పడకేసిన పాలన (ఆదిలాబాద్)

Date:11/10/2018
ఆదిలాబాద్  ముచ్చట్లు:
గ్రామాల్లో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేసింది. సర్పంచుల పాలన పూర్తి కావడంతో గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించేవారే కరవయ్యారు. పంచాయతీ కార్యదర్శికి రెండు, మూడు గ్రామ పంచాయతీల బాధ్యతలు ఉండటం, ఓటర్లు జాబితాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు తదితర వాటిపై దృష్టి సారించడం, ప్రత్యేకాధికారులు ఉన్నా.. వారు నెలలో ఒకటి రెండు సార్లు ఇలా వచ్చి వెళ్లడం.. వారు పంచాయతీలపై శ్రద్ధ పెట్టక పోవడం, నూతనంగా ఎర్పడిన పంచాయతీలకు నిధులు రాకపోవడం, తదితర కారణాల వల్ల పలు పంచాయతీల్లో ఎక్కడి సమస్యలు అక్కడే ఉండిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. వీటితో పాటు గ్రామాల్లో విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి.
ప్రతి ఏడాది నాలుగు సార్లు గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామసభలను నిర్వహించాలి. అందులో గ్రామంలో నెలకొన్న సమస్యలపై చర్చించి ప్రజల అభిప్రాయాలను సేకరించి వారి ఇష్ట ప్రకారం పనులను చేపట్టాలి. మురుగు కాలువల నిర్వహణ, మంచినీటి సరఫరా, రహదారులు, పారిశుద్ధ్యం, విద్యుత్తు, విద్య, వైద్యం, తదితర వాటిలో నెలకొన్న సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించి వాటిని గ్రామసభలో చర్చించి ఈ పనులను చేయడానికి తీర్మానం చేస్తారు. వాటిని గ్రామ సభలు పూర్తి అయిన తరువాత వెంటనే గ్రామ పంచాయతీ నిధులతో ఆ సమస్యలను పరిష్కరించడానికి గ్రామ పంచాయతీ పాలక మండలి కృషి చేస్తుంది. ప్రతి ఏడాది జవనరి 2న, ఏప్రిల్‌ 14న, జులై 1న, అక్టోబరు 2న గ్రామసభలు నిర్వహిస్తుంటారు.
కాని ఈ నెల 2వ తేదీన చేపట్టాల్సిన గ్రామసభలు నిర్వహించలేదు. పాలకవర్గాలు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు పంచాయతీల్లో గాంధీ జయంతి వేడుకలను మాత్రమే నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఖర్చు, ఆదాయంపై ప్రత్యేకాధికారులు పంచాయతీ కార్యదర్శితో మాట్లాడి వచ్చేశారు. కాని పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై వారు దృష్టి సారించలేదు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన గ్రామ సభలను నిర్వహించలేదని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం-2018 వచ్చినా గ్రామ సభలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలు ఇంకా జిల్లాలకు రాలేదు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,684 గ్రామ పంచాయతీలకు ఆగస్టు 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. వారంతా వివిధ శాఖల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులే. నిత్యం కార్యాలయాల పనులతో తీరికలేకుండా ఉండే ఉద్యోగులకు పంచాయతీలకు ప్రత్యేకాధికారులుగా నియమించడంతో వారంతా మొదటి రోజు విధుల్లో చేరి వచ్చారు. వారానికి ఒకసారి కూడా పల్లెల వైపు చూడటం లేదు. అసలు వారు ఎప్పుడు వస్తారో ఎప్పుడు రారో తెలియని పరిస్థితి. కొంతమంది అధికారులు నెల రోజులకోసారి కూడా రావడం లేదని గ్రామీణులు వాపోతున్నారు. పలువురు అధికారులు 15 రోజులకు, 20 రోజులకు ఒకసారి వెళ్లినా.. పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో పనులు చేయడం లేదు.
ప్రధానంగా కొత్త పంచాయతీల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. ఉమ్మడి జిల్లాలో 548 గ్రామ పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. పాత గ్రామ పంచాయతీలు 1,136 ఉన్నాయి. పాత పంచాయతీల ఖాతాలో నిధులు ఉన్నా.. కొత్త పంచాయతీల బ్యాంకు ఖాతాలను తెరిచే పనిలోనే పంచాయతీ అధికారులు ఉన్నారు. పాత పంచాయతీ నుంచి కొత్త పంచాయతీకి రావాల్సిన డబ్బులు ఇంకా వారి ఖాతాల్లో పడలేదు. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం అవుతుందని పంచాయతీ కార్యాలయ అధికారులు చెబుతున్నారు.
గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేయడంతో అంటువ్యాధులు, విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని అనేక గ్రామాల్లో ప్రజలు డెంగీ, మలేరియా, టైఫాయిడ్, ఇతర వ్యాధులకు గురవుతున్నారు. ఎక్కడా గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్‌ యంత్రాలు లేవు. ఒకటి, రెండు గ్రామ పంచాయతీల్లో ఉన్నా… వాటిని సక్రమంగా వినియోగించడం లేదు. వర్షకాలం కావడంతో రహదారులపై వర్షం నీరు నిలవడం వల్ల అవి దోమలకు నిలయాలుగా మారుతున్నాయి. కాని వాటిని నిర్మూలించడానికి చేపట్టాల్సిన పనులను చేపట్టం లేదు. ఫలితంగా గ్రామాల్లో దోమల బెడద ఎక్కువైంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జ్వర పీడితులు పెద్దఎత్తున చేరుతున్నారు.
నిధులపై ఆంక్షలు..
పంచాయతీల సమస్యలను పరిష్కరించడానికి నిధులు అవసరం ఉంది. 15వ ఆర్థిక సంఘం ద్వారా ఉమ్మడి జిల్లాకు రూ.120 కోట్లు ఏ ఏడాది జులైలో వచ్చాయి. వీటితోపాటు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు, తలసరి ఆదాయం, ఇంటి పన్నులు, సంతలు, తైబజార్లు తదితర వాటి ద్వారా ఆదాయం పంచాయతీలకు వస్తోంది. వచ్చిన డబ్బును గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యలపై ఖర్చు చేయాలి. కాని ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన ఆంక్షలు విధించింది. ప్రస్తుతం పాత పంచాయతీల ఖాతాల్లో డబ్బులు మూలుగుతున్నాయి. వాటిని పంచాయతీ పనులకు వినియోగించడానికి అనుమతి లేకపోవడంతో పంచాయతీల్లో పనులన్నీ పెండింగ్‌లోనే ఉంటున్నాయి. సమస్యలను ప్రత్యేకాధికారులు పట్టించుకోవడం లేదు.
Tags:Falling rule (Adilabad)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *