నాగా ఎన్నికల్లో ఐదుగురు మహిళలు ఫస్ట్ టైమ్ పోటీ

Date:24/02/2018
కోహిమా ముచ్చట్లు:
నాగాలాండ్‌ అసెంబ్లీకి ఈనెల 27న జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి ఐదుగురు మహిళలు పోటీ చేస్తున్నారు. అసెంబ్లీలోని మొత్తం 60 సీట్లకుగాను 2.56 శాతం సీట్లకే మహిళలు పోటీ పడుతున్నారు. నాగాలాండ్‌ అసెంబ్లీ ఎన్నికల చరిత్రలోనే ఎక్కువ సంఖ్యలో మహిళలు పోటీ చేయడం కూడా ఇదే మొదటిసారి అంటే ఆశ్చర్యం కలగకమానదు. నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ నుంచి ఇద్దరు, కొత్తగా ఏర్పాటైన నేషనలిస్ట్‌ ప్రోగ్రెసివ్‌ డెమోక్రటిక్‌ పార్టీ నుంచి ఒకరు, భారతీయ జనతా పార్టీ నుంచి ఒకరు పోటీ చేస్తుండగా, మరొకరు స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.గత 15 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని నిరాటంకంగా పాలిస్తున్న నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ నుంచి ఒక్క మహిళ కూడా పోటీ చేయక పోవడం కూడా ఆశ్చర్యకరమే. 1963లో నాగాలాండ్‌ ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు 19 మంది మహిళలు పోటీ చేయగా, ఇంతవరకు ఒక్కరు కూడా విజయం సాధించలేదు. ఇంతవరకు నాగాలాండ్‌ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికల్లో పోటీచేసి ఒకే ఒక మహిళ విజయం సాధించారు. 1977లో యునైటెడ్‌ డెమోక్రటిక్‌ పార్టీ తరఫున లోక్‌సభకు పోటీ చేసి రానో ఎం సాయిజ్‌ విజయం సాధించారు. ఆ పార్టీకి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన మొదటి మహిళ కూడా ఆమెనే. ఆమే ప్రముఖ నాగా వేర్పాటువాద నాయకుడు ఏజెడ్‌ పీజో మేనకోడలు. ఆమె 2015లో మరణించారు.మగవారితో సమానంగా ప్రత్యర్థి సైనికులతో పోరాడడమే కాకుండా తెల్లవారక ముందే కొండ కోనల్లో కష్టమైన పనులకు వెళ్లే అలవాటు, సామాజిక సంస్థల్లో క్రియాశీలక పాత్ర వహించే నాగా మహిళలు ఎన్నికల పట్ల అంతగా ఆసక్తి చూపక పోవడం, ఎన్నికల్లో రాణించక పోవడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. ఒక్క నాగాలాండ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా అసెంబ్లీలలో మహిళ ప్రాతినిధ్యం తొమ్మిది శాతం దాటడం లేదు. గతేడాది ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి మొత్తం 4,800 మంది పోటీ చేయగా, 446 మంది మహిళలు, పంజాబ్‌కు 1145 మంది పోటీ చేయగా, వారిలో 81 మంది, ఉత్తరాఖండ్‌కు 637 మంది పోటీ చేయగా, వారిలో 58 మంది, గోవాకు 250 మంది పోటీ చేయగా, వారిలో 18 మంది, మణిపూర్‌కు 266 మంది పోటీ చేయగా, వారిలో 11 మంది మాత్రమే మహిళలు ఉన్నారు.అస్సాం, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లో పరిస్థితి ఫర్వాలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఎనిమిది శాతం మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2013లో జరిగిన ఎన్నికలతో పోలిస్తే నాగాలండ్‌లో కూడా పోటీచేసే మహిళల సంఖ్య 1.6 శాతం నుంచి 2.5 శాతానికి పెరిగింది. ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్లను కల్పిస్తే వారి ప్రాతినిథ్యం పెరుగుతుందని వాదించేవారు లేకపోలేదు. నాగాలాండ్‌లో గతేడాది ప్రాంతీయ ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించినప్పుడు పెద్ద గొడవ జరిగింది. అది హింసకు దారితీయడమే కాకుండా రాష్ల్రముఖ్యమంత్రి రాజీనామా చేసే వరకు వెళ్లింది. ఒక్క మహిళలే రిజర్వేషన్లనే కాదు, అన్ని రకాల రిజర్వేషన్లకు నాగాలాండ్‌ ఆదివాసీ తెగలు వ్యతిరేకం. ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలన్న విషయాన్ని కూడా ఎక్కువగా స్థానిక సంఘాలే నియమిస్తాయి. కనుక మహిళల ప్రాతినిధ్యం తక్కువగానే ఉంటోంది.
Tags: Five women contest first time in Naga election

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *