EVMs evacuation

ఈవీఎంలు తరలింపు కలకలం

Date:21/05/2019

లక్నో ముచ్చట్లు:

మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెళ్లడికానుండగా స్ట్రాంగ్‌ రూముల్లోని ఈవీఎంలు ట్యాంపరింగ్‌ జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పంజాబ్, హరియాణాలో ట్యాపరింగ్ పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్‌ రూంల వద్ద ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. వీటిపై ఎన్నికల కమిషన్ స్పందిస్తూ.. ఆ వార్తలన్నీ కేవలం వదంతులేనని, భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచామని వెల్లడించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీపూర్‌ పార్లమెంటు పరిధిలో ఓ వాహనంలో భారీ ఎత్తున ఈవీఎంలను తరలిస్తున్నారని ఆరోపిస్తూ బీఎస్పీ అభ్యర్థి అఫ్జల్‌ అన్సారీ స్థానిక స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో జిల్లా రిటర్నింగ్‌ అధికారి అక్కడికి చేరుకుని స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద పార్టీలకు చెందిన ప్రతినిధులను కూడా ఉండడానికి అనుమతించడంతో ఆయన తన ఆందోళన విరమించారు. పోటీచేస్తోన్న అభ్యర్థులను స్ట్రాంగ్ రూమ్‌ల వద్దకు అనుమతించమని, వారి ప్రతినిధులను మాత్రం కాపాలా ఉండవచ్చని తెలిపారు. వారణాసి సమీపంలోని చందౌలీ నియోజకవర్గంలో ఈవీఎంలను కౌంటింగ్ సెంటర్‌ కాంప్లెక్స్‌లోని ఓ గదిలో భద్రపరచడాన్ని సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మంగళవారంఉదయం తమ ఫోన్‌లో చిత్రీకరించారు. అలాగే పోలింగ్‌ ముగిసిన రెండు రోజుల తరవాత ఈవీఎంలను ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు.. వీడియోలో చూపించిన ఈవీఎంలు చందౌలీ నియోజవర్గానికి చెందిన రిజర్వ్‌ యూనిట్లని స్పష్టం చేశారు.

 

 

 

 

 

 

 

పోలింగ్‌ రోజున తరలించే సమయంలో ఏర్పడ్డ ఇబ్బందుల కారణంగా వాటిని స్ట్రాంగ్‌ రూంలకు చేర్చడంలో జాప్యం జరిగిందని వివరించారు. దొమరియాగంజ్‌ జిల్లా ఎన్నికల అధికారి ఈవీఎంల తరలింపుపై సంబంధిత సిబ్బందిని ఫోన్‌లో ప్రశ్నిస్తుండగా.. అవతలివైపు నుంచి సరైన సమాధానం రాకపోవడం విశేషం. బిహార్‌, హరియాణా, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లోనూ ఇలాంటి ప్రచారం సాగడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీనిపై స్పందించిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌.. ‘హఠాత్తుగా ఈవీఎలంను తరలిస్తున్నారన్న వార్తలు, వీడియోలు ఉత్తర భారతదేశంలో చక్కర్లు కొడుతున్నాయి? వాటిని ఎవరు తరలిస్తున్నారు? ఎందుకు తరలిస్తున్నారు? ఈ క్రతువు ఇప్పుడే ఎందుకు జరుగుతోంది? దీనిపై ప్రజల్లో ఆందోళన నెలకుందని, ఎన్నికల సంఘం తప్పనిసరిగా స్పందించాల్సి ఉంది’ అని ట్విటర్‌ వేదికగా ఆయన డిమాండ్ చేశారు.ఈవీఎంలపై వస్తున్న ఆరోపణలను ఈసీ ఖండించింది. ‘చందౌలిలో కొంత మంది పనిగట్టుకుని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు.. దొమరియాగంజ్‌లో ఆందోళన అసందర్భమైంది.. అక్కడ ఆందోళన చేస్తోన్న నేతలకు జిల్లా కలెక్టర్, ఎస్పీ సర్దిచెప్పారు… అక్కడ సమస్య పరిష్కారమైంది.. ప్రోటోకాల్ ప్రకారం ఈవీఎంలు భద్రంగా ఉన్నాయని’ ఈసీ ఓ ప్రకటనలో తెలిపింది. గత డిసెంబరులో ఈసీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే అన్ని ఈవీఎంలతో పాటే రిజర్వ్‌ యూనిట్లను కూడా తరలించాల్సి ఉంటుంది. అలాగే అవన్నీ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు సాయుధ బలగాల పటిష్ఠ భద్రతలో ఉండాలి.

టీడీపీ రెండుగా చీలిపోతుంది : మాధవ్

 

Tags: EVMs evacuation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *