అంతా అధ్వాన్నమే..

Date:07/12/2018
కుప్పం ముచ్చట్లు:
కుప్పం నియోజకవర్గంలో రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న బీటీ రహదారులు స్వల్పకాలానికే దెబ్బతింటున్నాయి. అధికారుల పర్యవేక్షణ నామమాత్రమై కాంట్రరాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టడంతో నాణ్యత లోపాలు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నాయి. ఏడాది తిరగకుండానే రహదారుల్లో గుంతలు కనిపిస్తున్నాయి. నాసిరకం మట్టిపనులతో ఎక్కడికక్కడ కోతకు గురై ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. శాంతిపురం మండలం కొలమడుగు నుంచి ఒడ్డుమడి గ్రామం వరకు 2.25 కి.మీ. మట్టిరోడ్డును బీటీ రహదారిగా అభివృద్ధి చేశారు. గత ఆర్థిక సంవత్సరం (2017-18)లో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌) ద్వారా మంజూరైన రూ.1.20 కోట్లతో ఈ రోడ్డును ఆరు నెలల కిందట పూర్తి చేశారు. అప్పుడే రోడ్డు పాడైపోతోంది. కల్వర్టుల వద్ద మట్టి పనులు నాసిరకంగా ఉండటంతో కోతకు గురవుతున్నాయి. పలుచోట్ల రోడ్డు ఇరువైపులా దెబ్బతింటోంది. గ్రామీణ ప్రాంతం కావడంతో ఈ మార్గంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలు మాత్రమే రాకపోకలు సాగిస్తున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అడిగిందే తడవుగా నిధులు మంజూరవుతున్నాయి. గ్రామీణ రహదారులకు రూ. వందల కోట్లు వెచ్చిస్తున్నారు. పొరుగు జిల్లాకు చెందిన కాంట్రాక్టర్లు చేపడుతున్న పనులకు స్థానిక నాయకులు తోడ్పడుతున్నారు. నిర్మాణాల్లో నాణ్యతను విస్మరించి.. అందినంత దోచుకుంటున్నారు. నిర్దేశిత నాణ్యత ప్రమాణాలను పాటించకపోవడంతోనే చాలాచోట్ల గ్రామీణ బీటీ రహదారులు కొన్ని నెలలు కూడా నిలవడం లేదని చెబుతున్నారు. నియోజకవర్గంలో వివిధ పథకాల ద్వారా గత నాలుగున్నరేళ్లలో సుమారు రూ.367 కోట్లను  రోడ్ల నిర్మాణాలు, అభివృద్ధికి కేటాయించారు. ముఖ్యమంత్రి చొరవతో ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్‌డీఎఫ్‌) ద్వారా గ్రామీణ మట్టి రోడ్లను బీటీ, సీసీ రహదారులుగా అభివృద్ధి చేస్తున్నారు.
ఇతర ప్రాంతాలకు చెందిన గుత్తేదారులు ఇక్కడ రోడ్ల నిర్మాణాల్లో నాణ్యతను విస్మరిస్తున్నా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడన్న విమర్శలు ఉన్నాయి. మట్టి పనులు మొదలుకొని.. బీటీ వరకు అధికారుల పర్యవేక్షణ నామమాత్రం కావడంతో.. చాలా వరకు గుత్తేదారులు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు పూర్తి చేస్తున్నారు. నాసిరకం మట్టి, కంకర వినియోగంతోపాటు బీటీ (తారు) రోడ్డు నిర్మాణంలో నిర్దేశిత ప్రమాణాలు పాటించడం లేదనడానికి దెబ్బతింటున్న రోడ్లే అద్దం పడుతున్నాయి.
నియోజకవర్గ అభివృద్ధిలో మేము సైతం అంటూ.. ఢంకా భజాయిస్తున్న స్థానిక పాలకులు, నాయకులు అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాలను పట్టించుకోవడంలేదన్న విమర్శలు ఉన్నాయి. కొత్తరోడ్లు దెబ్బతింటున్నా.. చోద్యం చూస్తుండటంలో ఆంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Tags:Everything is worse ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *