15 నుంచి రైతు బంధు… నిధులెలా

హైదరాబాద్ ముచ్చట్లు :

 

రైతులందరికీ రైతుబంధు వర్తింపు చేస్తున్నా… ఇప్పుడు నిధుల సర్దుబాటు సమస్యగా మారింది. ఈ నెల 15 నుంచి రాష్ట్రంలో వానాకాలం సీజన్ రైతుబంధు పెట్టుసాయం పంపిణీ మొదలుకానుంది. ఇప్పటికే వ్యవసాయ శాఖకు నిధులను జమ చేయాల్సి ఉండగా ఇంకా సర్దుబాటుల్లోనే ఉన్నారు. బడ్జెట్లో ఈసారి రూ. 14వేల కోట్లు రైతుబంధు కోసం కేటాయించినా.. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇబ్బందిగా మారుతోంది. మరోవైపు ఈ పథకం తొలినాళ్లలో మే 10 నుంచే పెట్టుబడి సాయం పంపిణీ మొదలైనా ఇప్పుడు జూన్కు చేరింది.ప్రస్తుతం రైతుబంధుపై ఆదా చేసుకునే పరిశీలన జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆర్థిక శాఖ నుంచి కూడా దీనిపై కసరత్తు జరుగుతుందంటున్నారు. కానీ ఇప్పటికే సీఎం కేసీఆర్ రైతుబంధు పంపిణీ రైతులందరికీ చేస్తామని ప్రకటించారు. కానీ కొంతమంది రైతుల చేతుల్లో పదుల సంఖ్యల ఎకరాల భూమి ఉండటంతో కౌలుకు ఇచ్చేశారు. కానీ కౌలురైతులకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు.మరోవైపు సాగులో లేని భూమికి కూడా ప్రతీఏటా కోట్ల రూపాయలు పెట్టుబడి సాయం కింద అందుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బడా రైతులకు, సాగుకు యోగ్యం లేని భూమికి రైతుబంధు పెట్టుబడి సాయాన్ని నిలిపివేయాలంటూ ప్రభుత్వానికి సలహాదారులు సైతం సూచిస్తున్నారు.రాష్ట్రంలో సాగుకు పనికి రాకుండా ఉన్న భూమికి రూ. 3300 కోట్లు రైతుబంధు పెట్టుబడి సాయంగా అందిస్తున్నారని ప్రభుత్వ లెక్కలే స్పష్టం చేస్తున్నాయి.

 

 

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రచురించే గణాంకాల ప్రకారం రాష్ట్ర భూ విస్తీర్ణం 112.08 లక్షల హెక్టార్లు. ఇది దాదాపుగా 2.77 కోట్ల ఎకరాలకు సమానం. ఇందులో ప్రభుత్వ అటవీ భూమి, చెరువులు, కుంటలు, కాల్వలు, రైల్వేలు, రోడ్లు, స్కూళ్లు, కాలేజీలు, ఆట స్థలాలు, ప్రభుత్వ ఆఫీసులు, ఆసుపత్రులు మొదలగు వాటి కింద ఉన్న మొత్తం భూమి 83 లక్షల ఎకరాలు. ఇక నగరాలు, గ్రామాలు, రియల్ ఎస్టేట్ విస్తరించి ఉన్న భూమి 24 లక్షల ఎకరాలు. వివాదాలున్న భూములు 17.80 లక్షల ఎకరాలు. రైతుల వద్ద ఉన్న వ్యవసాయేతర భూములు 11.95 లక్షల ఎకరాలు. సాగుకు అనువైన భూమి కోటి 61 లక్షల ఎకరాలు. ఈ భూమిని సాగుచేస్తున్న రైతుల సంఖ్య 58.33 లక్షలు.సాగుకు అనువుగా ఉన్న భూమిలో సాగు విస్తీర్ణం ఏటా ఒకేలా ఉండదు. అది వర్షాలపై ఆధారపడుతుంది. ఆశించినస్థాయిలో వర్షాలు కురిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. లేకుంటే తగ్గుతుంది. సాగు విస్తీర్ణం గరిష్టంగా నమోదైంది కోటి 20 నుంచి కోటి 32 లక్షల ఎకరాలు మాత్రమే. అంటే సాగుకు అనువుగా ఉండి పంట వేయని భూమి ఏటా సుమారు 33 లక్షల ఎకరాలకు పైగానే ఉంటుంది. అంతేకాకుండా దీనిలో 60 వేల ఎకరాలు పక్కాగా రాళ్లు, బండరాళ్లే.

 

 

 

 

 

ఇలాంటి మొత్తం సాగులోని భూములకు సాలీనా అందుతున్న రైతుబంధు ఆర్థిక సహాయం రూ. 3,300 కోట్లపేనే ఉంటోంది.పంట పెట్టిన వారికి, పెట్టని వారికి సమానంగా ఆర్థిక సహాయం అందించటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు కూడా గతంలోనే ఉత్ఫన్నమయ్యాయి. సాగుకు అనువైనప్పటికీ సాగుచేయని ఈ భూస్వాములంతా 25 ఎకరాలకుపైగా భూకమతాలు కలిగివున్న వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగస్థులు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకున్న బడా భూస్వాములే.ఇక రాష్ట్రంలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 18 లక్షల మంది. వీరికి అందుతున్న ఆర్థిక సహాయం రూ.415 కోట్లు. రెండెకరాలలోపు భూమి ఉన్న వ్యవసాయదారుల సంఖ్య 24 లక్షలు. వీరికి అందుతున్న ఆర్థిక సహాయం 1,292 కోట్లు. కానీ సాగు చేయని భూమికి ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయం అక్షరాలా రూ. 3,300 కోట్లు. మరి ఇంత మొత్తం ఎక్కడికిపోతోంది..? ఆ సాయం ఎవరు తీసుకుంటున్నారనేది రాష్ట్రమంతా తెలిసిన బహిరంగ రహస్యమే.ప్రభుత్వం కూడా ఎంతసేపూ రైతుబంధు పథకం అమలు కోసం రూ. 14 వేల కోట్లు దాదాపు 58 నుంచి 60 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ అయిన విషయాలే చెబుతుంది కానీ… అందులో సాగుభూములెన్ని? పడావు భూములెన్ని?

 

 

 

 

 

అనే వివరాలను మాత్రం చెప్పడం లేదు. ఇప్పటి వరకు ఈ వివరాలను ప్రభుత్వం అందించిన దాఖలాలు కూడా లేవు. అయితే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం లెక్కలేస్తే.. రాష్ట్రంలో సాగు అయిన భూముల విస్తీర్ణం చూస్తే 202‌‌0 వానాకాలంలో లక్షా 20 వేల ఎకరాలు, యాసంగిలో 60 లక్షల ఎకరాలు సాగు చేస్తుండగా… రెండు సీజన్లకూ కలిపి మొత్తం కోటి 80 లక్షల ఎకరాలు అవుతాయి.వాస్తవానికి వానాకాలంలో సాగు చేసిన భూమిలోనే యాసంగిలోనూ రైతు పంటలు పండిస్తుంటాడు. సీజన్లను బట్టి వేర్వేరుగా, ప్రత్యేకంగా సేద్యపు భూములు ఉండవు. నీటి లభ్యత తదితర అంశాలు యాసంగి సేద్యపు విస్తీర్ణానికి ప్రామాణికంగా నిలుస్తాయి. అయినప్పటికీ 1.80 కోట్ల ఎకరాలను పరిగణనలోకి తీసుకున్నా… ఈ విస్తీర్ణానికి రూ. 9 వేల కోట్లు రైతుబంధు పథకం కోసం సరిపోతాయి. పడావు భూములు, వృథాగా పడి ఉన్న, రాళ్లు, రప్పలతో ఉన్న బంజరు, పడావు భూములకు కూడా రైతుబంధు పేరిట దాదాపు రూ. 3,300 కోట్లు ఇస్తున్నట్లు

 

 

 

 

స్పష్టమవుతోంది.అదేవిధంగా ఐదెకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే రైతుబంధు ఇస్తామని పరిమితి విధిస్తే 45 లక్షల ఎకరాల భూమిని కలిగి ఉన్న బడా రైతులకు పథకాన్ని వర్తింపజేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఐదెకరాలకుపైన భూములున్న రైతులెవరూ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూసే ఆర్థిక పరిస్థితులు ఉండవని ప్రభుత్వ యంత్రాంగం, ఎమ్మెల్యేలు చెప్పుతున్నారు. ఇటువంటి వారికి రైతుబంధు సాయం ఇవ్వాల్సిన అవసరమే లేదని నిండు అసెంబ్లీలోనే సీఎంకు సూచించారు. ఒకవేళ ఈ విధంగా బడా రైతులకు రైతుబంధును నిలిపివేస్తే రూ. 2295 కోట్లు ఒక్క సీజన్లో మిగులుతాయి. దీంతో రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలు వచ్చే అవకాశం ఉంటోంది.మరోవైపు దీనిపై ప్రస్తుతం వివరాలను సేకరిస్తున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కారణాలేమిటైనా… బడా రైతులకు రైతుబంధు విషయంలో ప్రతిసారి ఏదో అంశం తెరపైకి వస్తూనే ఉంది. అయితే ఈసారి మాత్రం కరోనా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో సాగు చేయని భూమి, భూస్వాముల చేతుల్లో ఉన్న భూమికి రైతుబంధు పెట్టుబడి సాయం వివరాలను లెక్కిస్తున్నారు.

 

 

 

 

అయితే ఈ లెక్కన బడా రైతుల చేతిలో ఉన్న భూమికి ప్రతి సీజన్లో రూ. 2295 కోట్లు ఆదా చేసుకునే అవకాశం ఉండగా… సాగుకు యోగ్యమైన భూమికి పెట్టుబడి సాయం అవసరం లేదని భావిస్తే మాత్రం ఏటా బడ్జెట్లో రూ.3 వేల కోట్ల వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది.14, 2020న అసెంబ్లీలో కాంగ్రెస్ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి దీనిపై మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థికంగా స్థిరపడినవాళ్ళు, వందల ఎకరాలు భూములు ఉన్నవాళ్లకు కూడా రైతుబంధు పథకం అవసరమా అని ప్రశ్నించారు. పదెకరాలు, 20 ఎకరాలు, ఆపైన భూమి ఉన్న వారు పేరుకు రైతులే కానీ వాళ్ళు వ్యవసాయం చేయరని, అందరూ కౌలుకి ఇచ్చి ఎక్కడో సిటీలో సెటిల్ అయ్యారని, కానీ వాళ్ళకి ఒక పక్క కౌలుతో పాటు రైతుబంధు కూడా ఇవ్వడం మంచిదేనా? అని ప్రశ్నించారు. తననే ఉదాహరణగా తీసుకుంటే.. తనకు రూ. 3లక్షలు రైతుబంధు డబ్బులు వచ్చాయని, తనకు రైతుబంధు అవసరం లేదన్నారు. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా అదే పేర్కొన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Farmer’s relative from 15 … How to fund

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *