ఎరువు బరువు 

Date:08/11/2018
ఖమ్మం  ముచ్చట్లు:
ఒకవైపు చీడపీడలు.. మరోవైపు అనుకూలించని వాతావరణంతో సతమతమవుతున్న రైతుకు పెరిగిన ఎరువుల ధరలు గుదిబండగా మారాయి. గతంలో బస్తాకు రూ.10 లేదా రూ.20 చొప్పున పెంచిన కంపెనీలు ఈసారి ఏకంగా రూ.వందలు పెంచి కష్టజీవులపై మోయలేని భారం మోపాయి. గడిచిన ఏడు నెలల కాలంలోనే రెండుసార్లు రేట్లు పెరగడం గమనార్హం.
గిట్టుబాటు ధర ఆశించిన స్థాయిలో లేకపోవడం.. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంట దిగుబడి తగ్గిపోవడం.. తాజాగా ఎరువుల ధరలు ఎగబాకి పెట్టుబడి అమాంతం పెరగడం.. రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో దాదాపు 6 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. అందుకోసం దాదాపు 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులను వినియోగిస్తున్నారు.
ఎరువుల తయారీకి వినియోగించే ముడి సరుకును ఆయా కంపెనీలు విదేశాల నుంచి దిగుమతి చేస్తాయి.
ఎరువులను తయారు చేసేందుకు పెట్రో ఉత్పత్తులతోపాటు పాస్పరిక్‌ యాసిడ్‌ను వినియోగిస్తారు. అయితే వాటి రేట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరగడంతో ఎరువుల ధరలు కూడా అమాంతం ఎగబాకినట్లు వ్యవసాయాధికారులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఒకే సీజన్‌లో ఎరువుల ధరలు రెండు దఫాలు పెరిగాయి. ఫిబ్రవరి 1వ తేదీన, తిరిగి అక్టోబర్‌ 1వ తేదీన ధరలు పెంచారు. దీంతో ఒక్కో బస్తాపై రూ.400 వరకు పెరిగిన పరిస్థితి నెలకొంది.
అంతకుముందు రూ.900 నుంచి రూ.1000 వరకు ఉన్న బస్తా ధర ప్రస్తుతం రూ.1,450 చేరింది. రైతులు దిగుబడి కోసం ఎక్కువగా డీఏపీ, కాంప్లెక్స్, మూరేట్‌ ఆఫ్‌ పొటాష్, సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ వంటి ఎరువులను వినియోగిస్తుంటారు. కంపెనీలు కూడా ఆ ఎరువుల ధరలనే పెంచి రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
ఎరువులన్నింట్లో యూరియా ధర కొంత భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వమే యూరియాకు ఒక ధరను నిర్ణయిస్తుంది. ఆ ధరలకే(సబ్సిడీ) రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. ఒకవేళ దాని ఉత్పత్తి ఖరీదు పెరిగినా అది ప్రభుత్వమే భరిస్తుంది. ఈ ఏడాది యూరియాను 45 కిలోల బస్తాలుగా విక్రయిస్తున్నారు. ఒక్కో బస్తా ఖరీదు రూ.265 కాగా.. కొరత పేరుతో రూ.300 నుంచి రూ.320 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. అదేమని రైతులు ప్రశ్నిస్తే.. కొరత ఉందని, దిగుమతి, ఎగుమతి చార్జీలు ఉంటాయని రైతులను వ్యాపారులు దగా చేస్తున్నారు.
ఈ ఏడాది రైతుకు పెట్టుబడి భారం బాగానే పెరిగిందని చెప్పుకోవాలి. దుక్కి దున్నింది మొదలు అన్ని రకాల ఖర్చులు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌ ధరలు చుక్కలు చూపిస్తుండడంతో ట్రాక్టర్లకు దుక్కి దున్నే కిరాయిలు ఎక్కువయ్యాయి. గత ఏడాది ఒకసారి ఎకరం దుక్కి దున్నడానికి రూ.1000 అయ్యేది. ప్రస్తుతం అది రూ.1,400 చేరింది. అంటే రూ.400 పెరిగింది. ఇదిలా ఉంటే.. ఒక్కో ఎరువుల బస్తాపై గతం కన్నా సుమారు రూ.400 పెరిగింది.
పంట వేసే క్రమంలో మూడుసార్లు దుక్కి దున్నుతారు.. మూడుసార్లు ఎరువులు వేస్తారు. దీంతో మొత్తం ఎకరానికి గతంలో కంటే రూ.2,500 నుంచి రూ.3,000 వరకు రైతులపై భారం పడుతోంది. దీనికి కూలీలు, పురుగు మందుల ఖర్చులు అదనం.. మొత్తం మీద ఈ ఏడాది రైతుకు పెట్టుబడి తడిసి మోపెడుతోంది. ఇంత ఖర్చు పెట్టినా దిగుబడి మంచిగా ఉంటుందా అంటే అదీ లేదు. వాతావరణం అనుకూలించక అన్ని పంటల దిగుబడులు భారీగా తగ్గాయి. దీంతో రైతులకు నష్టాలు తప్పా.. లాభాలు వచ్చే అవకాశం లేదనే చెప్పుకోవాలి.
Tags: Fertilizer weight

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *