పడిపోతున్న నీటి నిల్వలు

Date:15/02/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
నగరాల్లో మంచినీటి నిల్వలు పడిపోతున్నాయి. డిమాండ్‌కు సరఫరాకు మధ్య వ్యత్యాసం పెరిగిపోతున్నది. 2030 నాటికి డిమాండ్‌కు, సరఫరాకు మధ్య 40 శాతం వ్యత్యాసం ఉంటుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నగరాల్లో నీటినిల్వలపై అధ్యయనం చేసి ఓ నివేదికను విడుదల చేసింది. అత్యంత వేగంగా తాగునీటి నిల్వలు పడిపోతున్న మొదటి 11 నగరాల జాబితాను విడుదల చేసింది. ఇది భవిష్యత్తు నగరజీవన దుర్భర స్థితికి హెచ్చరిక వంటిదని ఇప్పటికైనా మేలుకోకుంటే నగరాల్లో దాహం కేకలు తప్పవని హెచ్చరించింది. మన దేశం నుంచి బెంగళూరు నగరం ఈ జాబితాలో నిలువడం ఆందోళన కలిగించే అంశం. బ్రెజిల్ ఆర్థిక రాజధాని నగరం సావోపోలో మొదటిస్థానంలో ఉండగా బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్, జనాభా విచ్చలవిడిగా పెరిగిపోవడం, నీటి నిర్వహణ లోపాలే ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నది. ఐరాస నివేదిక ప్రకారం వివిధ నగరాల్లో పరిస్థితి ఎలా ఉందంటే..  బ్రెజిల్ ఆర్థిక రాజధాని నగరమైన సావోపోలో మూడేండ్లుగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నది. గత ఏడాది రిజర్వాయర్లలో నీటి నిల్వలు 15 శాతం దిగువకు పడిపోయాయి. ఒకానొక దశలో నగరవాసులకు కొన్ని వారాలపాటు మాత్రమే నీరందించగలిగే దుర్భర పరిస్థితి ఎదురైంది. ఈ ఏడాది సైతం ఇలాంటి పరిస్థితులే నెలకొంటున్నాయి. నిర్వహణ లోపమే ప్రధాన కారణమని చెప్తున్నారు. నగర జనాభా విపరీతంగా పెరుగుతున్నా దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు లేవు. ముఖ్యంగా నీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు భారీగా వృథా అవుతున్నది. లేదా వినియోగించడానికి పనికిరానంతగా కలుషితం అవుతున్నాయి. బెంగళూరు పరిధిలోని ఏ ఒక్క చెరువులోని నీరు కూడా కనీసం స్నానం చేయడానికి, బట్టలు ఉతుక్కోవడానికి పనికిరావని తేలింది. నీరు అడుగంటుతున్న నగరాల జాబితాలో చైనా రాజధాని బీజింగ్ మూడోస్థానంలో ఉన్నది. ఐరాస లెక్కల ప్రకారం ఒక వ్యక్తికి ఏడాదికి పది లక్షల లీటర్ల మంచినీరు అవసరం. కానీ బీజింగ్‌లో 2014 సంవత్సరంలో ఒక్కో వ్యక్తికి సగటున 1.45 లక్షల లీటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈజిప్ట్ రాజధాని కైరోకు ఈ జాబితాలో నాలుగో స్థానం దక్కింది. ఈజిప్ట్ మొత్తం నీటికోసం శతాబ్దాలుగా నైలు నది మీదనే అతిగా ఆధారపడుతున్నది. అయితే విచ్చలవిడిగా జనాభా పెరిగిపోవడంతో దేశంలోని 97శాతం జలనరులు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. 2025 నాటికి దేశవాసులు తాగునీటికి అల్లాడే పరిస్థితులు ఎదురవుతాయని హెచ్చరించింది. ఆ తర్వా తి స్థానాల్లో వరుసగా జకార్తా, మాస్కో, ఇస్తాంబుల్, మెక్సికో సిటీ, లండన్, టోక్యో, మియామీ నిలిచాయి. ఆధునిక యుగంలో కనీసం తాగునీరు లేక ప్రజలు దాహార్తితో అలమటించిన మొదటి నగరం దక్షిణాఫ్రికా రాజధాని కేప్‌టౌన్. 2015లో కేప్‌టౌన్‌లోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు నాలుగు శాతం దిగువకు పడిపోయాయి. దీంతో ప్రజలకు తాగునీరు అందించడమే కష్టంగా మారింది. ఒకానొక దశలో కేవలం 20 రోజులు మాత్రమే నీరు అందించగలిగే పరిస్థితి నెలకొన్నది. రోజుకు 90 లీటర్ల నీటిని మాత్రమే అందించారు. ప్రభుత్వ నల్లాల ద్వారా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో మాత్రమే నీరందించారు. అక్కడ సాయుధ పోలీసులు కాపలాగా ఉండగా, నిఘా నీడలో నీటిని పంపిణీ చేశారు. ప్రజలు గంటల కొద్దీ లైన్లలో నిలబడి నీటిని పట్టుకున్నారు.
Tags: Falling water reserves

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *