మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట-ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే
రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ
న్యూఢిల్లీ ముచ్చట్లు:
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మాజీ మంత్రి నారాయణకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. గత ఏడాది ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ హైస్కూల్ నుంచి పదోతరగతి ప్రశ్నపత్రం లీకైంది. వాట్సాప్ ద్వారా తెలుగు ప్రశ్నపత్రం బయటకు రావడంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నారాయణ పాత్ర ఉన్నట్లు అప్పట్లో చిత్తూరు పోలీసులు వెల్లడించారు. నారాయణ విద్యాసంస్థల అధినేతగా 2014లోనే నారాయణ వైదొలిగారంటూ ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఈ కేసుపై గత కొన్ని నెలలుగా జిల్లా కోర్టు, హైకోర్టుల్లోనూ విచారణ జరిగింది. ఇటీవల నారాయణ బెయిల్‌ను హైకోర్టు రద్దు చేయడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో బెయిల్ రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది.

Tags: Ex-minister Narayana’s appeal in Supreme Court-Supreme Court stay on AP High Court’s order
