కనీస మద్దతు ధరకు దూరంగా రైతులు

Date:13/10/2018
వరంగల్ ముచ్చట్లు:
వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌లో సీసీఐ రెండ్రోజుల క్రితం రెండు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ సీజన్‌కు సంబంధించిన పత్తి రాబడులూ అధికంగా వస్తున్నాయి. కానీ వ్యాపారులతో పోలిస్తే సీసీఐ నామ మాత్రంగా కొనుగోలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటిరోజు 20 క్వింటాలు, రెండోరోజు అసలే కొనుగోలు చేయలేదు. దీంతో రెండురోజుల్లో ప్రయివేటు వ్యాపారులు 10వేల 777 క్వింటాలు కొనుగోలు చేశారు.
రూ.5,450 కనీస మద్దతు ధర ప్రకటించగా రూ.5,325 ధరతోనే అధికంగా పత్తిని కొనుగోలు చేశారు. కనీస మద్దతు ధరకు రూ.125లు తగ్గించే కొనుగోలు చేశారు. దీంతో కనీస మద్దతు ధర అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈసారి కొత్త పత్తికి మార్కెట్‌లో ధర పెరిగింది. అక్టోబర్‌లో కొత్త పత్తికి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.5,770, కనిష్టంగా రూ.4,900 ధర ఉండగా, పత్తిని అధికంగా రూ.5,325లకు కొనుగోలు చేశారు. 2017-18లో అక్టోబర్‌ మాసంలో పత్తి ధర రూ.5,140-రూ.2,900 ఉంది. అధికంగా రూ.4,416లకు కొనుగోలు చేశారు.
2016-17లో రూ.5,810-రూ.4,400 ఉండగా.. రూ.4,911 ధరకు పత్తిని కొన్నారు. 2015-16లో రూ.4,355-రూ.3,400 ఉండగా, రూ.3,866 ధరతో అధికంగా పత్తిని కొనుగోలు చేశారు. అయితే ప్రయివేటు వ్యాపారులు మద్దతు ధరకంటే రూ.125 తగ్గించి కొనడంతో ఇలా ఎకరాకు సుమారు వెయ్యి రూపాయలు రైతన్నకు నష్టం కలుగుతోంది.
అందువల్ల సీసీఐ ద్వారానే కొనుగోళ్లు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. వరంగల్‌ కేంద్రాల్లో  మార్కెట్‌లో రైతులకు కనీస మద్దతు ధర కరువైంది. తొలిరోజు మార్కెట్‌లో 4వేల 271 క్వింటాల పత్తిని ప్రయివేటు ట్రేడర్లు కొనుగోలు చేయగా, సీసీఐ కేవలం 20 క్వింటాల పత్తిని మాత్రమే కొనుగోలు చేసింది. గురువారం 6వేల 506 క్వింటాల పత్తిని ప్రయివేటు ట్రేడర్లు కొనుగోలు చేస్తే, సీసీఐ అసలే కొనుగోలు చేయలేదు.
తేమ పేరుతో కొర్రీలు పెడుతూ కొనుగోళ్లకు సీసీఐ నిరాకరిస్తుంది. పొడవు పింజ రకానికి రూ.5,450, మధ్యరకం పింజ పొడవు రకానికి రూ.5,150 ధరతో కొనుగోలు చేయ నున్నట్టు ప్రకటించింది. కానీ ఈ ధర కూడా రైతులకు అందడం లేదు. 8 శాతం కంటే తేమ అధికంగా ఉంటే ఒక్క శాతానికి రూ.54.50 చొప్పున ధర తగ్గిస్తున్నారు. 12 శాతం కంటే అధికంగా తేమ ఉంటే పత్తిని అసలే కొనుగోలు చేయడం లేదు. 2018-19లో అక్టోబర్‌ మాసంలో ఎనుమాముల మార్కెట్‌లో ఇప్పటివరకు 32 వేల 766 క్వింటాల పత్తి వచ్చింది. సీసీఐ 20 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేసింది.
ఎనుమాముల మార్కెట్‌లో సీసీఐ నామమాత్రపు కొనుగోళ్లు (క్వింటాళ్లలో)
సంవత్సరం ప్రయివేటు ట్రేడర్లు సీసీఐ (శాతం)
2015-16 14,22,676 53,911 (3.65)
2016-17 17,20,440 అసలు కొనలేదు
2017-18 16,31,429 47,313 (0.25)
Tags: Farmers far away from the minimum support price

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *