మైదుకూరు నియోజకవర్గంపైనే ఇప్పుడు అంతా ఆసక్తిగా ఉంది

 Date:26/03/2019
కడప ముచ్చట్లు:
మైదుకూరు నియోజకవర్గంపైనే ఇప్పుడు అంతా ఆసక్తిగా ఉంది. పుట్టా సుధాకర్ యాదవ్ పట్టుబట్టి మరీ తెలుగుదేశం పార్టీ సీటు తెచ్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ పదవి ఇచ్చినా ఆయన సంతృప్తి చెందలేదు. మైదుకూరులో తాను ఎలాగైనా గెలవాలని చెమటోడుస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో మరోసారి పాత అభ్యర్థుల మధ్యనే పోటీ కొనసాగనుంది. తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నశెట్టిపల్లి రఘురామిరెడ్డి మధ్య పోటీ ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.మైదుకూరు నియోజకవర్గానికి ‘బాస్’’ గా వ్యవహరించే డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీకి మద్దతు పలకడం ఆ పార్టీకి లాభం చేకూర్చే అంశమనే చెప్పాలి. డీఎల్ రవీంద్రారెడ్డికి మైదుకూరులో ప్రత్యేకమైన వర్గం ఉంది. ఓటు బ్యాంకు కూడా ఉంది. ఆరుసార్లు గెలవగలిగారంటే నియోజకవర్గంలో ఆయనకున్న పట్టు చెప్పకనే తెలుస్తోంది. డీఎల్ రవీంద్రారెడ్డికి మైదుకూరు నియోజకవర్గం టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబుకు మనసులో ఉన్నా పుట్టా సుధాకర్ యాదవ్ ససేమిరా అనడంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. డీఎల్ చంద్రబాబును కలిసినా ప్రయోజనం లేకపోయింది. వైసీపీ సినియర్ నేతలు అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు డీఎల్ ను కలసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి వస్తే గౌరవప్రదంగా చూసుకుంటామని చెప్పారు.
దీంతో డీఎల్ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. అభ్యర్థుల ప్రకటన పూర్తి కావడంతో డీఎల్ మైదుకూరులో వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి విజయానికి కృషి చేస్తానని చెప్పారు. పుట్టాను ఓడించడం, టీడీపీని భూస్థాపితం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకుకు తోడు డీఎల్ అండ జత కడితే వైసీపీ సునాయాసంగా గట్టెక్కుతుందన్నది వైసీపీ లెక్క. ఐదేళ్లుగా నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ అభివృద్ధి పనులుపై దృష్టి సారించారు. ప్రతి పనిని పూర్తి చేసి తాను దగ్గరుండి ప్రారంభోత్సవాలు సయితం చేశారు. గత ఎన్నికల్లో సుమారు పదకొండు వేల తేడాతో పుట్టా ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి పసుపుకుంకుమ, అన్నదాత సుఖీభవ, పింఛన్లు తనను గెలిపిస్తాయని పుట్టా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మైదుకూరు నుంచి గెలిచి వస్తానని ఇప్పటికే ఆయన టీడీపీ అగ్రనేతలకు చెప్పారంటే ఆయన ధీమా ఏంటో చెప్పకనే తెలుస్తోంది. అయితే డీఎల్ మద్దతును పొందిన రఘురామిరెడ్డి మాత్రం నింపాదిగా తన ప్రచారం చేసుకుపోతున్నారు.
Tags:Everything is interesting now in the Moodukur constituency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *