అదనపు మోత

Date:15/02/2018
కరీంనగర్ ముచ్చట్లు:
పెరుగుతున్న గ్యాస్ ధరలతో మధ్యతరగతి ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. ఈ ఆర్ధిక భారం చాలదన్నట్లు సిలిండర్లు సరఫరా చేసినందుకు డీలర్లు కొందరు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయమై కరీంనగర్ వాసుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. గ్రామాలు-పట్టణాలు తేడా లేకుండా ఈ అదనపు వసూళ్లు యథేచ్ఛగా సాగిపోతోందని ప్రజలు అంటున్నారు. రవాణా, హోమ్ డెలివరీ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా.. ఏజన్సీలు, డీలర్లు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకోవడంలేదని వినియోగదారులు అంటున్నారు. దీనిపై సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని చెప్తున్నారు. అధికారుల స్పందన కరవవడంతో పట్టణాల్లో రూ.20నుంచి రూ.30 వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30నుంచి రూ.50వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఈ దందా పరిశీలిస్తే జిల్లాలో వినియోగదారుల నుంచి నెలకు రూ.2.40కోట్ల చొప్పున నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా రూ.24కోట్లపైనే వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోందని అంతా అంటున్నారు.గ్యాస్‌ డెలివరీ సమయంలో వాస్తవానికి రూపాయి అదనంగా ఇవ్వాల్సినపనిలేదు. వినియోగదారుని ఇంటికి గ్యాస్‌ సరఫరా చేస్తే స్లిప్‌లో ఉన్న మొత్తంలో రూ.16.47లు డెలివరీ బాయ్‌కు డీలరు ఇవ్వాల్సి ఉంటుంది. వినియోగదారుడు కేవలం స్లిప్‌పై ఉన్న మొత్తాన్ని మాత్రమే ఇవ్వాలి. అయితే డీలర్లతో పాటూ సిలిండర్లు చేరవేస్తున్న వారూ నిబంధనలు పట్టించుకోవడంలేదు. ఈ విషయమై జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులు, ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో గ్యాస్‌ ఏజెన్సీ డీలర్లు కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిబంధనల మేరకు సంబంధిత ఏజెన్సీలు పని చేయాలని తేల్చి చెప్తున్నారు. అదనపు వసూళ్లకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని దూరం పేరుతో వసూళ్లు చేస్తే ఉపేక్షించమని అంటున్నారు. అధికారుల హెచ్చరికలు ఎలా ఉన్నా ప్రాంతీయంగా అదనపు వసూళ్లకు తెరపడడంలేదు. డీలర్లు జీతాలు చెల్లించకపోవడం వల్లే తాము వినియోగదారులనుంచి అదనపు ఛార్జీలు తీసుకుంటున్నట్లు సిలిండర్లు సరఫరా చేసే వాహనదారులు అంటున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా ప్రజలపై ఆర్ధిక భారం పడుతోంది. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి అదనపు చార్జీలకు తెరదించాలని అంతా కోరుతున్నారు.
Tags: Extra cover

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *