విశాఖలో బలమైన నేతల కోసం ఎదురుచూపులు

Date:21/10/2019

విశాఖపట్టణం ముచ్చట్లు:

విశాఖ అర్బన్ జిల్లా వైసీపీలో నాయకత్వలోపం ఉంది. అది పార్టీ పెట్టినప్పటినుంచి ఉంది. ఈ కారణం చేతనే వైసీపీ అధినేత జగన్ తల్లి, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఎంపీగా పోటీ చేసి లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయారు. నాడు అయిదేళ్ళు విపక్షంలో ఉన్నా, ఇపుడు అధికారంలో ఉన్నా కూడా సొంత పార్టీని దిద్దుబాటు చేసుకోలేకపోతున్నారు. బలమైన నేతలను తయారుచేసుకోలేని దుస్థితిలో వైసీపీ అగ్ర నాయకత్వం ఉంది. ఎటు చూసినా మీడియా బేబీలే తప్ప పార్టీని జనంలోకి తీసుకువెళ్ళే పటిష్టమైన నేతలు లేరంటే లేరు. దీంతో వైసీపీ విశాఖలో ఏ రకంగానూ ఎత్తిగిల్లలేకపోతోంది. జనంలో జగన్ కి ఇమేజ్ ఉంది. పార్టీ పట్ల అభిమానం ఉంది. కానీ నాయకత్వం లేకపోవడం వల్లనే వరస ఓటములు వరిస్తున్నాయని అంటున్నారు.ఇవన్నీ ఇలా ఉంటే పార్టీని పట్టించుకోవాల్సిన హై కమాండ్ కూడా విశాఖ విషయంలో సీరియస్ గా లేదనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మెరికల్లా పనిచేసే నాయకులను గుర్తించి ఆదరించాల్సిన నాయకత్వం అందులో విఫలమైంది. పార్టీ ఎలాగున్నా జగన్ ఇమేజ్ ఉంటే చాలు అనుకుంది. ఈ కారణంగానే 2019 సార్వత్రిక ఎన్నికల్లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

 

 

 

 

మరో వైపు టీడీపీలో బలమైన నేతలు ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు ఆయా చోట్ల గట్టిగా పాతుకుపోయారు. వారిని ఢీ కొట్టే నేతలు లేక‌పోగా ఎన్నికల ముందు వరకూ ప్రయోగాలతోనే వైసీపీ పొద్దు పుచ్చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎంతోమంది ఇన్ ఛార్జిలను మార్చి ఎవరికీ జనంలో నిలదొక్కుకునే అవకాశం ఇవ్వలేదు. దాంతో టీడీపీ చాలా సులువుగా వైసీపీ మీద గెలిచేసింది. ఇక జగన్ కి తన తల్లిని ఓడించిన విశాఖ మీద కొంత విముఖత ఉందని అంటారు. దాంతో అన్ని జిల్లాల విషయం పట్టించుకున్న ఆయన విశాఖ వచ్చేసరికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి వైసీపీ బాధ్యతలు అప్పగించి ఊరుకున్నారు. సాయిరెడ్డి సైతం క్షేత్ర స్థాయిలో జరిగే రాజకీయ పరిణామాలను గమనించకుండా పై పై సర్దుబాట్లతో పార్టీని నడిపించేశారు. జీవీఎంసీ ఎన్నికలు ముంచుకువస్తున్నాయి. ఎవరెన్ని చెప్పినా కూడా ఇప్పటికైతే విశాఖ అర్బన్ జిల్లాలో టీడీపీ పై చేయిగా ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలే ఇపుడు వార్డు సమస్యలు పట్టించుకుటూ జనానికి చేరువ అవుతున్నారు. దానికి తోడు పటిష్టమైన క్యాడర్ ప్రతీ వార్డులో టీడీపీకి ఉంది. ఇక వైసీపీలో ఉన్న నేతలకు ఫేస్ వాల్యూ లేకపోగా జగన్ ఇమేజ్ మీద, అధికారం పార్టీ మీద ఆధారపడుతున్నారు. దీంతో ఎన్నికలు కనుక ఇపుడు పెడితే విశాఖ కార్పొరేషన్ మీద టీడీపీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

 

 

 

 

 

ఈ పరిణామాలను వైసీపీ పెద్దలు కూడా ఊహించారు. అందువల్లనే జంపింగ్ జపాంగుల కోసం వేట మొదలుపెట్టారు. టీడీపీ నుంచి బలమైన నాయకులు వస్తే జీవీఎంసీ ఎన్నికల గండం గట్టెక్కుతామని వైసీపీ నేతలే చెబుతున్నారు. మరి ఫిరాయించి వచ్చిన నాయ‌కుల మీద పార్టీలో ఎంతవరకూ ఆదరణ ఉంటుంది. జనం ఎంతవరకూ ఆదరిస్తారన్నది కూడా సందేహమే. మొత్తానికి ఇప్పటికే రెండు సార్లు విశాఖలో పరాజయాన్ని మూటకట్టుకున్న వైసీపీ తగిన చర్యలు తీసుకోకపోతే మేయర్ ఎన్నిక రూపంలో హ్యాట్రిక్ ఓటమిని సొంతం చేసుకుంటుందన్న అవేదనను నిజమైన కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

 

తూతూ మంత్రంగా  సీసీరోడ్ల నిర్మాణం

 

Tags: Expectations for strong leaders in Visakha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *