బుమ్రా రీ ఎంట్రీకి అంతా సిద్ధం

Date:19/11/2019

ముంబై ముచ్చట్లు:

వెన్ను గాయం కారణంగా గత కొన్నిరోజులుగా క్రికెటర్‌కి దూరంగా ఉంటున్న భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌కి ముందు బుమ్రాకి వైద్య పరీక్షలు నిర్వహించగా.. అతని వెన్ను కింది భాగంలో చిన్న చీలిక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో.. గాయానికి చికిత్స తీసుకుంటూ దాదాపు రెండు నెలలుగా క్రికెట్‌కి దూరంగా ఉంటున్న బుమ్రా వచ్చే ఏడాది జనవరిలో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.ఆస్ట్రేలియా జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత్‌ పర్యటనకి రాబోతోంది. ఈ రెండు జట్ల మధ్య జనవరి 14 నుంచి 19 వరకూ మూడు వన్డేల సిరీస్‌ జరగనుండగా.. ఈ సిరీస్‌‌‌‌తో జస్‌ప్రీత్ బుమ్రా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతుండగా.. డిసెంబరు 6 నుంచి వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేల్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్‌‌లో జట్టు సెలక్షన్‌కి బుమ్రా అందుబాటులో ఉండడని ఇప్పటికే తేలిపోయింది.వాస్తవానికి జస్‌ప్రీత్ బుమ్రా గాయానికి బ్రిటన్‌లో సర్జరీ చేయించాలని తొలుత బీసీసీఐ యోచించింది. ఫాస్ట్ బౌలర్ కావడం.. అదీ వెన్నుకి గాయం కావడంతో మెరుగైన చికిత్స అందించాలని నిర్ణయించింది. కానీ.. గాయాన్ని పరిశీలించిన వైద్య నిపుణులు సర్జరీ అవసరం లేదని తేల్చారు. దీంతో.. భారత్‌లోనే చికిత్స తీసుకుంటూ మళ్లీ ఫిట్‌నెస్ సాధించడంలో బుమ్రా బిజీ అయిపోయాడు.

ఆరోగ్య శ్రీ పథకం సూపర్

Tags: Everything is ready for the Bumrah Re-entry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *