రైతు బజార్ ఆశయానికి తూట్లు

Date:14/01/2020

తిరుపతి ముచ్చట్లు:

రైతు బజార్లు ప్రభుత్వ ఆశయాన్ని నీరుగారుస్తున్నాయి. అధికారుల అనాలోచిత నిర్ణయాలు రైతులు, చిరు వ్యాపారుల పట్ల శాపంగా మారాయి. దళారుల మాయమాటలకు తక్కువ రేటుకే రైతులు తమ కూరగాయలను అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. రైతు బజారు అనేది అన్నదాతలు తాము పండించిన పంటలు స్వయంగా అమ్ముకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆశయం మంచిదే అయినా తిరుపతిలోని రైతు బజారుతో రైతులకు ఎంత వరకు ప్రయోజనం చేకూరుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం ప్రజలంతా సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయలపై మక్కువ చూపడంతో పల్లెల నుంచి వచ్చే కూరగాయలకు డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో పల్లె ప్రాంత రైతన్నలు తాము పండించిన కూరగాయలను తిరుపతి నగరంలోని రైతు బజారుకు తీసుకొచ్చి స్వయంగా అమ్ముకుని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తిరుపతిలోని రైతు బజారుకు రైతులు తాము పండించిన కూరగాయలను అమ్ముకోవడానికి క్యూ కడుతున్నారు.

 

 

 

 

రైతు బజారు ప్రాంగణంలో వారికి వెసులుబాటు కల్పించకపోవడంతో రైతు బజారు వెలుపలనే ఫుత్‌పాత్‌లపైన అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది. కొంత మంది రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. రైతులు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. అంతేకాక రైతు బజారు నియమ నిబంధనలపై అవగాహన లేక చాలా మంది రైతులు నష్టపోతున్నారు. రైతు బజారుకు ఉదయాన్నే 6 గంటలకు రైతులు తమ కూరగాయలను తీసుకొస్తారు. అయితే వారిని అమ్ముకోవడానికి దళారులు అడ్డుపడతారు. రైతులు చెప్పే రేటుకంటే తక్కువ ధరకు మాయమాటలు చెప్పి కొనుక్కుంటారు.

 

 

 

ఆ దళారుల మాటలకు మోసపోయి రైతులు వారు తెచ్చిన కూరగాయలను తక్కువ రేటుకే అమ్ముకుంటారు. ఆ తర్వాత దళారులు రోజంతా అక్కడే ఉండి ఎక్కువ రేటుకు వినియోగదారులకు విక్రయించుకుంటారు. దీంతో తాము కష్టపడి పండించిన కూరగాయలను అమ్ముకోవడానికి రైతులు నానా కష్టాలు పడుతున్నారు. తమకు రావాల్సిన ఆదాయాన్ని దళారులు చేజిక్కించుకోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు తికమక పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు దళారుల నుంచి రైతులను కాపాడాలని వారు కోరతున్నారు.

 

ఆక్వా పేరుతో వరి పంటకు కోత

Tags: Farmer’s Bazaar hotspot

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *