విస్తరిస్తున్న అనారోగ్యాలు

Date:11/08/2018
కరీంనగర్ ముచ్చట్లు:
కరీంనగర్ జిల్లా గోపాల్‌పూర్‌ గ్రామంలో ప్రజలు అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. సీజన్‌లో మార్పుల వల్లే స్థానికంగా జ్వర పీడితుల సంఖ్య పెరిగిపోతోంది. చిన్నాపెద్దా అంతా మంచాన పట్టిన పరిస్థితి కనిపిస్తోంది. గోపాల్‌పూర్‌లో నెలకొన్న అనారోగ్యాలను అదుపు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమవుతున్నట్లు స్థానికులు అంటున్నారు. బాధితులు సంఖ్య పెరుగుతున్నా.. పారిశుద్ధ్య పనులు కూడా సజావుగా సాగడంలేదని వాపోతున్నారు. పారిశుద్ధ్య పనులు సజావుగా సాగితే రోగాల విస్తృతికి కొంత అడ్డుకట్టపడే అవకాశం ఉండేదని అంటున్నారు. గోపాల్‌పూర్‌లోని పరిస్థితి పరిశీలిస్తే ఇంటికి ఒకరిద్దరు చొప్పున అనారోగ్యంతో నానాపాట్లు పడుతున్నారు. కొన్ని గృహాల్లో కుటుంబ సభ్యులంతా ఆసుపత్రుల్లోనే చేరిన పరిస్థితి కనిపిస్తోంది. తలనొప్పి లక్షణాలతో మొదలై కొద్ది గంటల వ్యవధిలోనే పలువురిని తీవ్ర జ్వరం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కొంతమంది సమీపంలోని దవాఖానాల్లో చేరుతుండగా, అత్యధికులు పట్టణంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుటుంబాల్లో ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే అనారోగ్యానికి గురవుతుండడంతో గ్రామస్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చికిత్స కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ అప్పులపాలవుతున్నామని వాపోతున్నారు. నాలుగైదు గ్రామాలకు కలిపి ఇన్‌ఛార్జులుగా ఉన్న కార్యదర్శులు పంచాయతీల వైపు కన్నెత్తి చూడకపోవడం, ప్రత్యేక అధికారులు బాధ్యతలు చేపట్టినా గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, దోమల నివారణపై దృష్టి సారించడం లేదు. ఇద్దరి మధ్య సమన్వయలోపాలే గోపాల్‌పూర్‌లో ప్రజారోగ్యం క్షీణించడానికి ప్రధాన సమస్యలుగా తెలుస్తోంది. బాధితుల సంఖ్య పెరుగుతున్నా వైద్య ఆరోగ్య సిబ్బంది గ్రామంలో జాగ్రత్తలు, నివారణ చర్యలు చేపట్టకపోవడంపై స్థానికులు విరుచుకుపడుతున్నారు. నామమాత్రంగా మాత్రలు అందిస్తూ పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. జనం ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నా రక్త నమూనాలు సేకరించి అనారోగ్యాలు వ్యాప్తికి గల కారణాలు తెలుసుకోవడంలేదని విమర్శిస్తున్నారు. మరోవైపు బాధితులు ఆహారం తీసుకోకపోవడంతో బలహీనంగా మారుతున్నారు. గోపాల్‌పూర్‌తో పాటు దుర్శేడులోని ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో వైద్యం చేయించుకుంటున్నా ఆరోగ్యం మెరుగుపడడం లేదు. గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి వైద్య నిపుణులు, ఆరోగ్య సిబ్బంది పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అంతా అంటున్నారు. పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల సమ్మెకు దిగడంతో స్థానికంగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ఇక సురక్షిత తాగునీరూ సరిగా అందడంలేదు. ఇలాంటి సమస్యలన్నీ ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి గోపాల్‌పూర్‌లోని బాధితులకు సమర్ధవంతమైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. పారిశుద్ధ్య పనులు సజావుగా సాగేలా చూడాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags:Expanding illnesses

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *