ఎట్టకేలకు.. చర్యలు..

Date:19/11/2018
కరీంనగర్‌ ముచ్చట్లు:
ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీల్లో కొందరు తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లు సమర్పించారు. ఈ సంగతిని గుర్తించిన ఉన్నతాధికారులు సదరు టీచర్లపై చర్యలకు ఉపక్రమించారు. బదిలీ ప్రక్రియలో పలువురు తప్పుడు విధానాలను అవలంభించారని అధికారుల విచారణలో తేలింది. కొందరు ఉపాధ్యాయులు పట్టుబడినా చర్యలు తీసుకోవడంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహించారు. ఈ ఇష్యూను జిల్లా విద్యాశాఖ సాగతీసింది.
అయితే షోకాజు నోటీసులు జారీ చేసిన అధికారులు వాటి ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకోనున్నారు. గత జూన్‌లో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టింది సర్కార్. ఇక ప్రత్యేక ప్రాధాన్యత కేటగిరి కింద ట్రాన్స్‌ఫర్ల కోసం కొందరు టీచర్లు దరఖాస్తులు సమర్పించారు. వీటిల్లో తప్పుడు వైద్యధ్రువీకరణ పత్రాలు సమర్పించి లబ్ధిపొందేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.
దీనిపై ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాయి. దీంతో అధికారులు విచారణ చేశారు. 22 మంది ఉపాధ్యాయులు తప్పుడు వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించినట్లు గుర్తించి వారికి షోకాజు నోటీసులు జారీ చేశారు. ఆర్టికల్‌ ఆఫ్‌ ఛార్జెస్‌ను ఫ్రేం చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో బాధ్యులపై చర్యలు తప్పవని పలువురు ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు. తప్పుడు వైద్య ధృవీకరణ పత్రాల సంగతి 3 నెలల క్రితమే వెలుగులోకి వచ్చింది. బాధ్యులపై దాదాపు 90 రోజుల తర్వాత జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది.
వాస్తవానికి జిల్లా పాలనాధికారి ఆదేశాలతో మోసానికి పాల్పడ్డ టీచర్లకు ఆగస్టు 3నే క్రమశిక్షణ చర్యలకు షోకాజు నోటీసులు ఇచ్చింది జిల్లా విద్యాశాఖ.ఆ ఉపాధ్యాయుల నుంచి వాటికి సమాధానాలు అందజేయగా, వాటి ఆధారంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది.. షోకాజు నోటీసులు అందుకున్న ఉపాధ్యాయులు అందించిన వివరణకు సంతృప్తి చెందని జిల్లా విద్యాశాఖ వారిపై తదుపరి శాఖా పరమైన చర్యల కోసం ఆర్టికల్‌ ఆఫ్‌ చార్జెస్‌ను ఫ్రేం చేస్తూ లేఖలు జారీ చేసింది. వీటికి బాధ్యుల నుంచి సమాధానాలు రాగానే వారిపై చర్యలు తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.
Tags: Finally .. actions ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *