నిరాశజనకంగా మామిడి దిగుబడి 

Exciting mango yield

Exciting mango yield

Date:26/04/2019
 రాజమండ్రి ముచ్చట్లు:
మామిడి దిగుబడి ఈ ఏడాది గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. దిగుబడి లేక రైతులు దిగాలు పడుతున్నారు. ప్రతీ ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా దిగుబడి బావుంటుందని భావించి తోటలను గుత్తకు తీసుకున్న వారు భారీగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మామిడి తోటలు అపుడే కాయలు కోసేసినట్టుగా ఖాళీగా కన్పిస్తున్నాయి. చెట్టుకు అక్కడక్కడ రెండు మూడు కాయలు కన్పిస్తున్నాయి. పూత రాలిపోవడం, పూత దశలోనే ఈదురుగాలులు రావడం వంటి పరిణామాలు దెబ్బతీశాయి. అసలు ఈ ఏడాది అసలు పూతే సరిగాలేని పరిస్థితిలో పిందె దశకు వచ్చేసరికి ఈదురు గాలులు వీయడం మరింత దెబ్బతీసింది. గత ఐదేళ్ల కాలంలో కాపు ఇంతగా లేకపోవడం ఇదే మొదటిసారని రైతులు అంటున్నారు. ఏప్రిల్ మొదటి వారానికి మార్కెట్‌లో మామిడి ఇబ్బడి ముబ్బడిగా కన్పిస్తుంటుంది. కానీ ప్రస్తుతం దిగుబడి లేకపోవడంవల్ల అక్కడక్కడ మచ్చుకు కన్పిస్తున్నాయి. మార్కెట్‌లో ఆవకాయ కాయ కూడా దొరకడంలేదు. సాధారణంగా ఆవకాయకు కొత్తపల్లి కొబ్బరి, సువర్ణరేఖ రకాలను వాడతారు. దిగుబడి లేకపోవడం వల్ల మార్కెట్‌కు కాయ రావడంలేదు.తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో మామిడి తోటలు విస్తరించి వున్నాయి.
చాలావరకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు అదృశ్యమయ్యాయి. ఐదు ఎకరాల మామిడి తోట సుమారు రూ.లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు గుత్తకు తీసుకున్న వైనాలు వున్నాయి. దిగుబడి ఆశాజనకంగా లేకపోవడం వల్ల గుత్తదారులు నష్టపోయే పరిస్థితి దాపురించిందని అంటున్నారు. నిండుగా కాయలతో తొణికిల లాడే మామిడి తోటలు ఇపుడు ఆకులతో దట్టంగా కన్పిస్తున్నాయి. చెట్టుకు అక్కడక్కడా కాయలు వుండటంతో తోటలోని మకాం మంచె వద్ద కాపలా కూడా దండగేనని రైతులు వాపోతున్నారు. సాధారణంగా జిల్లాలో బంగినపల్లి, పంచదారకలశం, చెరకు రసాలు, పాపారావుగోవ, సువర్ణరేఖ, పెద్ద రసాలు, చిన్న రసాలు, పండూరు మామిడి వంటి రకాలు విరివిగా లభిస్తాయి. అతి మధురమైన సుగంధభరితమైన ఇమామ్ పసంద్ వంటి రకాలు అంతరించిపోయే దశకు చేరాయి. ఈ నేపథ్యంలో ఈసారి మామిడి ధర అతి ప్రియంగా మారనుంది.
Tags:Exciting mango yield

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *