చెత్త శుద్ధి 

Date:19/02/2018
కాకినాడ ముచ్చట్లు:
జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. స్వచ్చ భారత్‌లో భాగంగా పట్టణాలు, నగరాలను చెత్త రహితంగా తీర్చిదిద్దిడమే ఈ పథకం లక్ష్యం. ఏ రోజుకు ఆరోజు ఉత్పత్తి అయిన చెత్తను సేకరించడంతోపాటు రీ-సైక్లింగ్‌ చేసి తిరిగి వినియోగించుకునే సామర్ధ్యం కలిగి ఉండాలి. చెత్తను పారబోసేందుకు డంపింగ్‌ యార్డులను పార్కులుగా తీర్చిదిద్దాలి. వాటిలో చెత్తను రీ- సైక్లింగ్‌ చేసే కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అందుకు అనుగుణంగా ఇంటింటా చెత్త సేకరణ పూర్తిస్థాయిలో అమలు చేయాలి. అలా  సేకరించిన తడి చెత్తను  సేంద్రియ ఎరువుగా మార్చాల్సి ఉండగా, పొడి చెత్తలో పునర్వినియోగానికి పనికివచ్చే వాటిని సేకరించి వాటిని వివిధ రూపాల్లో వినియోగించేలా  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. అవసరమైతే కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవాలి.ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకునే అవకాశం ఉంది. ఈ విషయంలో జిల్లాలోని ఏడు పురపాలక సంఘాలు, రెండు నగరపాలక సంస్థల్లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. తడి చెత్త నుంచి సేంద్రియ ఎరువును తయారు చేయడం, పొడి చెత్తను రీసైక్లింగ్‌ చేసే విధానాలు మచ్చుకైనా కనిపించడం లేదు. కొన్ని పురపాలికల్లో డంపింగ్‌ యార్డులు లేకపోవడంతో చెత్త నిర్వహణ భారంగా మారుతోంది. ప్రత్యామ్నాయం లేని పరిస్థితుల్లో చెత్తను ఖాళీ ప్రదేశాల్లో పారబోయడం, కొన్నిచోట్ల నిప్పుపెట్టడంతో వచ్చే పొగ కారణంగా   ప్రజలు కాలుష్యం బారిన పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం డంపింగ్‌ యార్డులకు స్వస్తి చెప్పేందుకు జీరో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియకు నాంది పలికింది. దీనిలో భాగంగా ఆయా మున్సిపాలిటీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.జిల్లాలోని మున్సిపాలిటీల్లో చెత్త తరలింపు ప్రక్రియలో సైతం నిర్లక్ష్యం వెంటాడుతోంది. చెత్తను సేకరించడంతో పాటు, తరలించేందుకు ట్రాక్టర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. రాజమహేంద్రవరం, కాకినాడ నగరపాలక సంస్థలను మినహాయిస్తే అక్కడక్కడ ఇంకా కాలం చెల్లిన వాహనాలను వినియోగిస్తున్నారు. వీటికి తోటు ట్రాక్టర్లపై సామర్ధ్యానికి మించి చెత్తను ట్రాక్టర్‌పై ఎక్కించి తరలించడం ద్వారా వ్యర్థాలు మళ్లీ పరిసర ప్రాంతాల్లోనే పడిపోతున్నాయి. కోర్టు నిబంధనల ప్రకారం చెత్త తరలించే ట్రాక్టరు ట్రక్కునకు పూర్తిగా నెట్‌ వాడాల్సి ఉండగా ఎక్కడా అమలు కావడం లేదు. ఇక వాహనాలు అందుబాటులోని చోట్ల తరలించేందుకు ఆస్కారం లేకపోవడంతో ఎక్కువ కాలం చెత్తను ఆవాసాల మధ్యే నిలిపివేస్తున్నారు. దీంతో వ్యర్థాలు కుళ్లి రోగాలకు నిలయంగా మారుతున్నాయి.ఇంటింటా చెత్త సేకరణలో భాగంగా పొడి చెత్తను రీ-సైక్లింగ్‌ చేస్తారు. తద్వారా వచ్చే వ్యర్ధాలతో జిల్లాలో విద్యుత్తు ప్లాంట్‌ నెలకొల్పాలని గతంలో అధికారులు ప్రతిపాదించారు. వేమగిరి వద్ద ప్లాంట్‌ ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. స్థల సేకరణలో నాయకుల మధ్య కుదరని సయోధ్య కారణంగా ఆ ప్రాజెక్టు వెనక్కు మళ్లింది. దీంతో పొడి చెత్త నిర్వహణ లేకపోవడంతో డంపింగ్‌ చేసిన చోటే కాల్చివేస్తున్నారు. పొడి చెత్తలో ఉండే ప్లాస్టిక్‌ వ్యర్థాలు, ఇతర వస్తువులు కాల్చడం వల్ల విషవాయువులు గాలిలో కలిసి విషతుల్యమవుతున్నాయి.
Tags: Rubbish cleaning

ఇల్లు సరే.. బిల్లులేవి..? 

Date:19/02/2018
మచిలీపట్నం ముచ్చట్లు:
 ప్రభుత్వ ప్రోత్సాహంతో ఎట్టకేలకు సొంత ఇల్లు సమకూర్చుకుందామని ఆశపడిన లబ్ధిదారులకు చివరికి ఎదురుచూపులే మిగులుతున్నాయి. జిల్లాలో అమలవుతున్న ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణం, ఎన్టీఆర్‌ గ్రామీణ- పీఎంఏవై పథకాల కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు అసంపూర్తి నిర్మాణాలతో సతమతమవుతున్నారు. సామాన్య, మధ్యతరగతికి చెందిన వీరంతా సొంతింటి కల నెరవేరుతుందనే భావనతో  కుటుంబానికి ఆసరాగా ఉండే పాడిపశువులను సైతం తెగనమ్ముకున్నారు. మరికొందరు పుస్తెలను తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు పొంది నిర్మాణాలను చేపట్టారు. రాయితీ నిధులతో పాటు ఉపాధి హామీ (నరేగా) నిధుల విడుదలలో మాత్రం మూడు నెలలుగా జాప్యమవుతోంది.
 ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. బకాయి చెల్లించాలని వ్యాపారులు ఒత్తిడి చేస్తుండటంతో లబ్ధిదారులు ముఖం చాటేయాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు రాయితీగా ఇస్తున్న నిధుల మంజూరు ప్రారంభంలో కొంత జాప్యం జరగ్గా, అనంతరం పక్కాగృహం నిర్మాణ దశలను బట్టి విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాలకు జమచేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో మంజూరైన వాటికి బేస్‌మెంట్‌, లింటల్‌, శ్లాబ్‌ దశల్లో లబ్ధిదారులకు నిధులు మంజూరు చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన వాటికి కూడా ప్రభుత్వాలు ప్రకటించిన నిధుల మంజూరు కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. బిల్లులు మంజూరైతే చేసిన అప్పులు తీర్చుకోవాలనేభావనలో ఉన్నారు. మరోవైపు బకాయిలపై వడ్డీ భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎన్టీఆర్‌ గ్రామీణ గృహనిర్మాణం కింద రూ.1.50 లక్షల యూనిట్‌తో చేపట్టిన గృహనిర్మాణాలకు రూ.95 వేల వరకు, ఎన్టీఆర్‌- ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద రూ.2 లక్షల యూనిట్‌తో చేపట్టిన నిర్మాణాలకు రూ.1.23 వేల వరకు నిర్మాణాలు పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాలకు మాత్రం జమచేశారు. మిగిలిన నిధులు నరేగా నుంచి చెల్లించాల్సి ఉండటంతో లబ్ధిదారులు నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. నిధుల మంజూరులో నెలకొన్న జాప్యంతో కొందరు నిర్మాణాలను మధ్యలోనే నిలిపివేశారు. మిగిలిన మొత్తం మంజూరైన తరువాత ప్రారంభించాలనే భావనలో ఉండటంతో పక్కాగృహాలు కాస్తా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. చివరకు తలదాచుకునేందుకు సైతం లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. కొందరు గుడిసెల్లో కాలం వెళ్లదీస్తుండగా మరికొందరు అద్దె గదుల్లో గడుపుతున్నారు. నరేగా నుంచి గృహనిర్మాణ సంస్థకు నిధుల మళ్లింపు, సాంకేతిక సమస్యల నేపథ్యంలో మిగిలిన బిల్లుల చెల్లింపులో కొంత జాప్యం జరుగుతోందని అధికారులు బదులిస్తున్నారు. నరేగా నిధులు మొదటి విడతగా రూ.25 వేలు, 90 రోజుల పనిదినాలకు సంబంధించిన వేతనాలను లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసేందుకు వివరాలను అంతర్జాలంలో పొందుపర్చే పనిలో నిమగ్నమైనట్లు అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు మాత్రం ఇంకా రాలేదని బదులిస్తున్నారు.