అంతా వారిదే రాజ్యం

Date:15/09/2018
కాకినాడ ముచ్చట్లు:
జిల్లాలోని  మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని అభివృద్ధి పనులు పడకేశాయి. అధికారులు, కాట్రాక్టర్లు కుమ్మక్కై పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులే అందుకు నిదర్శనం. నిధులు పుష్కలంగా ఉన్నప్పటికీ పనులు పూర్తి కావడం లేదు. టెండర్లు దక్కించుకుని వర్కుఆర్డర్లు జారీ చేసినా ఏళ్లకొద్దీ ఈ పనులకు మోక్షం లభించడం లేదు. మున్సిపల్‌ అధికారులను గుప్పిట్లో పెట్టుకుని కొందరు కాంట్రాక్టర్లు ఎక్కువ పనులు దక్కించుకోవడం కూడా ఈ జాప్యానికి హేతువవుతోంది.
14వ ఆర్థిక సంఘం నుంచి 2015-16, 2016-17 ఆర్థిక సంవత్సరాలకు జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం కార్పొరేషన్లు, అమలాపురం, రామచంద్రపురం, మండపేట, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, తుని మున్సిపాలిటీలకు రూ. 55 కోట్లు  మంజూరు చేశారు. వీటికి సంబంధించి పనులను ప్రతిపాదించి, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, వర్కుఆర్డర్లు ఇచ్చారు. వీటిని దక్కించుకున్న వారు ఇప్పటి వరకూ కేవలం రూ. 23 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మాత్రమే పూర్తి చేశారు.
2015-16 సంవత్సరంలో రూ. 23 కోట్లు పనులు అప్పగించగా, వీటిలో రూ.15 కోట్లు విలువైన పనులు మాత్రమే పూర్తిచేశారు. 2016-17లో రూ. 30 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పగించగా ఇప్పటి వరకూ కేవలం రూ. ఎనిమిది కోట్ల విలువైన పనులను మాత్రమే పూర్తి చేశారు. విశేషం ఏమింటనే కొన్నింటిని అసలు ప్రారంభించని పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లు ఇంతటి తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా మున్సిపల్‌ ఇంజినీర్లు వారిపై చర్యలు చేపట్టడం లేదు. 14వ ఆర్థిక సంఘం నుంచి విడుదలైన నిధులకు సంబంధించి పూర్తి చేసిన పనుల యూసీలు ఇస్తేనే తరువాత ఏడాదికి మరిన్ని నిధులు విడుదల చేస్తారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రూ.కోట్ల నిధులు మంజూరుకాని పరిస్థితి నెలకొంటోంది.
జిల్లా మున్సిపల్ శాఖలో కాంట్రాక్టర్లు అడిందే ఆట.. పాడిందే పాట అనే పరిస్థితి నెలకొంది. అధికారులకు మామూళ్ల రుచి  చూపించి పనులు  దక్కించుకుని వాటిని ప్రారంభించకుండా వదిలేస్తున్నారు. ప్రశ్నించేవారు లేకపోవడంతో అంతా వారి ఇష్టారాజ్యంగా సాగుతోంది. తక్కువ ధరకు టెండర్లు వేసి దక్కించుకోవడం కూడా ఆలస్యానికి కారణంగా నిలుస్తోంది. వాస్తవంగా మొత్తం పనిలో 15 శాతం తక్కువ కాకుండా ఉండాలి. కానీ 30 శాతానికి పైగా టెండర్లు వేసి పనులు దక్కించుకుంటున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటోంది.
ఒకే కాంట్రాక్టర్ అనేక పనులకు టెండర్లు వేసి, తీరా పనులు దక్కించుకున్న తరువాత వాటి జోలికి వెళ్లడం లేదు. కాకినాడ నగరపాలక సంస్థలో  ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకుని ఏళ్ల కాలం అవుతున్నా, వాటిని ప్రారంభించని పరిస్థితి ఉంది. ప్రధానంగా తారురోడ్ల నిర్మాణంలో ఈ జాప్యం జరుగుతోంది. అగ్రిమెంట్‌ ప్రకారం నిర్ధేశించిన కాలపరిమితిలో పనులు పూర్తి చేయాలి. అలా చేయకపోతే ఈ పనిని రద్దు చేసే అధికారులు మున్సిపల్‌ కమిషనర్లకు ఉంది. కానీ వీరేమీ పట్టించుకోరు.
ఏళ్ల కొద్దీ పనులు చేయకపోయినా కాంట్రాక్టర్లకే వత్తాసు పలుకుతారు. వారిచ్చే అమ్యామ్యాలకు అలవాటుపడి ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ లో ఓ కాంట్రాక్టర్ కు అప్పటి మున్సిపల్‌ కమిషనర్‌ కళ్లెం వేశారు. టెండర్లలో ఎక్కువ లెస్‌కు కోడ్‌ చేసిన వారిని పనులు దక్కకుండా చర్యలు  చేపట్టారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇక మున్సిపాలిటీల్లో అయితే కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు కుమ్మక్కై అందినకాడికి దోచేస్తున్నారు.. పనులు చేయని కాంట్రాక్టర్లపై  చర్యలు చేపట్టకపోతే అభివృద్ధి పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు.
Tags:Everything is their realm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *