యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా 

Exactly sand smuggling

Exactly sand smuggling

Date:06/10/2018
ఖమ్మం ముచ్చట్లు:
ఇసుక అక్రమరవాణానాను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చి చెప్తోంది. అయితే ఇలాంటి వార్నింగ్‌లేవీ ఖమ్మం జిల్లాలో తిష్టవేసిన ఇసుకాసురుల చెవికెక్కడంలేదు. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ప్రకృతి వనరులు ధ్వంసం చేస్తూ జేబులు నింపుకుంటున్నారు.
ఈ దందాను నిలువరించాల్సిన అధికారులు ఉదాసీనంగా ఉంటుండడంతో అక్రమార్కులు మరింతగా రెచ్చిపోతున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగించేస్తూ ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నారు. మొన్నటివరకూ వర్షాల వల్ల నీటి ఉధృతి ఉండేది. ప్రస్తుతం నీటి ప్రవాహం తగ్గింది. ఇసుక తడి కూడా పెద్దగా లేదు. దీంతో పలువురు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు సాగించేస్తున్నారు.
ట్రాక్టర్లతో ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తూ విక్రయించేస్తున్నారు. జిల్లాలోని చిన్నమండవ మున్నేటిలో ఇసుక అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు నిర్మాణ అవసరాల కోసం రెవెన్యూ అధికారులు ఇచ్చే కూపన్లను అడ్డంపెట్టుకుని స్వేచ్ఛగా అక్రమాలు సాగించేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే సీసీ రహదారుల ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో వంటగదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి సంబంధించి రెవెన్యూ అధికారులు ఇసుక కూపన్లు జారీ చేస్తున్నారు. ఈ కూపన్లే ఆసరాగా కొందరు అక్రమాలకు తెరతీశారు. నిబంధలకు విరుద్ధంగా ఇసుకను తరలించేస్తూ అందినకాడికి దండుకుంటున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.
కొందరు తహసీల్దార్‌ కార్యాలయం నుంచి జారీ చేసిన కూపన్లను ఆసరాగా చేసుకొని నకిలీ కూపన్లను సృష్టిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ట్రాక్టర్‌ డ్రైవర్ల వద్ద ఉన్నవి అసలా? నకిలీవా? అనేది క్షేత్రస్థాయిలోని రెవెన్యూ అధికారులే గుర్తించలేకపోతున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రేంజ్‌లో నకళ్లు సృష్టిస్తూ కొందరు అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారని మండిపడుతున్నారు.
అడపాదడపా అధికారులు అక్రమంగా తరలిపోతున్న ఇసుకను సీజ్ చేస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ చర్యలు కఠినంగా ఉండడంలేదు. జరిమానాలూ నామమాత్రమే. దీంతో అక్రమాలకు తెరపడడంలేదని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి జిల్లాలో పలుప్రాంతాల్లో సాగుతున్న ఇసుక అక్రమరావాణాకు చెక్ పెట్టాలని, ప్రకృతి వనరుల విధ్వంసాన్ని నిలువరించాలని అంతా కోరుతున్నారు.
Tags: Exactly sand smuggling

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *