వరద- బురద

ఏలూరు ముచ్చట్లు:

ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి, శబరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం నిర్వాసిత మండలాలైన విఆర్‌.పురం, కూనవరం, ఎటపాక, చింతూరుల్లో వరద పెరుగుతోంది. బాహ్య ప్రపంచంతో చాలా ఊళ్లకు సంబంధాలు తెగిపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వందలాది గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిల్చిపోయింది. భద్రాచలం వద్ద నీటిమట్టం 50 అడుగులకు చేరితే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించే అవకాశముంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం అరకొరగా ఏర్పాటు చేసిన పునరావాస కాలనీల్లో సౌకర్యాలు కరువవడంతో బాధితులు నిద్ర సైతం కరువైంది. విఆర్‌.పురం మండలంలోని బాధితులు వరద పోటు నుంచి తప్పించుకునేందుకు ఇళ్లను వదిలి గుట్టలపైకి ఎక్కి సొంత డబ్బులతో గుడారాలు వేసుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రభుత్వం టార్ఫాలిన్లు సైతం ఇవ్వకపోవడంతో బాధితులే వాటిని కొనుక్కుంటున్నారు. వారం రోజులుగా విద్యుత్తు సరఫరా లేకపోవడంతో అంధకారంలోనే గడుపుతున్నారు. ప్రభుత్వం కొంత మందికి 25 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుంది. ప్రభుత్వం నిత్యావసర సరుకులను, కొవ్వొత్తులను వీరికి అందించలేదు. సాయంత్రం ఐదు గంటలు తరువాత వీరంతా అంధకారంలోనే జీవిస్తున్నారు. దోమలు విపరీతంగా కుడుతున్నాయని, రెప్పవేయలేకపోతున్నామని బాధితులు చెబుతున్నారు.

 

 

 

ఈ మండలంలో 60 గ్రామాలకు గత ఆదివారం నుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పునరావాస కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. జనరేటర్‌ ఏర్పాటు కూడా లేదు. కూనవరం మండలంలోని పలు గ్రామాల ప్రజలు కోతులగుట్టకు, విఆర్‌.పురం మండలంలోని రేఖపల్లికి ఎక్కువ మంది వెళ్లిపోయారు. ఈ మండలంలోని 52 గ్రామాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చింతూరులో 80 గ్రామాల ప్రజలు ముంపులోనే ఉన్నాయి. గోదావరి, శబరి ఉధృతి మరింతగా పెరుగుతుండడంతో బాధితులు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్నారు. వందేళ్లలో ఇంతటి వరదలను ఎప్పుడూ చూడలేదని చర్చించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ వారం రోజులుగా చింతూరులోనే ఉండి ముంపు మండలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.ఎటపాక మండలంలో 35 వరద ప్రభావిత గ్రామాలు ఉండగా వాటిలో 24 నీట మునిగాయి. సుమారు 13 వేల మంది నిరాశ్రయులయ్యారు. నాలుగు వేల ఇళ్లలోకి వరద నీరు చేరిందని అధికారులు తెలిపారు. నిర్వాసితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు చెప్తున్నా, వరద అంచనా సమాచారం సైతం అధికారులు తెలపలేదని, స్వచ్ఛందంగా తామే ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు వచ్చామని బాధితులు వాపోతున్నారు. మూడు రోజులుగా కరెంట్‌ లేకపోవడంతో సెల్‌ఫోన్లు మూగబోయాయని, సామాజిక మాధ్యమాల్లో ఇస్తున్న సమాచారం కూడా తెలియడం లేదని వరద బాధితులు అంటున్నారు. గుండాల గ్రామంలో చిక్కుకున్న 80 మందిని శుక్రవారం అర్ధరాత్రి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాల సాయంతో గుండాల కాలనీ గ్రామంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు. భద్రాచలాన్ని ఆనుకుని ఉన్న ఎటపాకలో కరకట్టపైనుంచి వరద నీరు గ్రామంలోకి చేరడంతో ఆ గ్రామస్తులను స్థానిక ఇంజినీరింగ్‌ కళాశాలలోని పునరావాస కేంద్రానికి తరలించారు.

 

 

Tags: Flood- mud

Leave A Reply

Your email address will not be published.