గృహనిర్మాణ సామగ్రి, ఇతరత్రా ఖర్చులు పెరిగిన నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వాటికి అదనపు నిధులు విడుదల చేస్తుండటంతో పక్కాగృహాలు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చే లబ్ధిదారులకు ఊరట లభించింది. నిర్మాణ దశలను పరిగణనలోకి తీసుకుంటూ ఇప్పటికే యూనిట్‌ విలువలో సగానికి పైగా నిధులు లబ్ధిదారుల ఖాతాలకు జమయ్యాయి. మిగిలిన నిధుల మంజూరులో నెలకొన్న జాప్యాన్ని ఆసరా చేసుకుని కొందరు గ్రామస్థాయి ఛోటా నాయకులు చేతివాటానికి తెరతీస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.మిగిలిన బిల్లులు చెల్లించాలంటే ‘మా సంగతేమిటి’ అంటూ ఒక్కో ఇంటికి రూ.10 వేల వరకు అధికారుల పేరు చెప్పి డిమాండ్‌ చేస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విజయవాడ ఎంపీ కేశినేని నాని దత్తత గ్రామమైన గొల్లమందలలో ఇదే విధంగా ఛోటా నాయకులు డబ్బులు డిమాండ్‌ చేసినట్లు లబ్ధిదారులు ప్రజాప్రతినిధులకు,  1100 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదులు చేశారు. ఒక్క తిరువూరు నియోజకవర్గం పరిధిలోనే కాకుండా జిల్లాలోనూ కొందరు జన్మభూమి కమిటీ సభ్యులు, ఛోటా నాయకులు డిమాండ్‌ చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు.పక్కాగృహ నిర్మాణాలు పూర్తికాకుండానే, పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించకుండానే అధికారులు, ప్రజాప్రతినిధులు అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా ఆర్భాటంగా గృహప్రవేశాలను అధికారికంగా పూర్తి చేశారు. గృహప్రవేశం చేయించిన ఇళ్లు సైతం నాలుగు నెలలుగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. లక్ష్యాన్ని అధిగమించామని ప్రభుత్వం వద్ద మార్కులు కొట్టేయడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చేసిన గృహప్రవేశాలు లబ్ధిదారుల అవస్థలను మాత్రం తీర్చడం లేదు. వివిధ సందర్భాల్లో గ్రామాలకు వెళ్లిన ప్రజాప్రతినిధుల ఎదుట లబ్ధిదారులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. నెలల తరబడి బిల్లులు నిలిచిపోయాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిలిచిన బిల్లులు త్వరగా చెల్లించేలా మీవంతుగా ప్రయత్నం చేయమంటూ చేతులెత్తి వేడుకుంటున్నారు. కనీసం అధికారులు, ప్రజాప్రతినిధులు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లిస్తే సొంతింటి కల నెరవేర్చాలనే ప్రభుత్వ సమున్నత ఆశయం నెరవేరటానికి దోహదం చేయనుంది.
Tags: The house is ok .. bills ..?

కత్తుల కొరత 

Date:19/02/2018
విజయవాడ  ముచ్చట్లు:
సర్జికల్‌ సామగ్రి ఇంత కొరతగా ఉండటంతో ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఏం చేయాలో దిక్కు తోచటం లేదు. ఈ సామగ్రి సిద్ధంగా ఉన్నాయా? లేవా అని ధ్రువీకరించుకున్నాకే రోగులను శస్త్రచికిత్సల థియేటర్లకు తీసుకెళ్తున్నారు. అప్పటి దాకా వారిని వార్డుల్లోనే ఉంచుతున్నారు. ప్రస్తుతం అవసరమైన సర్జికల్‌ సామగ్రి లేక ఒక్కో రోజు కొన్ని శస్త్రచికిత్సలను సైతం వాయిదా వేస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సర్జికల్‌ బడ్జెట్‌ కింద నిధుల కేటాయింపులు కాగితాలకే పరిమితమయ్యాయి. ఏ ఒక్క ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి దాకా సర్జికల్‌ బడ్జెట్‌ కింద కేటాయించిన నిధులతో సామగ్రిని సరఫరా చేసిన పాపానపోలేదు. అయితే కేటాయింపులు మాత్రం బడ్జెట్‌ పద్దుల్లో కనిపిస్తున్నాయి.ఆంధ్రప్రదేశ్‌ వైద్య మౌలిక సదుపాయాల సంస్థ ఈ సామగ్రిని ఆస్పత్రులకు అందజేసేలా ఒప్పందం ఉంది. ఈ ఏడాది ఆ సంస్థ నుంచి సర్జికల్‌  సామగ్రి ఒక్కటీ రాలేదని గుంటూరు బోధనాస్పత్రి వర్గాలు తెలిపాయి. ఒక్క గుంటూరుకే కాదు.. రాష్ట్రంలోని ఏ బోధనాస్పత్రికీ ఈ సర్జికల్‌ సామగ్రి సరఫరా చేయకపోవటం గమనార్హం. దీంతో ఆస్పత్రుల అధికారులే తెలిసిన షాపుల నుంచి వాటిని సమకూర్చుకుని ఆయా ఖాతాల నుంచి నిధులు మళ్లించి వాటి సరఫరాదారులకు చెల్లింపులు చేస్తున్నారు.ప్రస్తుతం గుంటూరు బోధనాస్పత్రి ఈ సామగ్రి కోసం చేసిన అప్పులు కోట్లకు చేరటంతో అవి ఎక్కడి నుంచి చెల్లించాలి? ఏ పద్దు నుంచి మళ్లిస్తే ఏం ఆడిట్‌ అభ్యంతరాలు వస్తాయోనని అధికారులు హడలిపోతున్నారు. షాపు యాజమాన్యాలు తమ బకాయిలు చెల్లిస్తేనే తిరిగి ఇండెంట్‌ మేరకు సామగ్రి ఇస్తామని స్పష్టం చేయటంతో ఆసుపత్రి అధికారులకు ప్రస్తుతం సర్జికల్‌ సామగ్రిని ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలి? ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద సమకూర్చుకుంటున్న సర్జికల్‌ సామగ్రిని కొంత సాధారణ రోగులకు వినియోగించి ఉన్నంతలో సర్జరీలు చేస్తున్నారు.మరోవైపు ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద నిధులు మళ్లింపు అనేది చేయకూడదని మార్గదర్శకాలు ఉన్నాయి.బోధనాస్పత్రిలో క్యాజువాల్టీకి, అత్యవసర వైద్యానికి, బ్లడ్‌ బ్యాంకుకు అనుబంధంగా అనేక ల్యాబ్‌లు ఉంటాయి. వాటిల్లో అనేక పరీక్షలు నిర్వహిస్తారు. రక్తం తీయాలన్నా, నరాలకు సూది మందు ఇవ్వాలన్నా సిరంజీలు, ఇతరత్రా సర్జికల్‌ సామగ్రి అవసరం. సిరంజిలు ఎక్కడ ఉన్నాయి? దూది ఎక్కడ ఉందో సిబ్బంది వెతుక్కుంటున్నారు. ఈ ల్యాబ్‌ పరికరాలకే కనీసం రూ.10లక్షల నుంచి రూ.15 లక్షల దాకా సామగ్రి అవసరమవుతాయని ఆస్పత్రి అధికారి ఒకరు వివరించారు.గుంటూరు జీజీహెచ్‌లో రోజుకు సగటున మేజర్‌, మైనర్‌ శస్త్రచికిత్సలు 50 వరకు జరుగుతున్నాయి. ఇక ప్రయోగశాలల్లో (ల్యాబ్‌ ఇన్విస్టిగేషన్స్‌)పథాలజీ ల్యాబ్‌లో వెయ్యి మందికి, మైక్రోబయాలజీ పరీక్షలు వంద, బయోకెమిస్త్రీ పరీక్షలు 600, క్యాజువాల్టీ ల్యాబ్‌లో 300 వరకు ఆయా పరీక్షలు జరుగుతాయి. రోజుకు ఇంత పెద్ద సఖ్యలో పరీక్షలు చేయటానికి రూ.15 లక్షల దాకా ఖర్చు వస్తుందని, ఇవన్నీ సర్జికల్‌ బడ్జెట్‌ పద్దు కింద ఏపీఎంఎస్‌ఐడీసీ సరఫరా చేయాలి. కానీ ఈ ఏడాది ఇప్పటి దాకా ఒక్క పరికరం సరఫరా చేయలేదని గుంటూరు ఆస్పత్రి అధికారులు తెలిపారు. విజయవాడ పాత, కొత్త ఆస్పత్రుల్లో కూడా రోజుకు 20-30 శస్త్రచిక్సితలు జరుగుతాయి. ల్యాబ్‌ల్లో పథాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ పరీక్షలు 500కు పైగా జరుగుతాయి. అక్కడా ఈ సర్జికల్‌ సామగ్రి లేక నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర మొత్తానికి గుంటూరు బోధనాస్పత్రి రిఫరల్‌గా ఉండటంతో సగటున రోజుకు అవుట్‌ పేషెంట్లు 2500 నుంచి 3వేల మంది వరకు వస్తున్నారు. వీరిలో సగం మందికి రక్త, మధుమేహం వంటి పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది.
Tags: Shortage of knives

పొంచి ఉన్న నీటి ఎద్దడి?

Date:19/02/2018
ఆదిలాబాద్ ముచ్చట్లు:
వేసవి ఎఫెక్ట్ ప్రారంభమైపోయింది. ఎండలు క్రమంగా విజృంభిస్తున్నాయి. దీంతో తాగునీటి కటకటపై ఇప్పుడే తెలంగాణ వాసుల్లో ఆందోళన మొదలైపోయింది. ప్రధానంగా నిర్మల్ ప్రాంతంలో  భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటి పోతున్నాయి. ఎండాకాలం తీవ్రం ముందే జిల్లాలో నీటి ఎద్దడి మొదలైపోతుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. సాధారణంగా వేసవి వచ్చిందంటే జిల్లాలోని గిరిజన గ్రామాల్లో తాగు, సాగు నీటికి కటకట తలెత్తుతుంది.ప్రజల దాహార్తిని తీర్చే బోరుబావులు వట్టి పోతాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చేతి పంపులు అడుగంటి పోయి పనిచేయడం లేదు. వస్తున్న కొద్దిపాటి నీరు సరిపోక జనాలు చెలిమెలు, వ్యవసాయ బావులను ఆశ్రయిస్తున్నారు. చేతిపంపు వద్ద గంటపాటు కొడితేగానీ బిందెడు రాని దుస్థితి. గుక్కెడు నీటి కోసం ప్రజల కిలోమీటర్ల దూరం నడవాల్సిన దుస్థితి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఎండలు ఎక్కువైతే పరిస్థితులు దారుణంగా మారుతుందని అంతా అంటున్నారు. మరోవైపు ప్రాంతీయంగా చేతిపంపులు, తాగునీటి పథకాలు మరమ్మతులు గురై నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో తాగునీటికి పాట్లు తప్పవన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి వేసవి తీవ్రం కాకుండా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. లేకుంటే గుక్కెడు నీటి కోసం అల్లాడిపోవాల్సిన దుస్థితి నెలకొంటుందని అంటున్నారు. గతేడాది భారీ వర్షాలు కురియడంతో వేసవికి ముందు నీటి ఎద్దడి అంతగా కనిపించలేదు. కానీ ఈ ఏడాది వర్షాలు అనుకున్నంతగా కురవలేదు. కురిసిన కొద్దిపాటి వర్షాల నీటిని భూగర్భంలోకి ఇంకించే చర్యలు ఆశించినంతగా లేకపోవడంతో నీటి సమస్య తలెత్తుతోంది. ఇప్పటికే మారుమూల గిరిజన గ్రామాల్లో నీటికి ఇబ్బంది మొదలైంది. వేసవికి ముందే ప్రత్యమ్నాయ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మిషన్‌ భగీరథపై దృష్టి సారించి చేయాల్సిన పనులను దాటవేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గిరిజన గ్రామాల్లో విద్యుత్‌ సౌకర్యంతో సంబంధం లేకుండా సౌరశక్తితో ఏర్పాటు చేసిన నీటి పథకాలున్నాయి. అయితే ఇవి చాలా చోట్ల పనికిరావడంలేదు. ఎండాకాలం వచ్చిదంటే బాధిత గ్రామాల ప్రజలు దాహార్తి తీర్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. కచ్చితంగా చెప్పాంటే నరకయాతన అనుభవిస్తున్నారు.  జిల్లాలో గతేడాది జనవరిలో సరాసరి 6.86 మీటర్లకు భూగర్భ జలాలు పడిపోయాయి. ఈ ఏడాది ఏకంగా సరాసరి 8.52 మీటర్లకు పడిపోయాయి. ఈ లెక్క చాలు రానున్న రోజుల్లో స్థానికంగా నీటి సమస్య ఎలా ఉండబోతుందో. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా ఇప్పట్నుంచే జాగ్రత్తలు తీసుకోవాలని అంతా విజ్ఞప్తిచేస్తున్నారు.
Tags: Is there a water pump?

