అంటే ట్రిపుల్‌ఐటీలో ఉండే వారి సంఖ్య 10 వేలు. వీరి ద్వారా వెలువడే వ్యర్థ జలాలు రోజుకు సుమారు 8 లక్షల నుంచి 10 లక్షల లీటర్ల వరకూ ఉంటాయి. నీటి శుద్ధి ద్వారా కొంత మేర దుర్వాసన రాకుండా చేసినా, మురుగు నిల్వ కారణంగా ఆ ప్రభావం విద్యార్థులపై పడుతోంది. అసలు ఆ వైపు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తారు. దీని నివారణకు ట్రిపుల్‌ఐటీ అధికారులు ట్యాంకరు ద్వారా నీటిని బయటకు తరలిస్తున్నారు.
దీనికి ట్రిపుల్‌ఐటీ నెలకు రూ.2.5 లక్షలు చొప్పున సంవత్సరానికి రూ.30 లక్షలు చెల్లిస్తోంది. అయినా సమస్యకు శాశ్వత పరిష్కారం లేదు.ట్రిపుల్‌ఐటీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ రూ.14 కోట్లు ఆస్తి పన్ను రూపేణా చెల్లించింది. వాస్తవానికి ఆస్తి పన్ను వసూళ్లలో నూజివీడు పురపాలక సంఘం మెరుగైన స్థానాల్లో ఉండటానికి ట్రిపుల్‌ఐటీ ప్రధాన కారణమనేది నిర్విదాంశం. అదీ కాక డ్రైను నిర్మాణానికి అప్పట్లోనే పురపాలక సంఘ ఖాతాకు రూ.50 లక్షలు జమ చేశారు.
అయినా పురపాలక సంఘంలో వివిధ నిధుల కింద ఏ అభివృద్ధి కార్యక్రమమూ ఆగడం లేదు. దీని విషయంలోనే నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారో తెలియదు. డ్రైను నిర్మాణ విషయంలో ట్రిపుల్‌ఐటీ అధికారులు కూడా సాచివేత ధోరణే అవలంభిస్తున్నారు. దశాబ్ద కాలంగా ఈ సమస్య నలుగుతోంటే దీనిని ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకువెళ్లరు? ప్రభుత్వం సొమ్ము చెల్లిస్తోంది. ఇటు ట్రిపుల్‌ఐటీ అధికారుల జేబు నుంచి గాని, అటు పురపాలక అధికారుల జేబు నుంచి కానీ పైసా పోవడం లేదు.
Tags:Everything is disturbing (Krishnajilla)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *