శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫేషియల్ రీడింగ్

Facial reading in Shambhad Airport

Facial reading in Shambhad Airport

Date:17/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
శంషాబాద్ విమానాశ్రయ ప్రయాణికులకు శుభవార్త. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సెక్యూరిటీ చెక్ ఇకపై సులభతరం కానుంది. కెమెరా వంక ఓ చూపు చూస్తే ఆ తంతు పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తద్వారా ఎయిర్‌పోర్టు ప్రవేశం తేలికవడమే కాకుండా భారీగా సమయం కలిసొచ్చే వీలుంది.
సెక్యూరిటీ చెక్ పాయింట్లలో అత్యాధునిక కెమెరాలను సిద్ధం చేస్తున్నారు. 2018 డిసెంబర్‌ లోగా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నారు. అదే జరిగితే దేశంలో ఇలాంటి సదుపాయం ఉన్న ఏకైక ఎయిర్‌పోర్టుగా శంషాబాద్ విమానాశ్రయం మరో ఘనత సాధించనుంది. రానున్న రోజుల్లో శంషాబాద్ విమానాశ్రయాన్ని కాగితం రహితంగా చేయడానికి కసరత్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
బోర్డింగ్ కార్డ్, టికెట్ల స్థానంలో బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ఇ-బోర్డింగ్‌గా పిలుస్తున్న ఈ పద్ధతికి అవసరమైన మెకానిజం, ఏర్పాట్లను చేస్తున్నట్లు చెప్పారు.ఈ కొత్త విధానంలో భాగంగా ఎంట్రీ గేట్ల వద్ద హై టెక్ కెమెరాలను అమరుస్తారు.
వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌ విధానంలో భాగంగా ప్రయాణికులు ఇచ్చే వివరాలను ఈ కెమెరాల్లో నిక్షిప్తం చేస్తారు. ఆ ప్రయాణికుడు మరోసారి విమానాశ్రయానికి వచ్చినప్పుడు కెమెరాల వైపు చూడగానే అతడి వివరాలు డిస్ల్పే అవుతాయి.
దీంతో బోర్డింగ్ పాస్, ఐడెంటిటీ కార్డులు చూపెట్టాల్సిన అవసరం లేకుండానే అధికారులు సదరు ప్రయాణికుణ్ని లోపలికి అనుమతిస్తారు. తద్వారా సెక్యూరిటీ చెకింగ్ ప్రక్రియ సులభంగా, వేగంగా పూర్తవుతుంది. ఈ కొత్త విధానం ద్వారా బోర్డింగ్ ఫార్మాలిటీస్ సులభతరమవ్వడమే కాకుండా ప్రయాణికుల సమయం ఆదా అవుతుందని జీఎంఆర్ ప్రతినిధి తెలిపారు.
ఇది అత్యంత భద్రతతో కూడిన విధానమని, ప్రయాణికులకు ఇబ్బందులు కూడా ఉండవని చెప్పారు. ఎయిర్‌పోర్టు సిబ్బంది ఎంట్రీల్లో ఈ విధానాన్ని ఇప్పటికే విజయవంతంగా పరీక్షించినట్లు వెల్లడించారు.  విమానాశ్రయాల్లో సాధారణంగా తనిఖీల ప్రక్రియకే ఎక్కువ సమయం పడుతోంది.
ఇందుకోసం ప్రయాణికులు గంట, రెండు గంటల ముందే ఎయిర్‌పోర్టు చేరుకోవాల్సివస్తోంది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే భారీగా సమయం ఆదా అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా.. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్‌కు పర్యాటకుల తాకిడి పెరుగుతున్న తరుణంలో.. ఈ విధానం మరింత మేలు చేయనుంది.
Tags: Facial reading in Shambhad Airport

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *