Natyam ad

విషాదయాత్రలుగా మారుతున్న విహార యాత్రలు

శ్రీకాకుళం ముచ్చట్లు:

సిక్కోలు సముద్రతీరంలో మృత్యు ఘోష విన్పిస్తోంది. విహారయాత్రలకు వచ్చి సముద్రం స్నానాలకి దిగి మృత్యువాత పడుతున్న సంఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వారం రోజుల వ్యవధిలో శ్రీకాకులం జిల్లాలోని ఎచ్చెర్ల, గార మండలాల పరిధిలోని బుడగట్ల పాలెం, మొగదాలపాడు ప్రాంతాలలో పలువురు మృత్యువాతపడ్డారు. ఈ వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రతి ఏడాది పిక్నిక్ సీజన్ లో ఇటువంటి ప్రమాదాలు జిల్లాలో చోటుచేసుకుంటునే ఉన్నాయి. వాటిని గమనించి జాగ్రత్తలు పాటించాల్సిన ప్రజలు అజాగ్రత్తతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సరదాగా సముద్ర స్నానాలు చేస్తూ అందని లోకాలకు చేరుకుంటున్నారు. కన్నవారికి కుటుంబ సభ్యుల గుండె కోతకి కారణమవుతున్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆదివారం పిక్నిక్ లు పెద్ద ఎత్తున జిల్లాలో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో విహారాలకు వెళ్తున్నారు. రణస్థలం నుంచి ఇచ్చాపురం వరకూ అనేక చోట్ల బీచ్ లకు ప్రజలు క్యూ కడుతున్నారు.

 

 

 

 

బుడగట్లపాలెం, డి.మత్స్యలేశం, బొంతల కోడూరు, పెద్దగణగళ్లవానిపేట, కుందువానిపేట, మొగదాలపాడు, కళింగపట్నం, బారువ, భావనపాడు ప్రాంతాలు ఆదివారం పూట కోలాహలంగా కన్పిస్తుంటాయి. సాధారణ రోజులలో కూడా విందులు, వినోదాల కోసం మిత్రులు, స్నేహితుల గ్రూపులు తీర ప్రాంతానికి వస్తుంటారు. అలా వచ్చిన వారిలో కొందరు మద్యం సేవించి స్నానాలకు దిగుతుంటారు. ఒక్కొసారి వారు పెద్ద పెద్ద కెరటాల బారిన పడి లోపలకి కొట్టుకుపోయి గల్లంతవుతున్నారు. తర్వాత ప్రాణాలు కోల్పోయి ఒడ్డుకు మృతదేహాలుగా చేరుతున్నారు. దీంతో విహారం కాస్తా విషాదంగా మారిపోతుంది.ఆదివారం ఎచ్చెర్ల మండలంలోని బుడగట్లపాలెం తీరంలో పిక్నిక్ కి వచ్చిన వారిలో కొందరు సముద్ర స్నానాలకు దిగారు. అలా దిగిన వారిలో ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటకి చెందిన బెండి తేజేశ్వరరావు(19)తో పాటు లావేరు మండలంలోని మురపాక పంచాయితీ చెల్లయ్య అగ్రహారానికి చెందిన కలమటి ప్రసాదరావు(16) లు గల్లంతైయ్యారు. వారిద్దరూ కూడా విద్యార్థులే. తేజేశ్వరరావు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా ప్రసాదరావు ఇంటర్ చదువుతున్నాడు. వారిద్దరిలో తేజేశ్వరరావు మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది. ప్రసాదరావు ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీంతో ఆ కుటుంబాలలో విషాదం నెలకొంది. అదేవిధంగా గార మండలంలోని మొగదాలపాడు తీరంలో బుధవారం విహార యాత్రకు స్నేహితులు వెళ్లారు. వారు సముద్ర స్నానాలకి దిగగా వారిలో శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని తోటపాలెం గ్రామానికి చెందిన ఇద్దరు శంకరరావు,

 

 

 

 

Post Midle

ఆమదాలవలస పట్టణం పరిధిలోని మెట్టక్కివనలకి చెందిన గొల్లపల్లి మనోజ్ కుమార్ లు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. వరుసగా జరిగిన ఈ ఘటనలు విహార యాత్రలకి వెళ్లే వారిలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.సముద్ర స్నానాలకి దిగేటప్పుడు అజాగ్రత్తగా ఉండడంతో పాటు అత్యుత్సాహం ప్రదర్శించడం వల్లనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పోలీసులు అంటున్నారు. తీర ప్రాంతవాసులకి సముద్రపు అలలపై అవగాహన ఉంటుంది. ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉన్న వారికి మినహా మిగిలిన వారికి అక్కడి పరిస్థితుల గురించి అంతగా తెలియదు. సముద్ర తీరంలో ఇసుక తిన్నెలు, ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. మునిగిపోయేంత లోతు లేకపోవడంతో ఈత వచ్చినా, రాకపోయినా పిల్లలు సముద్రస్నానం చేస్తారు. కెరటాల రాకపోకలపై అవగాహనలేకపోవడంతో తమకు తెలియకుండానేలోతుకుజారుకుంటారు. దీంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.

 

 

 

సముద్రంలో స్నానం చేసేటప్పుడు కెరటాల తాకిడి, ఎత్తు, కోతను గమనిస్తూ ఉండాలి. ఛాతీలోతు వరకూ వెళ్లి తాము సురక్షితంగా ఉన్నామని భావించడం సరికాదు. అన్ని కెరటాలు ఒకే ఎత్తు ఉండవు. కెరటాన్ని అధిగమించడానికి ఎత్తుకి ఎగిరేవారు కొందరైతే నీటిలో మునిగేవారు ఇంకొందరు. కొన్ని పరిస్థితుల్లో కెరటం తాకిడితో ఒడ్డుకు వచ్చేస్తారు. కొత్తగా సముద్ర స్నానం చేసేవారు ఈ విషయాలన్నీ పరిగణించరు. దీంతో ఎక్కువ మంది ప్రమాదాలకు గురవుతున్నారు. తీరానికి దూసుకువచ్చే కెరటం తిరుగు ప్రయాణంలో నేలను తాకుతూ వేగంగా వెళ్తుంది. ఈ క్రమంలో కాళ్ల దిగువన ఉన్న ఇసుకను తీసుకుపోతుంది. కొన్నిసార్లు లోతు గొయ్యి ఏర్పడుతుంది. ఈ క్రమంలో స్నానం చేసేవ్యక్తి మునిగిపోయి, ప్రవాహంలో సముద్రంలోకి కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. తీరం కోతకు గురయ్యేటప్పుడు కెరటం వచ్చే దిశ ఒకలాగుంటే తిరుగు ప్రయాణం వేరే దిశలో ఉంటుంది.

 

 

 

స్నానం చేసే వ్యక్తి రెండింటినీ బ్యాలెన్స్ చేయగలగాలి. తీరానికి సమీపంలో ఈత సాధ్యపడదు. ఈత వచ్చినవారు దీమాతో సాహసించి లోతుకు వెళ్తే ప్రమాదానికి గురయ్యే పరిస్థితి లేకపోలేదు.తీర ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు కూడా పూర్తి స్థాయిలో కన్పించడం లేదు. పిక్నిక్ సీజన్ లో ఆదివారం పూట తీర ప్రాంతంలో స్థానిక పోలీసులు, మైరెన్ పోలీసులు గస్తీగా ఉంటున్నా ఇతర రోజుల్లో మాత్రం గస్తీ కొరవడుతుంది. కనీసం ఈ సీజన్ లోనైనా తీర ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ఇదే సందర్భంలో తీర ప్రాంతానికి వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. మద్యం మత్తులో సముద్ర స్నానాలకి దిగి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని సలహా ఇస్తున్నారు.

 

Tags: Excursions turning into tragedies

Post Midle

Leave A Reply

Your email address will not be published.