గరుడ వాహనసేవలో కళాబృందాల కోలాహలం
తిరుమల ముచ్చట్లు:
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన గురువారం రాత్రి గరుడ వాహనసేవలో వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు ప్రదర్శించిన అరుదైన కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మొత్తం 21 కళాబృందాల్లో 497 మంది కళాకారులు పాల్గొని ప్రదర్శనలిచ్చారు.ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు శ్రీనివాస కళ్యాణాన్ని చక్కగా ప్రదర్శించారు. ఇందులో శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవి, స్వామివారి భక్తులైన శ్రీ గరుత్మంతుడు, శ్రీ తాళ్లపాక అన్నమయ్య తదితర వేషధారణలో కళాకారులు ఆకట్టుకున్నారు.బెంగళూరు, విద్యారణ్యపురి నృత్యోదయ అకాడమీకి చెందిన దివ్యశ్రీ బృందం ఉత్సవసంకీర్తనల నాట్యవిన్యాసం భక్తులను సమ్మోహితులను చేసింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన తోగల్ జోగల్ కళలో భాగవత లీలలను తెలిపే మధురమైన ఘట్టాలను మనోహరంగా ప్రదర్శించారు.కేరళ రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన ఓనంను ఆటపాటలతో అలరించారు. మరో కేరళా రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన కథాకళిని చంద్రశేఖర్ బృందం అత్యంత రమణీయంగా ప్రదర్శించారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సుప్రసిద్ధ జానపద కళారూపమైన సంబల్ పురి అనే కళారూపాన్ని ప్రతిభా రాణి బృందం సంప్రదాయబద్ధంగా ఆడిపాడారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన నెమలిపించాలతో కూడిన భరతనాట్యం నయన మనోహరంగా ప్రదర్శించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బండి గుడుంభజ అనే వాద్యకళను లోక్పాల్ దూవే ఆధ్వర్యంలో కడు విన్యాసాలతోప్రదర్శించారు. గుజరాత్ రాష్ట్రంలోని సుప్రసిద్ధ జానపద కళారూపమైన గూమర్ ను పి.రాజి బృందం చక్కగా ప్రదర్శించి భక్తులను అలరించారు.టీటీడీ జెఈవో సదా భార్గవి ఆదేశాల మేరకు ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామ్ అధికారి రాజగోపాల్, దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు.

Tags:Festival of art troupes in Garuda Vahanaseva
