పంటలను ఆశిస్తున్న తెగుళ్లతో ఆందోళనలో రైతులు

Date:14/09/2018
కుమురం భీమ్ ముచ్చట్లు:
కుమురం భీమ్ జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభంలో అనుకూలంగా వర్షాలు కురియడంతో సాధారణ సాగు కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు రైతులు. మొదట్లో సమస్యలున్నా ప్రస్తుతం నీరు పుష్కలంగా ఉండడంతో పంటలు ఏపుగా పెరుగుతున్నాయి.
ఇక గత నెలలో భారీ వర్షాలు కురవడంతో కొన్ని మండలాల్లో పంట పొలాలు నీట మునిగి పంటలకు నష్టం వాటిల్లింది. జరిగిన నష్టం నుంచి తేరుకొని ఉన్న పంటలను కాపాడుకుంటున్నారు కర్షకులు. ఇలాంటి సమయంలో ఏటా పంటలను ఆశించే తెగుళ్లతో పాటూ కొత్త తెగుళ్లు పంటలకు సోకాయి. రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి.
తెగుళ్ల బారినుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు పురుగు మందులపై పెద్దమొత్తంలోనే ఖర్చు చేస్తున్నారు. టమాటా పంట విషయానికొస్తే సరిగ్గా కోత దశలో ఉన్న సమయంలో వర్షాలు పడ్డాయి. వర్షాలు, వరదల ప్రభావానికి పంట తీవ్రంగా దెబ్బతింది. ఈ కష్టాలను ఎలోగోలా అధిగమించినా టమాటా నాణ్యతకు తగ్గట్లుగా లేదు.
కాయలపై మచ్చలు రావడంతో అమ్మడానికి వీల్లేకుండా పోయాయని రైతులు వాపోతున్నారు. ఆశించిన దిగుబడి రాక, వచ్చిన కాయలో 30 శాతం చెడిపోవడంతో పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కుమురంభీం జిల్లాలో సాధారణ సాగు 1.26లక్షల ఎకరాలపైనే ఉంటుంది. వాతావరణం అనుకూలంగా ఉండడంతో 1.17లక్షల ఎకరాలకుపైగా భూమి సాగులోకి వచ్చింది.
మొదట్లో వర్షపాతం లోటుగా ఉన్నా ఆగస్టులో పది రోజులు ఏకధాటిగా కురిసిన వర్షాలకు జిల్లావ్యాప్తంగా నీటి వనరులు మెరుగుపడ్డాయి. అయితే తెగుళ్లు కూడా  విజృంభిస్తుండడంతో రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. ఇప్పటికే పత్తి పంటను గులాబీ పురుగు ఆశించింది. ఈ తెగులును వదిలించుకునేందుకు పత్తి రైతులు పాట్లు పడుతున్నారు. సోయాతో పాటూ ఇతర పంటల పరిస్థితీ చెప్పుకోతగ్గ స్థాయిలో లేదు.
దాదాపు అన్ని పంటలకు వివిధ రకాల తెగుళ్లు సోకాయి. వరి, మొక్కజొన్న, కంది, పెసర్లు, మినుములు తదితర పంటలనూ తెగుళ్లు ఆశించాయి. పలు మందులు పిచికారీచేస్తున్నా పెద్దగా ఫలితం ఉండడం లేదని రైతులు వాపోతున్నారు. ఇదిలాఉంటే మిరపకు వైరస్‌ ఆశించిందని సమాచారం. కోత దశలోనే పంటను తగులబెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పలువురు అంటున్నారు.
అధిక వర్షాలతో కొన్ని ప్రాంతాల్లో నీరునిలిచిపోవడం వల్ల పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని చెప్తున్నారు. కూరగాయల పంటలదీ దాదాపు ఇదే దుస్థితి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రభుత్వమే ఆదుకోవాలని, నష్టాల్లో కూరుకుపోకుండా రైతన్నలకు సర్కార్ అండగా ఉండాలని అంతా
విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags; Farmers are concerned with the pests that are looking for crops

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *