సర్కార్ పై  ఉండవల్లి  ఫైర్

Fire on the Sarkar

Fire on the Sarkar

Date:10/10/2018
రాజమండ్రి ముచ్చట్లు:
ఎపి పొలిటికల్ ఫైర్ గన్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ మరోసారి సర్కార్ పై కాల్పులు మొదలు పెట్టారు. ఇటీవల ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగం అంటూ టిడిపి మీడియా సాగించిన ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదంటూ ఆధారాలు బయటపెట్టారు. బాబు అమెరికా టూర్ రహస్యాలను పలు పత్రాల ద్వారా మీడియా ముందు పెట్టి సవాల్ విసిరారు. దమ్ముంటే కాదని ఖండించాలన్నారు. ఆయన వ్యాపార ఒప్పందం చేసుకునేందుకే యుఎస్ టూర్ అన్నది తేలిపోయిందని ఏమిటి ఆ వ్యాపారం అన్నది రహస్యం మీకు చెప్పం అని ఎందుకు పారదర్శకంగా వ్యవహరిస్తాం అని డప్పులు కొట్టుకునేవారు దాస్తున్నారని నిలదీశారు ఉండవల్లి.చట్టం పేదవారికి ఒకలా పెద్దలకు ఒకలా ఉంటుందన్నది అందరికి తెలిసిందే అన్నారు ఆయన.
మార్గదర్శి పై విచారణ జరక్కుండా రామోజీ తన శక్తి యుక్తులన్నీ వాడేశారని ఆయనకు కాంగ్రెస్ సహా అన్ని పార్టీల ఆశీస్సులు మెండుగా ఉన్నాయన్నారు. ఆరు నెలలకు పైబడి ఏ స్టే ఉండరాదని నిర్ణయించిన సుప్రీం కోర్టు నిర్ణయం మేరకు ఇటీవలే ఆయన కేసు లో మళ్ళీ కదలిక మొదలైందని అందులో భాగంగా తనకు తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసినట్లు అరుణ కుమార్ వివరించారు.మార్గదర్శి కేసులో కాంగ్రెస్ ఆర్ధికమంత్రి రామోజీ కి మినహాయింపులు ఇచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవి రెడ్డి రాసిన పుస్తకం చదివాకా అర్ధం అయిందని చెప్పారు ఉండవల్లి. చట్టం అంటే గౌరవం ఉంటే తనపై వచ్చిన అభియోగాల్లో నిజం లేదని విచారణకు ముందుకు వచ్చి రామోజీ నిరూపించుకోవాలని సవాల్ చేశారు అరుణ కుమార్.ఎపి మంత్రి నారాయణ చేసిన తప్పులకు ఆయన ఎమ్మెల్సీ రద్దు అవుతుందని ఉండవల్లి అన్నారు.
ఆయనపై తాను చేసిన అభియోగాలతో కోర్టు కి వెళ్ళే సమయంలో తన తల్లి మరణంతో ఆగిపోయానని గుర్తు చేశారు. ఎవరైనా ఉత్సాహవంతులు కోర్టు కి వెళతానంటే తనదగ్గర వున్న ఆధారాలు అందజేస్తా అన్నారు ఉండవల్లి.ఎపి సీఎం చంద్రబాబు అమెరికా టూర్ వ్యాపార ఒప్పందాలకోసమే సాగిందని ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం అంతా ఉత్తిదే అన్నది తేలిపోయిందన్నారు. ముఖ్యమంత్రి దైనందిన కార్యక్రమాలను వెల్లడించే ప్రభుత్వ పోర్టల్ లో అమెరికాలో చంద్రబాబు ఎప్పుడెప్పుడు ఏమేమి చేసింది రిపోర్ట్ చేశారని ఆయన ఐదు రోజుల పర్యటనలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించినట్లు ఎందుకు వివరాలు పోస్ట్ చేయలేదని ప్రశ్నించారు. గతంలో తాను ఐక్య రాజ్య సమితిలో పర్యావరణం .. అణు ధార్మిక ప్రభావం పై చేసిన ప్రసంగాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు ఉండవల్లి.
ప్రకృతి వ్యవసాయం పై అక్బరుద్దీన్ తో కలిసి 16600 కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నారని అది తప్ప ఇంకేమి లేదన్నారు. బెంగళూరు కి చెందిన ప్రఖ్యాత ప్రకృతి వ్యవసాయ అధ్యయన కర్త సంధాన తన వెబ్ సైట్ లో పొందుపరిచిన 47 పేజీల పత్రాలను ఉండవల్లి డౌన్ లోడ్ చేసుకుని వివరాలు వెల్లడించారు. బాబు టూర్ పై వివరాలకోసం సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరినా సెక్షన్ 8 ప్రకారం రహస్యం కాబట్టి వెల్లడించలేమన్నారని తెలిపారు ఉండవల్లి. దేశ రక్షణకు సంబంధించిన అంశాలు తప్ప సెక్షన్ 8 దేనికి అప్లై కాదని బాబు అమెరికాలో ఆయుధాలేమైనా తయారు చేయిస్తున్నారా అని అరుణ కుమార్ ఎద్దేవా చేశారు.
వారేమీ రాజకీయవేత్తలు కాదని ఎందుకు నిజాలు దాచి అబద్ధాలు ప్రజలపై రుద్దుతున్నారని ఈ మోసపు ప్రచారం వల్ల ఏమి లబ్ది పొందుతారని దుయ్యబట్టారు. అమెరికాలోని ఒప్పందాలు, వ్యాపార రహస్యాలు కాబట్టి చెప్పకూడదని సంధాని కి రాసిన లేఖలో అధికారులు పేర్కొనడాన్ని బట్టి ఏదో దాగి ఉందన్న అనుమానం కలుగుతుందన్నారు ఉండవల్లి. ఉచిత విద్యకు విద్యార్థికి 10 వేలరూపాయలన్నట్లు ఉచిత సేంద్రియం పై బాబు చేస్తున్న డాబు ప్రచారం వెనుక వేలకోట్ల రూపాయల ప్రజల సొమ్ము దాగివుందన్న సత్యం ఇదన్నారు ఆయన.
సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం పై తూర్పు గోదావరి జిల్లాలోని తొర్రేడు తన మిత్రులతో వెళ్ళి పరిశీలించామని దేశీయ ఆవు ద్వారా వారు చేస్తున్న సాగు పరిశీలించామని వారు కూడా పంట దిగుబడి కూరగాయల ప్రమాణం పెరిగేందుకు చివరిలో యూరియా వినియోగిస్తున్నారని వివరించారు. ఒక్క గోవుతో 30 ఎకరాల వరకు సాగును ప్రకృతి సేద్యం చేయొచ్చన్నారు. బాబు చేసే ప్రచారానికి గ్రౌండ్ లో జరిగే దానికి పొంతన లేదన్నారు ఉండవల్లి. చంద్రబాబు నిజంగా సక్సెస్ అయితే ఆనందించే వాళ్ళల్లో తానూ ఒకడినని కానీ ఆయన వ్యవహారాలన్నీ ఏపీ కి నష్టం చేకూర్చేవిగానే ఉంటున్నాయని దుమ్మెత్తి పోశారు. ఎవరో ఒకరి ద్వారా తాను చెప్పినవి అన్ని అబద్ధాలని కనీసం చెప్పించే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోతున్నారని ఉండవల్లి ఉతికేశారు.
Tags:Fire on the Sarkar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed