కమలం గూటికి మాజీ ఐపీఎస్…?

హైదరాబాద్  ముచ్చట్లు

టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు.. చేరికలపై మరింత ఫోకస్ పెట్టారు. చేరికల కమిటీని ఏర్పాటు చేసుకున్న కమలదళం.. మేధావులు, విద్యావంతులను పార్టీలోకి పెద్దఎత్తున ఆహ్వానించేలా ప్రణాళికలు వేస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంపై సస్పెన్స్ కొనసాగుతుండగానే.. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి టి.కృష్ణ ప్రసాద్ బీజేపీలో చేరబోతున్నారనే ప్రచారం హాట్ టాపిక్ గా మారింది. సమాజ సేవ చేస్తూ ప్రజల్లో ఆదరణ కలిగిన కృష్ణ ప్రసాద్ ను పార్టీలో చేర్చుకోవడంపై బీజేపీ సుముఖతతో ఉందని తెలుస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో ఆయన కషాయ కండువా కప్పుకోవడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కృష్ణ ప్రసాద్ తో పాటు పలువురు పారిశ్రామిక వేత్తలు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది.తెలంగాణ రాష్ట్రానికి చెందిన టి.కృష్ణప్రసాద్ 1987 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆయన 2020లో పదవీవిరమణ చేశారు. రిటైర్మెంట్ తర్వాత పలు సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజా క్షేత్రంలో ఉంటున్నారు. గత కొంతకాలంగా బీజేపీ కీలక నేతలతో టచ్ లో ఉన్నారని, నిజానికి ఆయన  పార్టీలో చేరాల్సి ఉన్నా.. ఆ కార్యక్రమాన్ని ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ టీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పడేసేలా ఎత్తుగడలను వేస్తోంది. ఇప్పటికే ఓ వైపు ఎమ్మెల్యేలకు, ఎన్నికల్లో ప్రభావం చూపగలిగిన నేతలను పార్టీ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తూనే.. మరో వైపు మేధావులు, విద్యావంతులు, ఉద్యమకారులపై దృష్టి సారించింది. వచ్చే నెల నుంచి మంచి మూహుర్తాలు రానుండటంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి బీజేపీలోకి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని కమలం పార్టీ నేతలు చెబుతున్నారు.

Tags:

  •  Ex IPS Going to BJP

Leave A Reply

Your email address will not be published.