 ‘మద్దతు’ చిక్కులు

Date:19/02/2018
ఆదిలాబాద్‌  ముచ్చట్లు:
వాతావరణం కొంత అనుకూలించడంతో ఆదిలాబాద్‌ జిల్లాలో ఈ దఫా శనగ పంట దిగుమతులు ఆశించినంతగానే లభించాయి. దిగుబడి బాగానే ఉన్న మద్దతు ధర దగ్గరే రైతన్నకు కష్టాలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో వానకాలంలో పత్తికి ప్రత్యామ్నాయంగా సోయా సాగు చేస్తారు. ఏటా సోయా తర్వాత యాసంగిలో రైతులు శనగ సాగు చేస్తారు. ఈ ఏడాది 63 వేల ఎకరాల్లో సాగు చేశారు. 24 గంటలు విద్యుత్తు సరఫరా చేయడంతో ఆశించిన దిగుబడులు వచ్చాయి. అయితే పంట బాగున్నా వివిధ కారణాలతో వ్యాపారులు, దళారులు తక్కువ రేటు చెప్తున్నారు. దీంతో రైతులకు గిట్టుబాటు ధర లభించని పరిస్థితి నెలకొంది. మరోవైపు వ్యాపారుల, దళారుల మాయాజాలం మొదలైపోయింది. నెల రోజుల కిందట బాగానే ఉన్న ధర పంట చేతికొచ్చే సమయానికి తగ్గుముఖం పట్టాయి. ఇరు వర్గాలు కుమ్మక్కై శనగ రేటును తగ్గించేశారని పలువురు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే రేటు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు సర్కారు కొనుగోళ్లపైనే ఆశలు పెట్టుకున్నారు. సోయా, కందుల మాదిరిగా మద్దతు ధరతో శనగ పంటను కూడా కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పంట చేతికొస్తున్న సమయంలో కొన్నిరోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు కొంతమేర నష్టం వాటిల్లింది. మరోవైపు మార్కెట్‌లో ధరలు తగ్గిపోతుండటంతో రైతుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. చివరికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.4,400 ఉండగా, బహిరంగ విపణీలో క్వింటాలు ధర రూ.3,600-4000లోపు ఉంది. గతేడాది క్వింటాలు ధర రూ.5 నుంచి 6వేల లోపు ధర ఉండటంతో ప్రభుత్వ రంగ సంస్థల అవసరం లేకుండా పోయింది. మద్దతు ధర కంటే బయట మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉండటంతో రైతులు ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకున్నారు. కానీ ఈ ఏడాది దానికి వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయి. మార్కెట్‌లో పూర్తిగా ధర తగ్గిపోవడంతో రైతులు సర్కార్‌ కొనుగోళ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇదిలాఉంటే పంట చేతికొస్తున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. సర్కార్‌ పరంగా కొనుగోళ్లు ఉంటాయన్న ప్రకటనలూ రావడంలేదు. దీంతో శనగ పంటను అమ్ముకోవాలో, ఆగాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వరమే స్పందించి శనగ పంటను కొనుగోలు చేసేందుకు ముందుకు రావాలని దీనిపై అధికారిక ప్రకటన చేయాలని రైతు సంఘం నాయకులు కోరుతున్నారు.
Tags: ‘Support’ implications

రెచ్చిపోతున్న ఇసుకాసురులు

Date:19/02/2018
రాజన్న సిరిసిల్ల  ముచ్చట్లు:
అధికారయంత్రాంగం ఉదాసీనత ఇసుకాసురులకు కావాల్సినంత జోష్‌నిస్తోంది. ఏం చేసినా పట్టించుకోరన్న ధీమాతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ రూ.కోట్లు దండుకుంటున్నారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రజల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్నా ఈ అక్రమాలకు అడ్డుకట్టపడడంలేదు. నిజాయితీ పరులైన అధికారులు ఈ దందాకు చెక్‌ పెట్టేందుకు యత్నిస్తే వారికి బెదిరింపులు ఎదురవుతున్నాయి. మరీ మాట వినకపోతే బదిలీ వేటుకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తున్న తంతే ఇది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఇదే దందా సాగుతున్నట్లు స్థానికులు అంటున్నారు. కొత్తపల్లి మండలం ఖాజీపూర్‌, ఎలగందుల, బొమ్మకల్‌, ముగ్ధుంపూర్‌, చేగుర్తి గ్రామాల్లోని మానేరు వాగు, ఇరుకుల్ల వాగులో మంచి ఇసుక నిల్వలు ఉన్నాయి. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వాగులో దుమ్ము, మట్టి రేణువులు లేని తెల్లటి ఇసుక ఉంటుంది. ఈ ఇసుకకు కరీంనగర్‌తో పాటు హైదరాబాద్‌లోనూ భారీ డిమాండ్‌ ఉంది. దీంతో అక్రమార్కులు ఇక్కడి ఇసుకను కొల్లగొడుతున్నారు.  ఇసుక అక్రమ రవాణా వల్ల ప్రభుత్వానికి ఏటా కోట్లాది రూపాయలు నష్టం వాటిల్లుతోంది. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తుండడంతో ఈ అక్రమానికి తెరపడడంలేదు. అక్రమ రవాణాను నియంత్రణలో కీలకంగా వ్యవహరించాల్సిన మైనింగ్‌, విజిలెన్స్‌, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయలోపం సమస్యగా మారిందని స్థానికులు అంటున్నారు. ఎవరికి వారు తమకేమీ పట్టనట్లుగా ఉండడంవల్ల ఈ దందా యథేచ్ఛగా సాగిపోతోందని చెప్తున్నారు. పోలీసు విభాగం అప్పుడప్పుడు దాడులు చేయడం, రహస్య ప్రాంతాల్లోని డంపులను స్వాధీనం చేసుకున్నా పెద్దగా ఫలితం లేకుండా పోతోందని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఇసుక అక్రమ రావాణా సాగుతున్న ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోజూ వందలాది ఇసుక ట్రాక్టర్లు, లారీల రాకపోకలతో రహదారులు రూపు కోల్పోయాయి. రోడ్లపై రెండు, మూడు అడుగుల మేర ఇసుక పేరుకుపోవడంతో మట్టి దారులను తలపిస్తున్నాయని అంతా అంటున్నారు. ట్రాక్టర్ల రాకపోకలతో దుమ్ము ఎగిసి పడుతుండడంతో  ముఖానికి ముసుగులు లేకుండా బయటకు రాని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారి సంఖ్య కూడా పెరుగుతోందని అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత యంత్రాంగం స్పందించి ఇసుక అక్రమ రావాణాకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Tags: Raging Sasper

సేకరణ నిలిపివేత..రైతులకు కలత..

Date:19/02/2018
జగిత్యాల  ముచ్చట్లు:
బయట మార్కెట్‌లో తగిన ధర లేకున్నా ప్రభుత్వ పరంగా సాగే కొనుగోళ్లు ఆదుకుంటాయని కంది రైతులు ఆశపడ్డారు. ప్రభుత్వం చెల్లించే గిట్టుబాటు ధరతో ఈ దఫా ఆర్ధిక సమస్యలు కొంతైనా తీరతాయని భావించారు. అయితే ఈ ఆశలు ఎంతోకాలం నిలవలేదని కరీంనగర్ జిల్లా కంది రైతులు అంటున్నారు. సర్కార్‌ కంది కొనుగోళ్లు ముగించనుండడమే దీనికి కారణమని చెప్తున్నారు. వివరాల్లోకి వెళ్తే కేంద్ర పరిమితి ప్రకారం కందుల కొనుగోళ్లను ముగించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. కానీ జిల్లాకు కేటాయించిన లక్ష్యం పూర్తికాలేదు. లక్ష్యం చేరుకోకుండానే కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌లలోని మార్క్‌ఫెడ్‌ కేంద్రాలను  మూసివేశారు. కేవలం జగిత్యాల కేంద్రాన్ని మరో రెండు మూడు రోజులు కొనసాగించే అవకాశముంది. దీంతో కంది రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. పలువురు రైతులు పంటను ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు తీసుకురాలేదు. ప్రభుత్వం గనుక కొనుగోళ్లు నిలిపివేస్తే వారంతా దళారులు, ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకోవాలి. అదే జరిగితే వారు ఎంత ధర నిర్ణయిస్తే అంతకే విక్రయించాలి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. వాస్తవానికి తెలంగాణలో 1.70 లక్షల టన్నుల సేకరణను కేంద్రం అనుమతించింది. ఈ మేరకు మిగిలిన జిల్లాల్లో కందులను కొనుగోలు చేశారు. జగిత్యాల జిల్లాలో 23 వేల టన్నుల కందులను కొనుగోలు చేసేందుకు 5 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ 5,152  క్వింటాళ్లను మాత్రమే సేకరించారు. ఈలోపే రాష్ట్రవ్యాప్త పరిమితి ముగిసిందన్న కారణంతో కేంద్రాలను మూసివేయడంపై రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. క్వింటాల్ కందులకు ప్రభుత్వ ధర రూ.5,450 ఉంది. బయటి మార్కెట్‌లో రూ.4వేలకు లోపే ధరలున్నాయి. దీంతో ప్రభుత్వ కేంద్రం ఉంటే రైతులకు కొంత లాభించే అవకాశం ఉంది. అయితే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన వారంపది రోజుల్లోనే మూసివేయడంతో రైతుల్లో ఆవేదన వెల్లువెత్తుతోంది. కందులన్నీ విక్రయించే వరకు కేంద్రాలను కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం కరుణించకపోతే ఈ ఏడాది కష్టాలనష్టాలకోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేకుండా పోతుందని ఆర్ధిక సమస్యలను గట్టెక్కలేమని వాపోతున్నారు.
Tags: Disrupting the collection ..

ఈ-టెండర్‌ ద్వారా తునికాకు సేకరణ

Date:19/02/2018
భద్రాద్రి కొత్తగూడెం ముచ్చట్లు:
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో నాణ్యమైన తునికాకు లభ్యమవుతుంది. మన్యం ప్రాంతాల్లో ఇదే వేసవి పంటగా వేస్తారు. దీంతో తునికాకును సేకరించేందుకు ఈ-టెండర్ విధానం అవలంబించనున్నారు అధికారులు. ఈ ఏడాది నుంచే తొలిసారిగా ఈ-టెండర్‌ విధానం అమలు చేయాలని సర్కార్ నిర్ణయించినట్లు అధికారులు చెప్తున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో గతం నుంచే ఈ-టెండర్‌ విధానం అమలు జరుగుతోంది. ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని 295 యూనిట్లలో 2115 బీడీ ఆకు కల్లాలు ఉన్నట్లు సమాచారం. వీటి ద్వారా ఈ సంవత్సరం 2,82,800 స్టాండర్డు బ్యాగుల ఆకు సేకరణ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఖమ్మం జిల్లాలో ఆరు యూనిట్లు ఉడడగా కామేపల్లి, అడవిమద్దులపల్లి, గుబ్బగుర్తి యూనిట్లు ఉండగా సత్తుపల్లి డివిజన్‌లోని అన్నపురెడ్డిపల్లి, మండాలపాడు, కనకగిరి(బి) యూనిట్లలో 71 కల్లాలు ఉన్నాయి. వీటి ద్వారా ఈ సవంత్సరం 3,700 స్టాండర్డు బ్యాగుల సేకరించాలని నిర్ణయించుకున్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం సర్కిల్‌ పరిధిలోని కొత్తగూడెం జిల్లా, మహబూబాబాద్‌ జిల్లాలున్నాయి. ఈ సర్కిల్‌ పరిధిలో మొత్తం 62 యూనిట్లలో 892 కల్లాలున్నాయి. వీటి ద్వారా 73,800 స్టాండర్డు బ్యాగులు సేకరించడం లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. భద్రాచలం మన్యంలో అత్యంత నాణ్యమైన తునికాకు లభిస్తుందని అధికారులు చెప్తున్నారు. వేసవిలో గ్రామీణ ప్రాంత కూలీలకు ఈ ఆకుల సేకరణే ఉపాధి మార్గంగా ఉంటోంది. ఇక తునికాకు ద్వారా ఏటా ప్రభుత్వానికి రూ.కోట్ల ఆదాయం సమకూరుతోంది. టెండర్ల ప్రక్రియ పూర్తి కాగానే కాంట్రాక్టర్లు మొట్టు కొట్టే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమం పూర్తయిన 40 రోజులకు ఆకు సేకరణ మొదలుపెడతారు. ఉమ్మడిజిల్లాలో అధిక శాతం తునికి ఆకు అడవుల నుంచి లభిస్తుంది. మైదాన ప్రాంతాల నుంచి తక్కువగానే దొరుకుతుంది. ఈ-టెండర్‌ విధానం వల్ల అటవీశాఖ అధికారులకు చాలా వరకు ఇబ్బందులు తీరనున్నాయి. ఈ-టెండర్‌ విధానం రావడంతో ఆన్‌లైన్‌ ద్వారానే కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేస్తారు. టెండర్లు పరిశీలించి అధికారులు వాటిని ఖరారు చేస్తారు. గతంలో స్థానిక రాష్ట్రం నుంచే అనేక మంది గుత్తేదారులు టెండర్ల విషయంలో ఒక్కో సారి రింగయ్యే అవకాశం ఉండేది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చెందిన కాంట్రాక్టర్లు కూడా ఈ-టెండర్లలో పాల్గొనే ఛాన్స్ ఉంది. దీంతో పోటీ పెరిగి యూనిట్ల ధర కూడా పెరుగుతుందని అధికారులు అంటున్నారు. టెండర్లు కూడా పారదర్శకంగా ఉండటం వల్ల ఎలాంటి అక్రమాలకు ఆస్కారం ఉండదని చెప్తున్నారు.
Tags: A collection of Thunika by e-tender