కొండపై తిండి  పేరుతో దోపిడీ 

Exploit the food on the hill

Exploit the food on the hill

Date:17/04/2018
తిరుపతి ముచ్చట్లు:
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆదాయానికి తితిదే రెవెన్యూ విభాగమే స్వయంగా గండికొట్టేస్తోంది. అక్రమార్కులకు పరోక్షంగా సహకరిస్తూ కాలక్షేపం చేస్తోందనే విమర్శలు మూటగట్టుకుంటోంది. వేసవి సెలవులు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే యాత్రికుల రద్దీ భారీగా పెరిగింది. తిరుమలలో హోటళ్లు, జనతా క్యాంటీన్లు అందుబాటులో లేకపోవడంతో భక్తకోటి తీవ్ర అసౌకర్యానికి లోనవుతోంది. తిరుమలలో హోటళ్లు, జనతా క్యాంటీన్లు భక్తులను దోపిడీ చేస్తున్నాయంటూ ఓ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర హైకోర్టులో ప్రజావ్యాజ్యం దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టి తప్పులను ఎత్తిచూపుతూ తితిదేకు మొట్టికాయలు వేసింది. ఈ తరుణంలో తితిదే ప్రక్షాళనకు చర్యలు చేపట్టకుండా ఏకపక్షంగా హోటళ్లు, జనతా క్యాంటీన్లను మూసివేసింది. ఈ తంతు జరిగి 3 నెలలకుపైగా కాలం కావస్తున్నా తిరిగి టెండర్లు పూర్తి చేయకుండా కాలక్షేపం చేస్తోంది. వీటి ద్వారా నెలవారీగా రూ.3 కోట్లకుపైగా శ్రీవారి ఆదాయానికి  అద్దెరూపంలో గండిపడుతోంది. మరోవైపు యాత్రికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే పక్షంలో వేసవి సెలవుల్లో సమస్య మరింత తీవ్రతరం కానుంది.తిరుమలలోని ఆరు హోటళ్లకు టెండర్లు పిలిచి తెరవకుండా వాయిదా వేసింది. ఎట్టకేలకు 10 రోజుల కింద టెండర్లను తెరిచి ఖరారు చేశారు. వెంటనే నిబంధనలు మేరకు టెండరు దక్కించుకున్న వారికి అప్పగించకుండా కాలయాపన చేయడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధంగా తితిదే రెవెన్యూ విభాగం పరోక్షంగా సహకరించిందనే విమర్శలున్నాయి. హెచ్‌వీడీసీ హోటల్‌ విషయంలో టెండరు దాఖలు చేసిన వ్యక్తుల్లో ఒకరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సన్నిధానం హోటల్‌ విషయంలో కిటుకు చోటు చేసుకుంది. ఎల్‌-1గా నిలిచిన వ్యక్తి దాఖలు చేసిన టెండరు పత్రంలో తప్పిదాల కారణంగా అర్హతను కోల్పోయారు. నిబంధనలు మేరకు పరిశీలిస్తే రెండో వ్యక్తికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మేరకు టెండరు కమిటీ కూడా ఖరారు చేసింది. దేవస్థానం అధికారుల కమిటీ ఖరారు చేసిన అర్హత ఉన్న వ్యక్తికి హోటల్‌ను అప్పగిస్తూ ఉత్తర్వులు ఇవ్వకుండా లోపాయికారి వ్యవహారాలు నడిపించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి.జనతా క్యాంటీన్లకు తితిదే టెండర్లు పిలిచింది. మధ్య తరగతి భక్తులకు ఉపయుక్తంగా ఉండే ఈ క్యాంటీన్లను తెరిచే పరిస్థితి కల్పించకుండా నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోంది. టెండర్లు ప్రక్రియ పూర్తి కాకుండానే న్యాయస్థానంలో కేసు దాఖలు కావడంతో వ్యవహారం ఆగిపోయింది. న్యాయస్థానంలో తితిదేకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ ప్రక్రియను పూర్తి చేయడంలేదు. వేగంగా ప్రక్రియను పూర్తి చేయకపోవడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, విచారణ పేరిట తాత్సారం, శ్రీవారి ఆదాయానికి నష్టంతో పాటు భక్తులకు అసౌకర్యం కలుగుతోంది. కొందరు వ్యాపారులు సిండికేట్‌ అయ్యి.. కావాలనే ఆటంకాలు సృష్టిస్తున్నారు. వీరికి అడ్డుకట్ట వేయకుండా.. తితిదే రెవెన్యూ విభాగం పరోక్షంగా సహకరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Tags: Exploit the food on the hill

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *