ప్రముఖ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ కన్ను మూత
రంగారెడ్డి ముచ్చట్లు:
ధ్యాన మంటే శ్వాసమీద ధ్యాస అని 40 ఏళ్ల పాటు అలుపెరగని ప్రచారం చేసి, కోట్లాది మందిని ఆధ్యాత్మికతవైపు మళ్లించిన ప్రముఖ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో తుదిశ్వాస విడిచారు. పత్రీజీకి భార్య స్వర్ణమాల, కుమార్తెలు పరిణత, పరిమళ ఉన్నారు.సుభాష్ పత్రీజీ 1947లో బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో పీవీ రమణారావు, సావిత్రీదేవిలకు జన్మించారు. తొలుత 1975లో ఓ బహుళజాతి ఎరువుల కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా 1980లో జ్ఞానోదయం పొందారు. ఆయన పొందిన జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇతరులకు పంచాలని భావించారు. ఈ మేరకు 1990లో కర్నూల్ స్పిరిచ్యువల్ సొసైటీ (పిరమిడ్ కేంద్రాన్ని) స్థాపించారు. అనేక మందిని ధ్యానులుగా, జ్ఞానులుగా మార్చారు. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని ప్రజలకు పంచాలని భావించిన ఆయన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో 2008లో మహేశ్వర మహాపిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2009 ఆగస్టు 15న పనులు ప్రారంభించారు. 2012 నుంచి ధ్యానమహా చక్రాలు ప్రారంభించారు. ఏటా లక్షలాది మందితో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకుపైగా పిరమిడ్‌లను నిర్మించారు.
Tags: Famous meditation teacher Subhash Patriji’s eyes closed

