సిరిసిల్ల‌లో జెండా పండుగ‌-రాష్ట్రంలో పంపిణీకి చ‌ర్య‌లు

సిరిసిల్ల ముచ్చట్లు:


సిరిసిల్లకు జెండా పండగ ముందే వచ్చింది. ఏ ఇంట్లోకి వెళ్లినా మూడు రంగుల జెండాలే దర్శనమిస్తున్నాయి. కొన్ని చోట్ల కుట్టుమిషన్లపై, మరికొన్ని చోట్ల కత్తిరిస్తూ, మరోచోట ప్యాకింగ్‌ చేసే పనులతో సందడి నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఇరవై రోజులుగా ఇతర రాష్ట్రాలకు రోజుకు సుమారు లక్ష మీటర్ల జాతీయ జెండాలు తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈ రంగంలో ఇక్కడ సుమారు వెయ్యి మందికిపైగా పురుషులు, మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఆయా కొలతల ప్రకారం ఒక్క జెండా తయారీకి రూ.5 నుంచి రూ.8, కండువా తయారీకి రూ.4 ఖర్చవుతుంది. జెండాలు, కండువాలను కత్తిరించడం, మిషన్లపై కుట్టడంతో ఒక్కో మహిళ రోజుకు సగటున రూ.300పైనే సంపాదిస్తుంది. ఇతర పనులకు తోడు ఇది అదనపు ఉపాధి. సిరిసిల్లలో నిత్యం 30 లక్షల మీటర్ల పాలిస్టర్‌ తెలుపు వస్త్రోత్పత్తి జరుగుతుంది. ఇది పార్టీల జెండాలు, కండువాల తయారీకి అనువైంది.

 


   
రాష్ట్రంలోనూ పంపిణీకి చర్యలు..: 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రతి ఇంటికి జాతీయ జెండాను పంపిణీ చేయాలని నిర్ణయించింది. వస్త్రం సేకరణ, జెండాల తయారీ బాధ్యతలను టెస్కోకు అప్పగించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నుంచి పాలిస్టర్‌ వస్త్రాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆర్డర్ల మాదిరిగా (ప్రొడక్షన్‌ ప్రోగ్రాం) కాకుండా నిల్వ ఉన్న వస్త్రాన్ని తీసుకోనున్నారు. నూలు ధరలు పెరగడంతో ప్రభుత్వ ఆర్డర్ల ఉత్పత్తే గిట్టుబాటుకాని పరిస్థితి ఉంది. టెస్కో మీటరుకు రూ.11గా నిర్ణయించింది. పాలిస్టర్‌ వస్త్రోత్పత్తిదారుల సంఘం రూ.13 చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. మూడు రోజులుగా ధరలు కొలిక్కిరావడం లేదు. బుధవారానికి పరిశ్రమలో 70 లక్షల మీటర్ల వస్త్ర నిల్వలున్నట్లు చేనేత, జౌళిశాఖ గుర్తించింది. ఒకవేళ ధరలు విషయం తేలితే బృందాలను ఏర్పాటు చేసి నేరుగా పరిశ్రమల నుంచే సేకరిస్తారు. వస్త్రాన్ని హైదరాబాద్‌లోని మిల్లులకు తరలించి అక్కడ జెండా రంగులు అద్ది, వివిధ కొలతల్లో సిద్ధం చేస్తారు. అక్కడి నుంచి నేరుగా జిల్లా, మండల కేంద్రాలకు సరఫరా చేయనున్నారు.

 

Tags: Flag Festival in Sirisilla-Actions for Distribution in the State

Leave A Reply

Your email address will not be published.